చంద్రబాబు నాయుడు: 'ఏపీలో రద్దుల సర్కార్‌ నడుస్తోంది.. మేం కట్టిన మరుగుదొడ్లు, రోడ్లు కూల్చినా ఆశ్చర్యం లేదు' - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌ జగన్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం 'రద్దుల సర్కారు' అని రాష్ట్ర మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ వార్త రాసింది.

టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నింటినీ జగన్‌ సర్కారు రద్దు చేసుకుంటూ పోతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

'2004 నుంచి 2009 వరకు వైఎస్‌ ప్రారంభించి పూర్తి చేయలేకపోయిన ప్రాజెక్టులను కూడా ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశాం. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని తర్వాత వచ్చే ప్రభుత్వం గౌరవించాలి. ఈ రోజున బందరు పోర్టు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పోలవరం టెండర్లు, రంజాన్‌ తోఫా, కాపు రిజర్వేషన్లు, అన్న క్యాంటీన్లు, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, రాజధాని పనులు రద్దు చేశారు'' అని ఆయన అన్నారు.

తాము గతంలో నిర్మించిన రోడ్లు, మరుగుదొడ్లు, పంచాయతీ భవనాలను ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూలగొట్టినా ఆశ్చర్యం లేదని, తన మీద కోపంతో రూ.9 కోట్లతో నిర్మించిన ప్రజావేదికని కూల్చేశారని చంద్రబాబు విమర్శించారు.

''చంద్రన్న బీమా పథకం రద్దు చేశారు. ఇసుక లేకుండా చేసి రేట్లు పెంచి దోచేస్తున్నారు. అన్న క్యాంటీన్లకు మొదట వాళ్ల ఫొటోలు తగిలించుకున్నారు. ఆ తర్వాత వాటిని మూసేశారు'' అని చంద్రబాబు చెప్పారు.

''పీపీఏల సమీక్షపై జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యతిరేకత వెల్లువెత్తుతుంటే.. దానిని విప్లవాత్మక నిర్ణయంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది'' అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు పార్టీ పోలిట్ బ్యూరో తెలిపింది.

బస్సుల్లో కెమెరాలు.. క్యాబ్‌ల్లో జీపీఎస్

మహిళా ప్రయాణికుల భద్రత కోసం క్యాబులకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయాలని తెలంగాణ రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఆర్టీసీతోపాటు ప్రైవేటు బస్సుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను రవాణా శాఖ సిద్ధం చేస్తోంది.

అన్ని ప్రైవేటు క్యాబుల్లో అత్యవసర మీట (ప్యానిక్‌ బటన్‌), జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ప్యానిక్‌ బటన్‌ను అన్ని పోలీస్‌ స్టేషన్లను అనుసంధానం చేస్తారు.

క్యాబుల్లో ప్రస్తుతం ఉన్న జీపీఎస్‌ క్యాబ్‌ నిర్వహకులకు, ప్రయాణికుల మార్గనిర్దేశం కోసం మాత్రమే ఉపకరిస్తుంది. దీనికి సమాంతరంగా మరో జీపీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, దాన్ని పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయాలన్నది రవాణా శాఖ ప్రతిపాదన.

ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపై అధికారులు కసరత్తు చేయాలని నిర్ణయించారు. జీపీఎస్‌, అత్యవసర మీట ఏర్పాటు విషయంలో ప్రైవేటు క్యాబు సంస్థలైన ఉబెర్‌, ఓలా సంస్థలను భాగస్వాములను చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

‘పారదర్శక పాలన అందిస్తున్నాం.. పెట్టుబడులతో రండి’

ఆంధ్రప్రదేశ్‌లో నిజాయతీ, పూర్తి పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామని, విదేశీ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం పలికనట్లు సాక్షి దినపత్రిక ఓ వార్త రాసింది.

విజయవాడలో విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల (డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌) సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు.

రాష్ట్రంలో వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని, కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

''972 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం, 4 నౌకాశ్రయాలు, 6 విమానాశ్రయాలు ఏపీలో ఉన్నాయి. వీటితోపాటు తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో, పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడులతోనూ మంచి సంబంధాలుండడం, కేంద్రం మద్దతు కూడా ఉండటం మాకున్న అదనపు బలాలు’’ అని జగన్ అన్నారు.

''విద్యుత్‌ రంగంలో అంతర్జాతీయ సంస్థలు, వాటికి రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయని తెలుసు. అందుకే ఉభయతారకంగా ఉండేలా పీపీఏలను పునఃసమీక్షించాలని నిర్ణయించాం. కంపెనీలకు వాస్తవ పరిస్థితులను తెలియజేశాం'' అని జగన్ చెప్పారు.

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించాలన్న చట్టం కూడా పరిశ్రమలకు అనుకూలమైన దిశలోనే ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనని జగన్ అన్నారు.

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ తొమ్మిది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనను జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు శుక్రవారం సాయంత్రం విరమించుకున్నట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ వైద్యులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, బ్రిడ్జికోర్సు, ఎగ్జిట్ పరీక్ష, ప్రైవేటు మెడికల్ కళాశాలలకు 50 శాతం సీట్ల కేటాయింపు తదితర అంశాలను సవరించాల్సిందిగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి ఈటల హామీనివ్వడంతో సమ్మె విరమిస్తున్నామని నిమ్స్ రెసిడెన్సీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ గుండగాని శ్రీనివాస్ వెల్లడించారు.

మంత్రి ఈటల సూచన మేరకు శనివారం నుంచి సాధారణ విధుల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నామని, బక్రీద్ రోజున కూడా ఓపీ సేవలు అందిస్తామని తెలిపారు.

ఎన్‌ఎంసీ బిల్లులోని అభ్యంతరకరమైన నిబంధనలపై తమ పోరాటం కొనసాగుతుందని, ఈ బిల్లును న్యాయపరంగా సవాలుచేసే అంశం కూడా తమ కార్యాచరణ ప్రణాళికలో ఉంటుందని తెలంగాణ జూనియర్ డాక్టర్ల జేఏసీ స్పష్టంచేసింది. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు దిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు అవసరమైతే నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)