ఆర్టికల్ 370: కశ్మీరీలతో కలిసి భోజనం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్... డబ్బులిస్తే జనాలు వస్తారన్న గులాం నబీ ఆజాద్

ప్రచురణ

భారత్ అధీనంలోని కశ్మీర్‌లో జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ స్థానికులతో కలిసి భోజనం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. కశ్మీరీలు ఆయనతో కలివిడిగా మాట్లాడుతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

ఈ వీడియోపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. డోభాల్ వెంట ఉన్న జనం డబ్బులు ఇస్తే వచ్చినవారని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు. ''డబ్బులిస్తే ఎవరైనా వెంట తెచ్చుకోవచ్చు'' అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు చేసినందుకు గులాం నబీ ఆజాద్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత శాన్వాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లోని కొందరు నాయకుల నోటి వెంట పాకిస్తాన్ భాష వస్తోందని, భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని విమర్శించారు.

గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను తప్పుపడుతూ కొందరు ట్వీట్లు పెట్టారు.

ఆయన మాటలు కశ్మీరీలను అవమానించేలా ఉన్నాయని ద్వివేదీ పీకే అనే ట్విటర్ హాండిల్‌తో ఉన్న వ్యక్తి అభిప్రాయపడ్డారు.

''ఆర్టికల్ 370 సవరణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేవారికి పాకిస్తాన్ డబ్బులు ఇస్తోందా?'' అని సత్యవాది అనే ట్విటర్ హాండిల్‌తో ఉన్న వ్యక్తి గులాం నబీ ఆజాద్‌ను ప్రశ్నించారు.

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు ముందు నుంచే కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. టెలిఫోన్ కమ్యునికేషన్స్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలోనే అజిత్ డోభాల్ బుధవారం కశ్మీర్‌లోని శోపియాన్ జిల్లాలో పర్యటించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియో అక్కడ తీసిందే.

డోభాల్ ఏం మాట్లాడారంటే..

ఆ వీడియోలో స్థానికులతో డోభాల్ సంభాషిస్తూ కనిపించారు.

''సంతోషంగా ఉండండి. అల్లా చేసేదంతా మంచికే. మంచివాళ్ల దువాకు శక్తి ఉంటుంది. మిమ్మల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మీకు భరోసా ఇస్తున్నా'' అంటూ వారితో అన్నారు.

''మీ పిల్లలు, వారి పిల్లలు.. అందరూ ఆనందంగా ఉండొచ్చు. మీ ఇస్లాం మతాన్ని పాటించొచ్చు. వాళ్లు మంచి వ్యక్తుల్లా పెరగాలి. ఇలా ఎప్పుడూ దిగ్బంధంలో ఉండటం మంచిది కాదు. కొత్త వాతావరణ సృష్టించాలి'' అని వ్యాఖ్యానించారు.

డోభాల్ పర్యటన గురించి జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నాయకురాలు శీలా రషీద్ ట్వీట్ చేశారు.

''మొత్తం కశ్మీర్‌ను బంధించి, బీజేపీ కార్యకర్తలతో కలిసి మాట్లాడుతూ సామాన్యులు మెచ్చే పని చేస్తున్నట్లు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రక్రియను వదిలి అసత్య ప్రచారానికి పాల్పడుతుండటం సిగ్గు పడాల్సిన విషయం'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)