చిరంజీవి మాట్లాడుతుండగా రాజశేఖర్ ఆగ్రహం.. ‘మా’ పదవికి రాజీనామా - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

మూవీ ఆర్ట్స్ అసోసియేషన్(మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా సాగిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''డైరీ విడుదల కార్యక్రమంలో రాజశేఖర్ ప్రవర్తన పట్ల తీవ్ర అసహానానికి గురైన చిరంజీవి, కృష్ణంరాజు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మోహన్ బాబు మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఉన్నవారందరం ఒకే తల్లి బిడ్డలం. చిరంజీవికి, నాకు విభేదాలు లేవు. మా మధ్య నడిచేవి ఛలోక్తులు మాత్రమే అన్నారు. దీంతో అక్కడే ఉన్న చిరంజీవి మోహన్ బాబును ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారు. మోహన్ బాబు ఈ సందర్భంగా... కృష్ణంరాజు తనకు తాతయ్య అవుతారంటూ ఛలోక్తులు విసిరారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

అంతకుముందు ఈ కార్యక్రమ వేదికపై హీరో రాజశేఖర్ 'మా'లో వివాదాలను ప్రస్తావించగా అక్కడున్న చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు తదితరులు మనలో మనం మాట్లాడుకుని చర్చించుకోవాలే కానీ వాటిని పెద్దది చేసుకోవద్దని సూచించారని మరో కథనంలో రాశారు. అనంతరం రాజశేఖర్ 'మా' కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారని అందులో తెలిపారు.

''ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. 'మా'లో ఎన్ని గొడవలున్నా వాటిని మనలో మనం చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతేతప్ప దాన్ని పెద్ది చేసుకోవద్దు. మంచి ఉంటే గట్టిగా మాట్లాడుకుందాం, చెడు ఉంటే చెవిలో చెప్పుకొందాం అన్నారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా రాజశేఖర్ ఆయన చేతి నుంచి మైక్ తీసుకుని 'మా' గొడవలను మరోసారి ప్రస్తావించారు. 'మార్చిలో మా కొత్త కార్యవర్గం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు నేనొక్క సినిమా కూడా చేయలేదు. 'మా' కోసం ఎందుకంతలా పనిచేస్తున్నావని ఇంట్లోనూ తిట్టారు. నా కారు పోవడానికి కూడా కారణం అదే. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. ప్రస్తుత లోకంలో ఇలాగే ఉండాలి. నిప్పును కప్పిపుచ్చితే ఎలాగైనా పొగ వస్తుంది. 'మా'లో గొడవలున్నాయి. ఇక్కడ అసోసియేషన్‌లో 26 మంది సభ్యుల్లో 18 మంది ఒక వైపు, 8 మంది మరో వైపు ఉన్నారు. ఇంతకుముందు శివాజీ, శ్రీకాంత్ మధ్య జరిగిన దాంట్లో ఏ అవకతవకలు జరగలేదని చిరంజీవి చెప్పారు. కాన్నే దాన్నే లక్ష్యంగా పెట్టుకుని నరేశ్ ముందుకొచ్చారు. ఇక్కడ ఏదీ న్యాయంగా జరగడం లేదు. నేను సత్యంగా బతకాలనుకునే వ్యక్తిని కాబట్టి నిజం మాట్లాడుతున్నా. దీనివల్ల నాపై నిందలొస్తే రానియ్యండి అన్నారు.

రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేయగానే వేదికపై ఉన్న మోహన్ బాబు, చిరంజీవి, ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. రాజశేఖర్‌ను వారించడానికి మోహన్ బాబు, జయసుధ ప్రయత్నించారు. అయినా, ఫలితం లేకుండా పోయింది.

రాజశేఖర్ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందిస్తూ రాజశేఖర్ మాటలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సజావుగా సాగుతున్న సభలో గౌరవం లేకుండా మైక్ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదన్నారాయన. దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి, ఎవరూ కోపతాపాలకు వెళ్లొద్దు. ఇలా మాట్లాడినవారిపై చర్యలు తీసుకోండి. ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఇష్టం లేకపోతే మానేయాలి, అంతేకానీ వచ్చి రసాభాస చేయడం సరికాదన్నారు చిరంజీవి. సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా రాజశేఖర్ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తంచేశార''ని ఆ కథనంలో రాశారు.

పక్కా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌: వైసీపీ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను వైసీపీ ఆధారాలతో సహా బయట పెట్టిందంటూ 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది.

''రాజధాని విషయంలో గత ప్రభుత్వ అవినీతికి సంబంధించిన వివరాలను గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్‌ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్‌.వి.రమేష్, ఎల్వీఎస్‌ రాజశేఖర్‌ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్‌ అకడమిక్‌ ఫౌండేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్‌ లిమిటెడ్, హైదరాబాద్‌ ఎల్‌ఈపీఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్‌ లిమిటెడ్, లౌక్య హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, విఘ్నేష్‌ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి'' అని వారు ఆరోపించారని ఆ కథనంలో తెలిపారు.

టీడీపీ ప్రముఖ నేతలు, వారి బంధువులు, బినామీల్లో కొందరికి రాజధాని ప్రాంతంలో భూములున్నాయంటూ ఆ వివరాలను వెల్లడించారు.

ఏది ఇన్‌సైడ్‌.. ఎవరిది ట్రేడింగ్‌? తేల్చేద్దాం రండి: బొండా సవాల్

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో వైసీపీ నేతలు మళ్లీ డ్రామాలు మొదలెట్టారని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ గురువారం వైసీపీ ఎమ్మెల్యేలు వీడియో ప్రదర్శన సందర్భంగా చేసిన ప్రతి ఆరోపణనూ టీడీపీ ఖండించింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత బొండా ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చించేందుకు మేము సిద్ధం. ఈ రోజైనా... రేపైనా సరే! అని బొండా సవాల్‌ విసిరార''ని ఆ కథనంలో తెలిపారు.

''పదే పదే అబద్ధాలు చెప్పి వాటినే నిజంగా ప్రచారం చేయడం వైసీపీ నైజం. రాజధాని అమరావతిలో నాలుగు వేల ఎకరాల మేర ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటున్నారు. 2014 జూన్‌ నుంచి డిసెంబరు వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన అన్ని భూ కొనుగోళ్లను కలిపేశారు. ఎన్నారై వేమూరి రవికుమార్‌, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ అమరావతిలో భూములు కొన్నారని, ఇదంతా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మా పార్టీ నేతలు ఎప్పుడెప్పుడు... ఎక్కడెక్కడ భూములు కొన్నారో డాక్యుమెంట్‌ ఆధారాలున్నాయి. బాలకృష్ణ వియ్యంకుడు రామారావుకు 500 ఎకరాలు కట్టబెట్టామని పదేపదే చెబుతున్నారు. ఫెర్టిలైజర్‌ కంపెనీ స్థాపన కోసం 2013లో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా జిల్లా జగయ్యపేట వద్ద ఉన్న జయంతిపురంలో భూ కేటాయింపులు చేసింది. (అప్పటికి బాలకృష్ణతో రామారావుకు బంధుత్వమే లేదు.) టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ భూములకు రెట్టింపు ధరను నిర్ణయించింది. తమకు ఆ భూములు వద్దని, కట్టిన సొమ్ములు వెనక్కి ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. ఇప్పటికీ ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. ఇది వాస్తవం. కానీ... 500 ఎకరాలు మేము ఇచ్చేశామని ఆరోపిస్తున్నార''ని బొండా అన్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

విలువలు పెంచేలా విద్యాబోధన: కేసీఆర్

సమాజంలో నేరప్రవృత్తి పెరుగకుండా నైతికవిలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''మంచి సమాజం నిర్మించే క్రమంలో జీయర్‌స్వామిలాంటి ధార్మికవేత్తలు, మాజీ డీజీపీల సలహాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తామని కేసీఆర్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలను ప్రారంభిస్తామని ప్రకటించారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఆటోబయోగ్రఫీ 'జర్నీ త్రూ టర్బులెంట్‌ టైమ్స్‌' పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. దొర తన సర్వీస్‌కాలంలో ఎదుర్కొన్న క్లిష్టమైన సందర్భాలను వివరిస్తూ, ఇతర పోలీసు అధికారులకు స్ఫూర్తినిచ్చేలా ఈ పుస్తకం రాశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పుస్తక రచయితను, ప్రచురణకర్తలను సన్మానించారు.

పుస్తకావిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతున్నదని, కొన్నిచోట్ల మనుషులు మృగాల్లా మారుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 'నేరప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. విద్యాసంస్థల్లో పిల్లలకు మంచి విద్యాబోధన చేయడంద్వారా నైతిక విలువలు పెంపొందించవచ్చు. దీనికోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే విద్యాసంస్థల్లో విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బోధించాలని భావిస్తున్నాం. ఇందుకోసం అవసరమైన పాఠ్యాంశాలను తయారుచేయాలి. మాజీ డీజీపీలతో కమిటీవేస్తాం. జీయర్‌స్వామి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు తీసుకొంటాం. మంచి సమాజం నిర్మించడానికి అవసరమైన బోధనలను వచ్చే విద్యాసంవత్సరం నుంచే ప్రారంభిస్తాం. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలి' అని సీఎం కేసీఆర్‌ అన్నార''ని ఆ కథనంలో తెలిపారు.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)