జుట్టును ఎక్కువసార్లు దువ్వడం వల్ల ఊడిపోతుందా, పెరుగుతుందా? రోజుకు ఎన్నిసార్లు దువ్వడం బెటర్?

ఫొటో సోర్స్, Getty Images
ఒత్తుగా, నిగనిగలాడే జుట్టు రహస్యం... మీ జుట్టు రూపం నుంచి మీ దువ్వెన డిజైన్ వరకు ప్రతి దానిలోనూ దాగి ఉంటుంది.
నాకు నచ్చినట్లుగా జుట్టు కత్తిరించుకునే వయసు వచ్చినప్పటి నుంచి, నా జుట్టు వీపు కింద దాకా స్ట్రెయిట్‌గా పొడవుగా ఉంచుకున్నాను. చిన్నప్పుడు, నేను రోజూ చాలాసార్లు జుట్టును స్టైల్‌గా వేసుకునేదాన్ని.
నా జుట్టును దువ్వుకునేటప్పుడు, 1800ల్లో ఆస్ట్రియాకు చెందిన రాణి సిసి గురించి ఆలోచించేదాన్ని. నాలాగా స్ట్రెయిట్‌గా గోధుమ రంగులో ఆమె జుట్టు ఉండేదట. జుట్టు మోకాళ్ల దాకా పడేదట.
ప్రతిరోజు రాత్రి ఆమె దాన్ని వందసార్లు దువ్వుకునేదని చెప్పేవారు. ఈ వ్యాసం రాసేంత వరకు నేను ఈ కథను గుడ్డిగా నమ్మాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మమ్మలు ప్రచారం చేస్తున్న ఒక కల్పిత పురాణ కథ అని తర్వాత తెలిసింది. ఆ తర్వాత, నేను తీవ్రంగా నిరాశ పడ్డా.
ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు మాత్రమే జుట్టును సరిగ్గా దువ్వుకుంటాను. అంతే. అయినా సరే.. నాకైతే ఆ జుట్టు అలాగే కనిపిస్తూ, అలాగే అనిపిస్తూ ఉంటుంది.

మీరు మీ జుట్టును ఎంత తరచుగా దువ్వుకోవాలి, ఎలా స్టైల్ చేసుకోవాలి అనే దాని వెనుకనున్న సైన్స్‌ను అర్థం చేసుకోవడం కాస్త సంక్లిష్టమైనదే.
సైంటిస్టుల నుంచి హెయిర్ డ్రెస్సర్ల వరకు.. ప్రతి ఒక్కరూ దీన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
కానీ, దీనికి సమాధానం మీ జుట్టు ఆకృతి, దువ్వే విధానం, రోజువారీగా దానిపై మీరు తీసుకునే శ్రద్ధ వంటి ఎన్నో విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది..

ఫొటో సోర్స్, Keystone Features/Hulton Archive/Getty Images
దువ్వెన కథ
జుట్టు దువ్వడం, దువ్వెన వాడటం అనే సంప్రదాయం ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తోంది.
"మనుషులు శుభ్రపరచుకునే, అలంకరించుకునే సాధనాలను ఎప్పుడూ తమ చేతికి తేలికగా దొరికే వస్తువులతోనే తయారు చేసుకునేవారు. అందుకే, చరిత్రలో జుట్టు దువ్వుకునేందుకు, దాన్ని చక్కగా అలంకరించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అంత ప్రాముఖ్యత ఉంది" అని 'ది హెయిర్ హిస్టోరియన్' వ్యవస్థాపకురాలు రేచెల్ గిబ్సన్ అన్నారు.
కానీ, పదేపదే జుట్టును దువ్వుకోవడం మీ జుట్టు పాడైపోయేందుకు, ఊడిపోయేందుకు కారణం కావొచ్చు. జుట్టును వందసార్లు దువ్వాలనే ఆలోచన బహుశా మధ్యయుగపు బ్రిటన్‌లో పుట్టి ఉండవచ్చు.
అప్పట్లో మహిళల జుట్టు చాలా పొడవుగా ఉండేది. జుట్టును స్త్రీత్వంలో (ఉమెన్‌హుడ్‌లో) ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించేవారని గిబ్సన్ చెప్పారు.
సాధారణంగా జుట్టును శుభ్రపరిచే పద్ధతిలో భాగంగా.. తొలుత జుట్టును దువ్వి, ఆ తర్వాత మురికిని, పేలను తొలగించేవారు. ఆ తర్వాత పెద్ద దువ్వెనతో నునుపుగా దువ్వడం చేస్తుంటారు.
ఆ కాలంలోని ధనిక మహిళలు తమ దుస్తులకు వెంట్రుకలు అంటుకోకుండా కాపాడుకోవడానికి ప్రత్యేకమైన గౌన్లు ధరించేవారని గిబ్సన్ చెప్పారు.
1898లో అమెరికాలోని ఓహియోలో ఆఫ్రికన్-అమెరికన్ హెయిర్ డ్రెసర్ లిడియా న్యూమాన్ తొలిసారి సింథటిక్‌తో కూడిన పెద్ద దువ్వెనను తయారు చేశారు.
దువ్వెనలు చాలా చౌకైనవి, తేలికగా తయారు చేసుకోవచ్చు. దీంతో, ప్రతి ఒక్కరూ జుట్టును దువ్వుకోవడం సర్వసాధారణమైంది. కానీ, దీనివల్ల చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింది.

ఫొటో సోర్స్, BBC/ Prashanti Aswan
జుట్టులో చిక్కులు
తరచూ దువ్వడం వల్ల జుట్టు పెరుగుతుందని భావిస్తుంటారు. 2025లో చేపట్టిన ఒక సర్వేలో 46 శాతానికి పైగా ఈ విషయాన్ని నమ్ముతున్నట్లు తేలింది. కానీ, కాలిఫోర్నియా హెయిర్ సెలూన్ యజమాని నిక్కి కోర్జైన్ ఇదొక అపోహ అని కొట్టిపారేశారు.
''ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు వేగంగా పెరగదు'' అని కోర్జైన్ చెప్పారు.
దువ్వెనలు జుట్టుకు కలిగించే నష్టాన్ని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని నిర్దుష్ట ఫార్ములాలను సృష్టించారు. ఎక్కువగా దువ్వడం వల్ల జుట్టు పాడవుతుందని, ఎక్కువగా ఊడిపోతుందని పేర్కొన్నారు.
ఒక పరిశోధన బృందం రెండు వెంట్రుకలను ఒకదానితో ఒకటి చిక్కుముడి వేసి, ఆ తర్వాత వాటిని విడదీయడానికి దువ్వెనతో లాగింది.
గట్టిగా దువ్వడం వల్ల జుట్టు తెగిపోయింది. ఆరోగ్యకరమైన జుట్టు మాత్రమే ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉంది. కానీ, పదేపదే ఒత్తిడి కలిగించడం వల్ల బయటి నుండి లోపలికి తలలో కూడా పగుళ్లు ఏర్పడ్డాయి.
ఈ పరిశోధన చేసిన రచయిత ఐర్లాండ్‌లోని డబ్లిన్ ట్రినిటీ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డేవిడ్ టేలర్.
''ఎంత ఎక్కువగా దువ్వితే, అంత ఎక్కువగా జుట్టుకు హాని కలిగే అవకాశం ఉంది. కానీ నిజానికి ఇది మీరు ఎన్నిసార్లు దువ్వుతారు అన్నదానికంటే, దువ్వేటప్పుడు ఉపయోగించే బలం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది'' అని ఆయన అన్నారు.
జుట్టుపై పరిశోధన చేసే సంస్థ టీఆర్ఐ ప్రిన్స్‌టన్‌కు చెందిన ట్రిఫర్ ఇవాన్స్... జుట్టు తెగిపోవడం గురించి పరిశీలించారు. పదేపదే దువ్వడం వల్ల, క్రమంగా జుట్టు ఊడిపోయే ప్రమాదం పెరుగుతుందని అన్నారు.

దువ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు
''నెమ్మదిగా, ఒక పద్ధతిగా దువ్వడం అంత హాని చేకూర్చదు'' అని కోర్జైన్ చెప్పారు. ''దువ్వడం సమస్య కాదు, ఎలా దువ్వుతున్నామన్నదే సమస్య'' అని అన్నారు.
నిత్యం దువ్వడం వల్ల చిక్కులు, ఆయిల్‌గా ఉండటాన్ని నివారించుకోవచ్చు.
''రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు మీరు జుట్టును దువ్వితే, జుట్టుకు కలిగే నష్టం తక్కువ. ఒకవేళ వారం పాటు అలానే ఉండి, ఆ తర్వాత గట్టిగా దువ్వితే, జుట్టుకు ఏర్పడే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది'' అని హెయిర్ కెయిర్ బ్రాండ్‌ను ప్రారంభించిన బయోకెమిస్ట్ జేరెడ్ రేనాల్డ్స్ అన్నారు.
ల్యాబ్‌లో పరీక్షించే జుట్టుకు, వాస్తవంగా ఉండే జుట్టుకు ఎటువంటి పోలిక ఉండదని నొక్కి చెప్పారు.
నిత్యం తలను దువ్వుకోవడం వల్ల, జుట్టు ఊడిపోవడాన్ని తొలగించుకోవచ్చు. అలాగే, తలపై ఉన్న మురికిని తీసేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Alejandra Villa Loraca/Newsday RM via Getty Images
జుట్టును స్టైల్ చేసుకునే విధానం
మీ జుట్టు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఉత్తమమైన విధానం ఏంటన్నది ఆధారపడి ఉంటుంది.
''స్ట్రెయిట్ లేదా సహజంగానే ఎస్-ఆకారంలో (అలల రూపంలో), ఉంగరాలు కానీ జుట్టును వారానికి కనీసం మూడుసార్లు దువ్వితే సరిపోతుంది. రోజుకు రెండుసార్లైనా ఇబ్బంది లేదు'' అని అమెరికాలోని మియామిలో హెయిర్ సెలూన్ యజమాని నికోలా లించ్ చెప్పారు.
స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవారు తడి జుట్టును దువ్వకూడదని లించ్ చెప్పారు. తడి జుట్టు చాలా బలంగా, ఒత్తుగా కనిపిస్తుంది. కానీ, వాస్తవానికి అది చాలా బలహీనంగా ఉంటుంది.
ఉంగరాల జుట్టు ఉన్నవారికి ఈ సలహా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారు పొడి జుట్టును ఎప్పుడూ దువ్వకూడదు.
" అలల రూపంలో ఉండే ఎస్-ఆకారపు జుట్టుకు ఉంగరాల జుట్టు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనిని పరిశోధకులు చాలా కాలంగా విస్మరించారు" అని జార్జియాలోని స్పెల్మాన్ కాలేజీ ప్రొఫెసర్ మిషెల్ గెయిన్స్ అన్నారు.
ఉంగరాల జుట్టుకు చాలా తక్కువ పొడవున్న లేయర్లు ఉన్నాయని, దీంతో అది మరింత బిగుతుగా అతుక్కుని ఉంటుందని, దాని అంచులు గరుకుగా ఉంటాయని మిషెల్ గెయిన్స్ ప్రాథమిక ప్రయోగాల్లో వెల్లడైంది. దీనివల్ల అది తేమను అంతగా నిలుపుకోలేక, సులభంగా చిక్కుపడి విరిగిపోతుందని అర్థం.

ఫొటో సోర్స్, David Turnley/Corbis/VCG via Getty Images
సమాజంలో వచ్చే కొత్త హెయిర్ స్టయిల్ ట్రెండ్‌లు.. జుట్టుపై రకరకాల ప్రయోగాలు చేయాలనే ఒత్తిడిని కలిగిస్తాయని మిషెల్ గెయిన్స్ చెప్పారు.
అందువల్ల, జుట్టు పాడవకుండా కాపాడుకునేందుకు, దువ్వెనలు జుట్టు గుండా సులభంగా వెళ్లేలా చేయడానికి చిక్కులు పోయే ఉత్పత్తులను ఉపయోగించమని ఆమె చెబుతున్నారు.
అత్యంత ముఖ్యమైన విషయం సరైన దువ్వెనను వాడటం.
''మీకు ఉంగరాల జుట్టు ఉంటే, అది తడిగా ఉన్నప్పుడు దువ్వాలనుకుంటే, మెత్తగా, సులభంగా వంగే పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించండి" అని లించ్ చెప్పారు.
''అదే పొడి జుట్టు కోసం అయితే, మాడుకు హాని చేయని మెత్తటి పళ్ళు ఉన్న దువ్వెనను వాడండి. ఇది జుట్టులోని నూనెను చివరి వరకు తీసుకెళ్తుంది" అని అన్నారు.
ప్రాచీన కాలం నుంచి .. దువ్వెనలు వివిధ ఆకారాలు, పరిమాణాలలో ఉండేవి. ప్రాచీన ఈజిప్షియన్ సమాధులలో ఏనుగు దంతాల దువ్వెనలు, మెలిపెట్టిన కొమ్మలతో చేసిన దువ్వెనలు ఉన్నట్లు తెలిసింది.
భవిష్యత్తులో, జుట్టు గురించి మరింత మెరుగైన అవగాహనతో, మన జుట్టును కాపాడుకోవడానికి పూర్తిగా కొత్త మార్గాలను కూడా కనుగొనవచ్చు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























