ఆంధ్రప్రదేశ్: మేనమామ ఇంట్లో పెట్రోలు పోసి నిప్పుపెట్టిన వ్యక్తి.. ముగ్గురి మృతి - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

మేనమామ కుటుంబంపై కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి ఆయన ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్నవారిపై పెట్రోలు పోసి నిప్పంటించి, తలుపులు వేసి పరారయ్యాడని పోలీసులను ఉటంకిస్తూ ఈనాడు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలో ముగ్గురు చనిపోయారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పత్రిక రాసింది.

ఈనాడు కథనం ప్రకారం- కోట్ని సత్యవతి, అప్పారావు దంపతులు ఎనిమిదేళ్ల కిందట ఉపాధి నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతం నుంచి తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి వలస వచ్చారు. అప్పారావు స్థానిక మెకానిక్‌ షెడ్‌లో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు గంటా దుర్గాభవానీ, రామలక్ష్మి, సీతామహాలక్ష్మి, కుమారుడు కోట్ని రాము ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు వివాహాలయ్యాయి.

నిందితుడు మాసాడా శ్రీనుది చిత్తూరు జిల్లా తిరుపతి.

మంగళవారం రాత్రి సత్యవతి కుటుంబ సభ్యులు నిద్రకు ఉపక్రమించారు. సత్యవతి కుటుంబంపై మనస్పర్థలతో కక్ష పెంచుకున్న మాసాడా శ్రీను మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.45 గంటలకు ఇంట్లోకి చొరబడి, గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోలు పోసి నిప్పుబెట్టాడు. తలుపులు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఇంట్లోని వారిని మంటలు చుట్టుముట్టాయి. సత్యవతి కుమారుడు రాము(18), పెద్దకుమార్తె దుర్గాభవానీ బిడ్డ విజయలక్ష్మి(5) సజీవ దహనమయ్యారు.

సత్యవతితోపాటు దుర్గాభవానీ, సత్యవతి మనుమలు దుర్గామహేశ్‌, ఏసుకుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ సత్యవతి బుధవారం మృతిచెందారు.

దుర్గాభవానీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన జరిగినప్పుడు అప్పారావు ఇంట్లో లేరు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆయన నైట్‌ డ్యూటీకి వెళ్లారు.

బాధితుల ఇల్లు కాలుతుండడాన్ని రాయవరంలో జరుగుతున్న తీర్థానికి వెళ్తున్న కొందరు యువకులు గమనించి, ఇంటి తలుపు గొళ్లెం తొలగించి లోపల ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. పక్కగదిలోనే ఉంటున్న ఇంటి యజమాని కానూరి రామాయమ్మను కూడా వారు బయటకు తీసుకొచ్చారు.

దుర్గాభవానీ కాకినాడ సమీపంలోని గొర్రిపూడిలో తన భర్త, ముగ్గురు పిల్లలతో నివాసముంటున్నారు. గత నెల 17న తన తల్లిపై దాడి జరగడంతో పరామర్శించేందుకు దుళ్ల వచ్చారు.

నిందితుడి కోసం గాలిస్తున్నామని ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రజాస్వామ్య సూచీలో 10 స్థానాలు దిగజారిన భారత్

ది ఎకనామిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌(ఈఐయూ) తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం ప్రపంచ ప్రజాస్వామ్య సూచీలో భారత్‌ 51వ స్థానంలో నిలిచిందని, 2018తో పోలిస్తే 2019లో పది స్థానాలు దిగజారిందని సాక్షి తెలిపింది.

భారత దేశంలో పౌర హక్కులు హరించుకుపోతుండటమే ఇందుకు కారణమని ఈఐయూ వివరించింది. ప్రపంచంలోని 165 స్వతంత్ర దేశాలు, 2 స్వతంత్ర ప్రాంతాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ అమలు తీరుపై ఈఐయూ ఈ అంచనాలను రూపొందించింది.

2018లో ప్రజాస్వామ్య సూచీలో ఈఐయూ భారత్‌కు 7.23 పాయింట్లు ఇవ్వగా 2019కు వచ్చేసరికి 6.90 పాయింట్లు మాత్రమే కేటాయించింది. దేశంలో పౌరహక్కులు హరించుకుపోతుండటంతో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉండటమే దీనికి ప్రాథమిక కారణమని వ్యాఖ్యానించింది.

ఈ ర్యాంకింగ్‌లో నార్వే, ఐస్‌ల్యాండ్, స్వీడన్‌ మొదటి మూడు స్థానాల్లో నిలవగా ఉత్తరకొరియా అట్టడుగున 167వ స్థానంలో ఉంది.

ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వం పనిచేసే విధానం, రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు.. అనే అంశాల ఆధారంగా ఈ ఇండెక్స్‌ను ఈఐయూ రూపొందించింది.

ఈ అంశాల్లో వచ్చిన పాయింట్ల ఆధారంగా ఆయా దేశాలను సంపూర్ణ ప్రజాస్వామ్యం (8 కంటే ఎక్కువ పాయింట్లు), బలహీన ప్రజాస్వామ్యం(6 పాయింట్ల కంటే ఎక్కువ.. 8 లేదా అంతకంటే తక్కువ), మిశ్రమ పాలన (4 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ), నియంతృత్వం (4 లేదా అంతకంటే తక్కువ పాయింట్లు).

ఇందులో 8 కంటే తక్కువ 6 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్‌లో బలహీన ప్రజాస్వామ్యం ఉందని తేల్చింది.

ఈ సూచీలో చైనా 2.26 పాయింట్లతో 153వ ర్యాంకుతో దాదాపు అట్టడుగున ఉంది.

2019లో చైనాలో వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, పౌరులపై పెరిగిన నిఘాతోపాటు జిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో మైనారిటీలపై తీవ్ర వివక్ష ఇందుకు కారణాలని పేర్కొంది.

బ్రెజిల్‌ 52(6.86 పాయింట్లు), రష్యా 134(3.11), పొరుగుదేశాలైన పాకిస్తాన్ 108(4.25), శ్రీలంక 69 (6.27), బంగ్లాదేశ్‌ 80(5.88)వ ర్యాంకుల్లో ఉన్నాయి.

తెలంగాణలో పిరమల్ రూ.500 కోట్లు పెట్టుబడి

తెలంగాణలో ప్రస్తుతం తనకున్న పిరమల్‌ ఫార్మా ఫెసిలిటీ సెంటర్‌ను విస్తరించి మరింత బలోపేతం చేసేందుకు రానున్న మూడేండ్లలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు అంతర్జాతీయ సంస్థ 'పిరమల్‌' ప్రకటించిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు సందర్భంగా తెలంగాణ పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం దావోస్‌లో పిరమల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఆ సంస్థ తన నిర్ణయాన్ని ప్రకటించింది.

పిరమల్‌ సంస్థకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయసహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌లో తమ ప్లాంట్‌ను విస్తరించడంతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను కూడా హైదరాబాద్‌కు తరలించే అవకాశాలను పరిశీలిస్తామని పిరమల్‌ గ్రూప్‌ ప్రకటించింది.

దావోస్‌లో బుధవారం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు పాల్గొన్నారు.

గూగుల్‌, ఆల్ఫాబెట్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో మంత్రి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో గూగుల్‌ కార్యకలాపాల విస్తరణపై వీరు చర్చించారు.

పెరుగు తయారుచేసే ఫ్రిజ్

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్‌ కొత్త శ్రేణి 2020 రిఫ్రిజిరేటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చిందని, ఈ కొత్త తరం ఫ్రిజ్‌లు పెరుగు కూడా తయారు చేయగలుగుతాయని ఆంధ్రజ్యోతి తెలిపింది.

డైరెక్ట్‌ కూల్‌, సింగిల్‌ డోర్‌ విభాగంలో 198, 192 లీటర్ల సామర్థ్య ఉన్న ఫ్రిజ్‌‌లను సంస్థ విడుదల చేసింది. వీటి ధర రూ. 17,990, రూ.45,990. భారత్‌లో తొలిసారిగా సామ్‌సంగ్‌ ఫ్రాస్ట్‌ఫ్రీ, డైరెక్ట్‌ కూల్‌ విభాగాలు రెండింటిలోనూ కొత్త తరం ఫ్రిజ్‌లను విడుదల చేసింది.

ఈ ఫ్రిజ్‌లు తక్కువ ఇంధనం ఉపయోగించుకోవడంతో పాటు మరింత విశాలమైన స్టోరేజీతో అన్ని రకాల వినియోగదారులకు తగినట్టుగా ఉంటాయని సామ్‌సంగ్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లన్‌ తెలిపారు. ఈ కొత్త తరం ఫ్రిజ్‌లు తమ మార్కెట్‌ వాటాను మరింతగా పెంచుతాయన్న ఆశాభావం ఆయన ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)