'టీఎస్ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామ రెడ్డి కూడా విధులకు హాజరు కావాల్సిందే': యాజమాన్యం-ప్రెస్ రివ్యూ

టీఎస్ఆర్టీసీ

ఫొటో సోర్స్, facebook/Tmu Ashwathama Reddy

ప్రచురణ

టీఎస్ఆర్టీసీ కార్మిక నేతలు కూడా ఇక నుంచి సాధారణ కార్మికుల మాదిరి విధులు నిర్వహించాల్సిందే అని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధి ఒకరు చెప్పినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

ఇప్పటిదాకా వారికి కల్పించిన డ్యూటీ రిలీఫ్(విధుల నుంచి మినహాయింపు) హక్కులను యాజమాన్యం రద్దు చేసిందని చెప్పింది.

దీని ప్రకారం టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సహా నేతలంతా డ్యూటీ చేయాలి. ఇతర కార్మికుల మాదిరిగానే శుక్రవారం నుంచి వారూ విదులకు కావాల్సి ఉంటుంది.

డ్యూటీలకు హాజరు కాకపోతే గైర్హాజరుగా పరిగణిస్తారు. లేదంటే సెలవు పెట్టుకోవాలి అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ఈనాడుకు చెప్పారని కథనంలో రాశారు.

మొత్తం 30 మంది కార్మిక నేతలకు ఇప్పటివరకూ డ్యూటీ మినహాయింపు ఉంది. ఇందులో అధికారిక కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ)కు చెందినవారు 26 మంది ఉన్నారు.

బస్ భవన్‌లో అధికారిక కార్మిక సంఘమైన టీఎంయూ కార్యాలయానికి యాజమాన్యం తాళం వేసింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లతోపాటూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టీఎంయూ కార్యాలయాలకూ తాళాలు కనిపించాయని కథనంలో చెప్పారు.

కార్మికుల సభ్యత్వ రుసుమును వసూలు చేసే విధానానికి కూడా త్వరలో చెక్ పెట్టాలని అధికారులు యోచిస్తున్నారు అని ఈనాడులో రాశారు.

కార్మిక నేతలకు ఇస్తున్న డ్యూటీ రిలీఫ్‌ను తొలగించడం చిల్లర చర్య అని టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి విమర్శించినట్లు చెప్పింది.

అవసరమైతే యూనియన్ నేతలంతా విధులకు వెళ్తామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. "నేను డ్రైవర్‌ను డ్యూటీ చేస్తా... అవసరమైతే సెలవు తీసుకుంటా" అన్నట్లు రాసింది.

డ్యూటీ రిలీఫ్‌పై కార్మిక శాఖ కమిషన్ దగ్గర తేల్చుకుంటామని ఆయన చెప్పారని కథనంలో వివరించింది.

మార్చి 4 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

ఫొటో సోర్స్, ts Inter board

మార్చి 4 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలను వచ్చే ఏడాది మార్చి 4 నుంచి 23 వరకు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించినట్లు నమస్తే తెలంగాణ సహా అన్ని పత్రికలూ ప్రచురించాయి.

ఈ మేరకు శుక్రవారం పరీక్షల టైంటేబుల్‌ను విడుదల చేశారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.

థియరీ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి.

జనవరి 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 30న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పొరపాట్లకు తావులేకుండా పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకొన్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించే ప్రతిపాదనలను ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారని నమస్తే తెలంగాణ రాసింది.

మద్యం

ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమ మార్గాల్లో తెలంగాణ మద్యం

తెలంగాణ మద్యాన్ని అక్రమ మార్గాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చేరుస్తున్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతానికి కూతవేటు దూరంలో తెలంగాణ సరిహద్దు గ్రామాలు ఉండటంతో అక్కడినుంచి సులువుగా మద్యం తీసుకొస్తున్నారని చెప్పింది.

ఇటీవల రాష్ట్రంలో పెరిగిన ధరల ప్రకారం సామాన్యులు తాగే తక్కువ రకం మద్యం కూడా తెలంగాణతో పోలిస్తే క్వార్టర్‌కు రూ.25, ఫుల్‌ బాటిల్‌ రూ.100 వరకూ వ్యత్యాసం ఉంటోంది.

దీంతో అక్రమమార్గం ద్వారా తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విచ్చలవిడి ధరలకు అమ్ముతున్నారు. ఈ విధంగా క్వార్టర్‌ బాటిల్‌కే రూ.50 వరకు గడిస్తున్నట్లు సమాచారం ఉందని ఆంధ్రజ్యోతి రాసింది.

ప్రధానంగా తెలంగాణలోని హుజూర్‌నగర్‌ మండలం మట్టపల్లిలోని షాపుల నుంచి, దామచర్ల మండలం నుంచి దాచేపల్లి మండలం తంగెడ బ్రిడ్జి ద్వారా, పొందుగల బ్రిడ్జి ద్వారా రాష్ట్రంలోకి మద్యం పారుతోంది.

అలాగే తెలంగాణలోని విజయపురి నార్త్‌, హాలియా మండలం నుంచి విజయపురి సౌత్‌లోకి రవాణా అవుతోంది. పులిచింతల ప్రాజక్టుకు అవతల తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోని బెల్ట్‌ షాపుల నుంచి కూడా అచ్చంపేటకు మద్యం తీసుకొస్తున్నారని కథనంలో వివరించారు.

కొన్నిచోట్ల చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ అధికారుల కన్నుగప్పి కొందరు, వారితో కుమ్మక్కై మరికొందరు మద్యాన్ని రాష్ట్రానికి చేరుస్తున్నట్టు సమాచారం అందినట్లు పత్రిక చెప్పింది.

అక్రమ మార్గాల్లో తెలంగాణ మద్యం ఇక్కడికి చేరుతుండటంతో అక్కడ అమ్మకాలు పెరిగి ఆ రాష్ట్ర ఖజానాకు లబ్ధి చేకూరుతోంది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క గుంటూరు జిల్లాలోనే అక్రమ మద్యం సరఫరా కేసులు 61నమోదు కాగా 80మందిని అరెస్టు చేసి 11 వాహనాలను సీజ్‌ చేశారని ఆంధ్రజ్యోతిలో రాశారు.

700 కోట్లతో స్కైవర్త్ ప్లాంట్

ఫొటో సోర్స్, facebook/Minister for IT, Telangana

తెలంగాణలో 700 కోట్లతో స్కైవర్త్ ప్లాంట్

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ స్కైవర్త్‌ సిద్ధమవుతోందని సాక్షి కథనం చెప్పింది.

ఈ కంపెనీ మొదటి దశలో రూ. 700 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉత్పాదక ప్లాంటును ఏర్పాటు చేయనుంది.

ఇందుకు సంబంధించి శుక్రవారం తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావుతో స్కైవర్త్‌ గ్రూప్‌ చైర్మన్‌ లై వీడ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయిందని సాక్షి వివరించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఫీచర్లను అందించే స్కైవర్త్‌ బ్రాండ్‌... ఎల్‌ఈడీ టీవీలను ఇప్పటికే ఉత్పత్తి చేస్తోంది.

కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఎలక్ట్రానిక్‌ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీలు, ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లను తయారు చేయాలని స్కైవర్త్‌ నిర్ణయించింది.

ఎలక్ట్రానిక్స్‌ రంగానికి సంబంధించి దేశంలోకెల్లా భారీ చైనా పెట్టుబడుల్లో ఒకటిగా దీనిని పరిశ్రమశాఖ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

స్కైవర్త్‌ పెట్టుబడులతో రాష్ట్రంలో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

స్కైవర్త్‌ భారీ పెట్టుబడులతో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారని సాక్షి చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)