You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తత్కాల్ టికెట్ల రాకెట్: మదర్సాలో చదివి.. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగి.. నెలకు రూ.10 కోట్లు కొల్లగొడుతున్న వ్యక్తి అరెస్ట్ : ప్రెస్ రివ్యూ
తత్కాల్ టికెట్లను సాంకేతికంగా పెద్ద ఎత్తున కొల్లగొడుతున్న ఒక భారీస్థాయి ఈ-రాకెట్‌ను ఆర్‌పీఎఫ్ పోలీసులు భగ్నం చేసినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.
ఈ రాకెట్‌కు ఉగ్రవాద నిధులకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తత్కాల్ టికెట్లను సాంకేతికంగా కొల్లగొడుతున్న గులాం ముస్తఫా(28) అనే వ్యక్తిని భువనేశ్వర్‌లో అరెస్ట్ చేశారు.
ఇతడికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో లంకె ఉందని భావిస్తున్నారు.
ముస్తఫా అలియాస్ హమీద్ అష్రఫ్ దగ్గర ఐఆర్‌టీసీసీ వ్యక్తిగత ఖాతాలు(ఐడీలు) 563 ఉన్నట్లు కథనంలో చెప్పారు.
దాదాపు 2400 ఎస్‌బీఐ శాఖలు, 600 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు శాఖల జాబితా అతడి దగ్గర లభించాయి. వాటన్నిటిలోనూ నిందితుడికి ఖాతాలు ఉన్నట్లు సమాచారం.
నెలకు రూ.10-15 కోట్ల మేర ఆదాయం లభించే ఈ-రాకెట్ ముఠాలో ప్రధాన సూత్రధారి అతడే అని ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ మంగళవారం దిల్లీలో విలేకరులకు వెల్లడించినట్లు ఈనాడు చెప్పింది.
అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి వాటితో అతడికి సబంధం ఉన్నట్లు తమకు లభ్యమైన సమాచారాన్ని బట్టి అర్థమవుతోందని చెప్పారు.
మదర్సాలో చదువుకున్న ముస్తాఫా సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఎదిగాడు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తత్కాల్ టికెట్లు తీసుకోడానికి చేసుకున్న ఏర్పాట్లు దర్యాప్తు అధికారులను నివ్వెరపరిచయని పత్రిక రాసింది.
ఐఆర్‌సీటీసీలో లాగిన్ అయ్యేందుకు, టికెట్ బుకింగ్‌కు నమోదు చేయాల్సిన సంకేతాలు(క్యాప్చాలు) గాని, బ్యాంకు ఓటీపీ గానీ అవసరం లేని రీతిలో సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసి ఉపయోగిస్తున్నట్లు బయటపడింది.
సాధారణంగా ఐఆర్‌సీటీసీ ద్వారా తత్కాల్ టికెట్ తీసుకోడానికి 2.55 నిమిషాలు పడితే, ఈ సాఫ్ట్‌వేర్ సాయంతో 1.48 నిమిషాల్లోనే పని పూర్తి చేస్తున్నట్లు గుర్తించారు.
వేర్వేరు యూజర్ ఐడీలతో ముదే నింపి ఉంచిన సమాచారంతో ఏకకాలంలో ఎన్నో టికెట్లు తీసుకోడానికి అతడి ఈ సొంత సాఫ్ట్ వేర్ దోహదం చేస్తోంది.
బెంగళూరులో ప్రస్థానం మొదలుపెట్టిన ఇతడు అక్రమ మార్గంలో టికెట్లు తీసుకోడానికి కొంతకాలంలోనే ప్రోగ్రామర్లన నియమించుకునే స్థాయికి ఎదిగినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని అరుణ్ కుమార్ చెప్పినట్లు ఈనాడు రాసింది.
'నారప్ప'గా మారిన విక్టరీ వెంకటేష్
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు 'నారప్ప' అనే టైటిల్ పెట్టినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
ఈ చిత్రంలో ప్రియమణి కథానాయికగా నటిస్తారని తెలిసింది.
ఈ చిత్రాన్ని డి.సురేష్ బాబు, కలైపులి యస్.థాను నిర్మించనున్నారు.
తమిళంలో సూపర్ హిట్ అయిన ధనుష్ 'అసురన్'కు ఇది రీమేక్ అని సాక్షి చెప్పింది.
ఈ సినిమాకు 'నారప్ప' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది.
ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని, తొలి షెడ్యూల్ అనంతపురంలో మొదలవుతుందని పత్రిక చెప్పింది.
ప్రస్తుతం ఈ సినిమాలో తన క్యారెక్టర్ లుక్, బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై వెంకటేష్ దృష్టి పెట్టారని కథనంలో రాశారు.
క్షమాపణ అడగను: రజనీకాంత్
పెరియార్ మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ 1971లో దేవతా విగ్రహాలను అవమానించారంటూ ఈ నెల 14న తుగ్లక్ మేగజైన్ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలపై డీఎంకే, ద్రవిడ కళగం, తందై పెరియార్ ద్రవిడ కళగం, ఎండీఎంకే తదితర పార్టీల మండిపాటు నేపథ్యంలో రజనీ మంగళవారం విలేకరులతో మాట్లాడారని పత్రికలో రాశారు.
వార్తా పత్రికలు, మేగజైన్ల క్లిప్పింగులను విలేకరులకు చూపించారు. 'జరిగిందే చెప్పాను. నేను విన్నది, మేగజైన్లలో చూసినదే మాట్లాడాను. దీనిపై విచారం వ్యక్తం చేయను. క్షమాపణ చెప్పను. నా వ్యాఖ్యలను లక్ష్మణన్ (బీజేపీ నాయకుడు) కూడా సమర్థించారు. నాటి ఘటన అంత సులువుగా మరచిపోయేది కాదు. కానీ తప్పక మరచిపోవాల్సిన అంశం' అని రజనీ అన్నట్లు కథనంలో చెప్పారు.
ఇటు, పెరియార్‌పై విమర్శలు చేసేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని రజనీకి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సూచించారు.
రజనీ తన వ్యాఖ్యలకు కట్టుబడితే, కోర్టులో ఆయనకు తాను మద్దతుగా నిలబడతానని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేసినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.
తెలంగాణలో పురసమరం నేడు
తెలంగాణలో బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతుందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
కరీంనగర్ కార్పొరేషన్‌కు ఈ నెల 24న ఎన్నికలు నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రానికే అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని చేరవేశారు.
పోలింగ్‌కేంద్రాలన్నీ పోలీసుల పహారాలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఎన్నికలు జరుగనున్న 7,961 పోలింగ్ కేంద్రాల్లో.. మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్లలో 1773 కేంద్రాలు ఉన్నాయి.
ఈ ఎన్నికల్లో మొత్తం 53,50,255 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2,647 మున్సిపాలిటీల వార్డులు, 324 కార్పొరేషన్ వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంకోసం మొత్తం 45 వేల మంది సిబ్బంది పనిచేస్తుండగా భద్రతకోసం 50 వేల మంది పోలీసులను నియమించారు.
ఈ నెల 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని పత్రికలో చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో జరిగే కీలకమైన ఎన్నికలు కావడంతో అభ్యర్థులు సోమవారం సాయంత్రం వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లో రెండు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 58 వార్డుల్లో 371 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కరీంనగర్‌లో ఈ నెల 24 పోలింగ్ జరుగుతుంది అని నమస్తే తెలంగాణలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఊబర్ 'ఈట్స్'.. జొమాటోకు విక్రయం
- ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు: విశాఖపట్నంలో సచివాలయం, రాజ్‌భవన్.. అమరావతిలో అసెంబ్లీ.. కర్నూలులో హైకోర్టు
- ఆంధ్రా, తెలంగాణల్లో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ అమలు చేస్తారా? ముస్లింలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?
- వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
- అమరావతి ఆందోళనల్లో మహిళలు: ‘వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే వస్తున్నాం’
- ఓయూ ప్రొఫెసర్ కాశిం అరెస్ట్... నాలుగేళ్ల కిందటి కేసులో అదుపులోకి తీసుకున్న గజ్వేల్ పోలీసులు
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్‌కు కలిగే లాభమేంటి... జరిగే నష్టమేంటి
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)