You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం: 'మీకు మేం గాడిదలు కాసేవాళ్లలా కనిపిస్తున్నామా?' - ప్రెస్ రివ్యూ
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు, అభ్యంతరకర మాటలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, ఎదురుదాడులతో అసెంబ్లీ అట్టుడికిందని 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ వాగ్యుద్ధానికి కాళేశ్వరం, రైతులకు సున్నా వడ్డీ రుణాలు కేంద్ర బిందువుగా నిలిచాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరుకావడాన్ని విమర్శిస్తూ గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు... వాటికి ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రతి వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా సభ వాదోపవాదాలతో వేడెక్కింది.
''జగన్‌కు నా రాజకీయ అనుభవమంత వయసు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఏపీ, తెలంగాణలు భారత్ - పాకిస్థాన్ మాదిరిగా మారతాయని అప్పట్లో జగనే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో మీకు 50 శాతం ఓట్లు వస్తే.. మాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఏ నిర్ణయమైనా మేధావులతో చర్చించి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తీసుకోవాలి. అంతే తప్ప భావితరాల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని హెచ్చరిస్తున్నా'' అని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.
''కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఎందుకెళ్లారని ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నారు. నేను వెళ్లినా, వెళ్లకపోయినా ఆ ప్రాజెక్టు ఆగేది కాదు. గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబు ఏం చేశారు? (ప్రాజెక్టు కడుతున్నపుడు అడ్డుకోకుండా అప్పుడేమైనా గాడిదలు కాశారా?) కేసీఆర్, నేను కలిసి గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించగలిగితే.. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. దీనికి సంతోషించాల్సింది పోయి అందులోనూ చంద్రబాబు రాజకీయాలు వెతుకుతున్నారు. ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండదు'' అని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే సమయంలో ఐదేళ్లు అధికారంలో కొనసాగిన చంద్రబాబు గాడిదలు కాశారా? అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
''మీకు మేం గాడిదలు కాసేవాళ్లలా కనిపిస్తున్నామా? కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మీరేం మాట్లాడినా మేము పడాలా?'' అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు స్పీకరు పోడియంవద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. 'గాడిద' అనే పదాన్ని సీఎం ఎలా వాడతారు? ఇది సమంజసమేనా? అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ స్పందిస్తూ.. 'మా నాయకుడు గాడిదలు కాస్తున్నారా? అని మాత్రమే అడిగారు. టీడీపీ సభ్యులేమో తమ నాయకుడిని గాడిద అన్నారని హంగామా చేస్తున్నారు' అని ఎద్దేవా చేశారు.
నాలుగు సీట్లు చూసి ఎగిరెగిరి పడుతున్నరు... ఆర్నెల్లు అరిచి అరిచి అలిసిపోతడు: కేసీఆర్
''బీజేపోడు గిట్లనే.. ఆరు నెలలు అరిచి, అరిచి అలిసిపోతడు.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది...’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను కొందరు నాయకులు కేసీఆర్ వద్ద ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గురువారం తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలు కొందరితో కేసీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
బీజేపీలోని అన్ని స్థాయుల నేతలు చేస్తున్న విమర్శలకు తత్తర బిత్తర కావాల్సిన పనిలేదని కేసీఆర్ వారికి స్పష్టంచేశారు. అదే సమయంలో వారు చేస్తున్న తప్పుడు ఆరోపణలు, విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని ఆదేశించారు. వారి విమర్శలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సూచించారు.
రాష్ట్రంలో బీజేపీకి సరైన పునాది, యంత్రాంగం, శక్తి లేవని.. ఆ పార్టీ పరిషత్ ఎన్నికల్లో ఎనిమిది జడ్‌పీటీసీ స్థానాలకు పరిమితమవడమే దానికి నిదర్శనమని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందడానికి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పరిస్థితి కారణమని విశ్లేషించారు. దీన్ని చూసుకొని బీజేపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నరని, పట్టించుకోవాల్సిన పనిలేదని తేలిగ్గా తీసుకున్నారు.
''మనం పని చేద్దాం. ప్రజలను నమ్ముకుందాం. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గ్రామాలను అద్దంలా తీర్చిదిద్దుదాం. పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుద్దాం. అప్పటివరకు వాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. ప్రజలకు కళ్ల ముందు మనం చేసిన పనులు కనిపిస్తాయి'' అని టీఆర్‌ఎస్ అధినేత చెప్పారు.
టీడీపీ ఎంపీలపై ఉన్నది ఆరోపణలే : కన్నా లక్ష్మీనారాయణ
తెలుగుదేశం పార్టీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు.
2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు.
ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా.
కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి.
కాంగ్రెస్ తనను క్లర్క్ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమారస్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత విభేదాలే కారణం అన్నారు.
అయోధ్యపై 18లోపు నివేదిక ఇవ్వండి: మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆదేశం
అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం సమస్య పరిష్కారంలో పురోగతిపై నివేదికను అందజేయాలని మధ్యవర్తిత్వ కమిటీని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఈ నెల 18నాటికి మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతిపై నివేదికను ఇవ్వాలని సూచించింది. ఒకవేళ మధ్యవర్తిత్వ ప్రక్రియ అవసరం లేదనిపిస్తే, తదుపరి ఉత్తర్వుల్ని అదే రోజు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని స్పష్టంచేసింది.
అయోధ్య భూ వివాదంపై నివేదికను మధ్యవర్తిత్వ కమిటీ జులై 18 నాటికి సమర్పించాలి. తదుపరి ఉత్తర్వుల్ని అదే రోజున ఇస్తాం అని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అయోధ్య భూ వివాదంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ చాలని అనిపిస్తే, అదే రోజున తగిన ఆదేశాలు ఇచ్చి.. ఈ అంశంపై విజ్ఞప్తులను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
అయోధ్య వివాదంలో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా నేతృత్వం వహిస్తుండగా ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు.
కమిటీ ఇటీవల సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించింది. అయితే సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ కోర్టును కోరింది. దీంతో ఆగస్టు 15వరకు న్యాయస్థానం గడువు కల్పించింది. మధ్యవర్తిత్వంతో ఎలాంటి ప్రయోజనం కన్పించట్లేదంటూ గోపాల్‌సింగ్ విశారద్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కమిటీకి జులై 18వ తేదీని గడువుగా విధించింది.
ఇవి కూడా చదవండి:
- 'అగ్రకులం' అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకున్న దళిత యువకుడి హత్య
- మామిడిపండు కోస్తే మనిషిని చంపేస్తారా.. అసలేం జరిగింది
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- ఐవీఎఫ్: తమకు పుట్టిన పిల్లల్లో తమ లక్షణాలు లేవంటూ కేసు వేసిన దంపతులు
- ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవలలు పుడతారా...
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)