You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నవీన్ పట్నాయక్, యోగిల తర్వాత జగన్ మోస్ట్ పాపులర్ సీఎం... అయిదో స్థానంలో కేసీఆర్ :ప్రెస్ రివ్యూ
అధికారం చేపట్టిన మూడు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చోటు సాధించారని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన సీఎంలపై ప్రఖ్యాత 'వీడీపీ అసోసియేట్స్' సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మూడో స్థానం లభించింది.
'దేశ్‌కా మూడ్' పేరుతో ప్రస్తుతం దేశ ప్రజల నాడి - రాజకీయంగా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడీపీ అసోసియేట్స్ ఈ సర్వేను నిర్వహించింది. జగన్ పాలన పట్ల 71 శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.
సర్వే వివరాల ప్రకారం మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రభాగాన నిలిచారు. ఆయనకు 81 శాతం మంది మద్దతు లభించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 72 శాతంతో రెండో స్థానంలో, వైఎస్ జగన్ 71 శాతం మంది ప్రజల మద్దతుతో మూడో స్థానంలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 11,252 మంది సర్వేలో పాల్గొనగా వారిలో 10,098 మంది ఓటర్లున్నారు. ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 వరకు ఈ సర్వే నిర్వహించారు.
తెలంగాణలో మొక్కల కాపలాదారుల కోసం సర్పంచ్‌ల తిప్పలు
''మొక్కలు నాటాలి. వాటిని పెంచాలి. అందులో 85 శాతం బతకాలి. లేదంటే ఉద్యోగం/పదవికి ఎసరు తప్పదు'' అంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన హెచ్చరికలు, చేపట్టిన చర్యలు గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శుల్లో గుబులు రేపుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. పంచాయతీల ఆదాయం అంతంతమ్రాతంగా ఉంటే మొక్కల రక్షణ, దానికి నిధులు ఎలా? అని వారు ఆందోళన చెందుతున్నారు.
మొక్కలకు కాపలాదారులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వారికి వేతనాన్ని తొలుత గ్రామ పంచాయతీ నిధుల నుంచి సర్దుబాటు చేసి, ఆపై రియింబర్స్ చేసుకోవాలని పేర్కొంది.
హరితహారం లక్ష్యం భారీగా ఉండడంతో ప్రతి పంచాయతీలో పదుల సంఖ్యలో కాపలాదారులు అవసరం. వారు అంత త్వరగా దొరకరని, వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మరింత ఇబ్బంది ఉంటుందని సర్పంచ్‌లు, కార్యదర్శులు పేర్కొంటున్నారు.
మొక్కల కాపలాదారులు నిత్యం పనిచేయాలి. రహదారి వెంట తమకు కేటాయించిన మొక్కలకు నీళ్లు పోస్తే రోజుకు చెల్లించేది రూ. 211 మాత్రమే. నెలంతా పనిచేసినా రూ. 7,000 కు మించదు.
పైగా.. 85 శాతం మొక్కలు బతక్కపోతే వేతనంలో కోత పడుతుంది. ఈ వేతనానికి కూలీలు దొరకడం కష్టమేనని చెబుతున్నారు. ఒకవేళ దొరికినా వేతనాల సర్దుబాటుకు పంచాయతీల్లో నిధులు లేవని చెబుతున్నారు.
ఏపీలో ఇక సర్కారీ మద్యం దుకాణాలు.. ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహణ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు మద్యం దుకాణాలు కనుమరుగుకానున్నాయని.. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) నడిపే దుకాణాలు ప్రత్యక్షం కానున్నాయని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. రిటైల్ దుకాణాల నిర్వహణను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగిస్తూ 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మద్యం దుకాణాల్లో 880 దుకాణాలను మూసివేసి.. 3,500 దుకాణాలనే నిర్వహించనుంది.
దుకాణాలపై ప్రదర్శించే సైన్‌బోర్డుల్లో ఏపీఎస్‌బీసీఎల్ రిటైల్ అవుట్ లెట్, దాని సంఖ్య మాత్రమే ఉంటుంది. వీటిని తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రదర్శిస్తారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, మండలాలు యూనిట్లుగా ఎక్కడెక్కడ ఎన్ని దుకాణాలు ఉండాలనేది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఈ మేరకు నూతన మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి మద్యం దుకాణంలోనూ సూపర్‌వైజర్, సేల్స్‌మెన్, వాచ్ అండ్ వార్డు అనే మూడు విభాగాల సిబ్బంది ఉంటారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకాలు చేపడుతుంది.
నెలకు సూపర్‌వైజర్‌కు రూ. 17,500, సేల్స్‌మెన్‌కు రూ. 15,000 చొప్పున వేతనం చెల్లిస్తారు. వాచ్ అండ్ వార్డులకు కార్మిక శాఖ జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 43 ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.
సూపర్‌వైజర్ పోస్టులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. బీకాం చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. సేల్స్‌మెన్‌కు ఇంటర్ విద్యార్హత. వాచ్ అండ్ వార్డు పోస్టుకు విద్యార్హత అవసరం లేదు.
2019 అక్టోబరు1 నాటికి 21-40 ఏళ్ల లోపు వయసున్న వారై ఉండాలి. మద్యం దుకాణం ఉన్న మండలానికో/పురపాలక సంఘానికో చెందిన వారై ఉండాలి.
ఈ మూడు పోస్టులను ఒప్పంద లేదా పొరుగు సేవల పద్ధతిలో భర్తీ చేసుకుంటారు. ఏడాది కాలవ్యవధికి వీరిని తీసుకుంటారు. ఈ పోస్టుల భర్తీలో జిల్లా యూనిట్‌గా రిజర్వేషన్లను వర్తింపచేస్తారు. సంతృప్తికరంగా పనిచేస్తే.. రెండో ఏడాది వీరిని కొనసాగించి ఓ నెల వేతనాన్ని బోనస్‌గా అందిస్తారు.
ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే మద్యం విక్రయిస్తారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. మద్యం కొన్నవారికి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి.
ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. సీఎం కేసీఆర్ స్వయంగా వినోద్‌కుమార్‌కు ఈ నియామక ఉత్తర్వులను అందజేశారు. వినోద్‌కుమార్ ఈ పదవిలో మూడేండ్లు కొనసాగుతారు.
ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్ క్యాబినెట్ హోదా కలిగి ఉండటంతోపాటు రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. ప్రణాళికాసంఘం అధ్యక్షుడిగా సీఎం వ్యవహరిస్తారు.
2019-20 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారుచేసే పనిని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్‌కు అప్పగించారు.
రాజకీయాల్లో, పరిపాలనాఅంశాల్లో ఉన్న అనుభవంతోపాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన వినోద్‌కుమార్ సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలనే ఈ నియామకం చేపట్టినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పెహ్లూ ఖాన్‌పై మూక దాడి కేసు: నిందితులను కోర్టు ఎందుకు వదిలేసిందంటే..
- పోర్న్ స్టార్ మియా ఖలీఫాను వెంటాడుతున్న గతం
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)