అత్త,మామల సంరక్షణలో అల్లుళ్లు, కోడళ్లకూ బాధ్యత.. విస్మరిస్తే జైలు, జరిమానా- ప్రెస్‌రివ్యూ

వృద్ధులు

ఫొటో సోర్స్, Sayan hazra

ప్రచురణ

అత్త, మామలను గౌరవంగా, బాధ్యతగా చూసుకోవడం కోడళ్లు, అల్లుళ్ల బాధ్యత కూడా, కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించిన సవరణ బిల్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇక నుంచి ఇంట్లో వృద్ధుల సంరక్షణ బాధ్యత వారి కొడుకు, కూతుళ్లదే కాదు.. అల్లుళ్లు, కోడళ్లది కూడా, వయసు మళ్లినవారిని నిర్లక్ష్యం చేసినా, పోషణ, సంరక్షణ బాధ్యతను అల్లుళ్లు, కోడళ్లు పట్టించుకోకపోయినా నేరంగా పరిగణిస్తారు.

ఈ మేరకు 2012 నాటి బిల్లులో మార్పులు చేసి, 'పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ సవరణ బిల్లు-2019' పేరిట త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

బిల్లు ముఖ్యాంశాలివీ...

కూతురు, కొడుకులతో పాటు అల్లుళ్లు, కోడళ్లు కూడా అత్తమామల సంక్షేమం పట్టించుకోవాలి.

మెయింటెనెన్స్‌ పరిధిని పెంచారు. వృద్ధుల సంరక్షణ బాధ్యతతో పాటు వారి ఆహారం, బట్టలు, గృహ వసతి, ఆరోగ్య విషయాలను చేర్చి మెయింటెన్స్‌ అనేమాటను నిర్వచించారు.

వృద్ధులకు మెయింటెనెన్స్‌ కింద ఇచ్చే రూ.10వేల గరిష్ఠ పరిమితిని తొలగించారు.

సంబంధీకులు ఎంత సంపాదిస్తే.. ఆ మేరకు వృద్ధులకు పోషణ కింద ఇవ్వాల్సి ఉంటుంది. -

దీనిని ఉల్లంఘిస్తే.. కనీసం 3 నెలల జైలుశిక్ష, కనిష్ఠంగా రూ.5వేల జరిమానా విధిస్తారు.

పిల్లలు పోషించకపోతే, మెయింటెనెన్స్‌ ఇవ్వకపోతే తలిదండ్రులు లేదా అత్తమామలు 'మెయిన్‌టెనెన్స్‌ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

80ఏళ్లు పైబడిన వృద్ధులు చేసే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. వెంటనే పరిష్కరించాలి.

ప్రతీ సబ్‌డివిజనల్‌ పరిధిలో ఓ పోలీసు నోడల్‌ అధికారి ఈ కేసులను చూడాలి.

జిల్లా, రాష్ట్ర స్థాయుల్లోనూ ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి.

ప్రతీ వృద్ధాశ్రమం, హోంకేర్‌ సంస్థల రిజిస్ట్రేషన్‌ తప్పనిసరని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

రిఫరీ లక్ష్మీ

ఫొటో సోర్స్, Getty Images

పురుషుల వన్డేకు రిఫరీగా తెలుగు మహిళ

తెలుగు మహిళ, మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి అరుదైన ఘనత సాధించనుందని, పురుషుల వన్డేకు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించిన తొలి భారత మహిళగా ఆమె నిలవబోతోందని ఈనాడు తెలిపింది.

ప్రపంచకప్‌ లీగ్‌-2 టోర్నీ మూడో సిరీస్‌లో భాగంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా మధ్య ఆదివారం జరిగే తొలి వన్డేలో లక్ష్మి మ్యాచ్‌ అధికారిణిగా పని చేయనుంది.

ఈ మేలో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌లో చోటు దక్కించుకొని వార్తల్లో నిలిచిన 51 ఏళ్ల లక్ష్మీకి ఒక వన్డేకు రిఫరీగా వ్యవహరించబోతుండడం ఇదే తొలిసారి. 2008-09 సీజన్లో మహిళల క్రికెట్‌ దేశవాళీ మ్యాచ్‌లకు రిఫరీగా పని చేసిన ఆమె.. అంతర్జాతీయ క్రికెట్లో 16 మహిళల వన్డేలు, 7 టీ20లకు, 16 పురుషుల టీ20లకు మ్యాచ్‌ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తించింది.

''ఒక పురుషుల అంతర్జాతీయ వన్డేకు రిఫరీగా వ్యవహరించడం గర్వంగా అనిపిస్తోంది. అందులోనూ ఐసీసీ ప్రపంచకప్‌ లీగ్‌-2 లాంటి టోర్నీలో పని చేయడం ఇంకా గొప్పగా భావిస్తున్నా.

ఐసీసీ అధికారులకు ఇలాంటి టోర్నీలు మంచి అనుభవం. మహిళలకు ఇదో కెరీర్‌'' అని లక్ష్మి చెప్పింది. లక్ష్మి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి అని ఈనాడు వెల్లడించింది.

ఉల్లి

ఫొటో సోర్స్, AFP

తెలంగాణలో ఉల్లి @170

తెలంగాణలో ఉల్లిధర ధర తాజాగా 'ఆల్‌టైం హై'ను తాకిందని, ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టిందని సాక్షి తెలిపింది.

హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్‌సేల్‌లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్‌సేల్‌లోనే కిలో రూ. 145కు చేరింది.

ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్‌ మార్కెట్‌లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది.

రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్‌కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం.

ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు.

దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్‌లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోందని సాక్షి వెల్లడించింది.

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, Tdp/fb

ప్రజలంతా తప్పు చేశానంటే సారీకి సిద్ధం

మనకొక ప్రపంచస్ధాయి ప్రసిద్ధ రాజధాని ఉండాలనుకోవడం తప్పా.. అని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

అమరావతి నిర్మాణంలో తాను తప్పు చేశానని ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలు అభిప్రాయపడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. చరిత్ర పొడవునా ఒక మంచి రాజధాని నగరం లేని దురదృష్టం ఆంధ్రులను వెన్నాడాల్సిందేనా అని వాపోయారు.

గురువారం విజయవాడలోని 'ఎ' కన్వెన్షన్‌ హాలులో ప్రజా రాజధాని అమరావతిపై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

'మనకొక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకోలేమా? హైదరాబాద్‌లో సాధ్యమైంది అమరావతిలో ఎందుకు కాదు' అని ప్రశ్నించారు. అక్కడ తన త ర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ సహా ఎవ రూ హైదరాబాద్‌ను చెడగొట్టలేదని.. ఆ ప్రణాళికల ను కొనసాగించారని తెలిపారు. కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోందన్నారు.

రకరకాల దుష్ప్రచారాల తో అమరావతిని చంపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. 'దానిని చంపేస్తే నాకొచ్చిన నష్టమేమీ లేదు. భావితరాలు, తెలుగు జాతి నష్టపోతాయి. ఒక పెద్ద రాజధాని ఉంటే ప్రభుత్వానికి ఆదాయం, సంపద, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పేదరిక నిర్మూలన జరుగుతాయి.

ఇప్పుడు తెలంగాణకి వస్తున్న ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మహారాష్ట్రకు 57 శాతం ముంబై నుంచి వస్తోంది. నా కులం వారో.. నా బంధువులో ఉన్నారని హైదరాబాద్‌ కోసం శ్రమించానా? మొత్తం తెలుగు జాతి కోసం శ్రమించాను' అని తెలిపారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)