''చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు...'' - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఇకపై ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రి అయ్యారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రానున్న ఎన్నికల్లో బీజేపీ, వైసీపీల మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రాను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు.

మంగళవారం విజయగనగరం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో సునీల్‌ దేవధర్‌ మాట్లాడుతూ టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని విమర్శించారు.

కాంగ్రెస్‌, జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి అధిక సంఖ్యలో బీజేపీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా విషయమై కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు బాధ్యతలు అప్పగించారని చెప్పారు.

అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమానికి అనుమతి

ప్రభుత్వ బడులను పరిరక్షించుకోవడానికి ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు పలు గ్రామ పంచాయతీ, ఎస్‌ఎంసీ కమిటీలు తీర్మానాలు చేస్తున్నాయని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పంచాయతీలు అడిగిన వెంటనే ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేస్తున్నారు. 2019-2020 విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్న పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇప్పటి వరకు అనేక పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చిన విద్యాశాఖ తాజాగా మరో తొమ్మిది పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇచ్చింది.

మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్, ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల్, ఆర్మూర్‌ మండలంలోని మంథని, కోమన్‌పల్లి, సుర్బిర్యాల్, డిచ్‌పల్లి మండలంలోని కొరట్‌పల్లి, కమలాపూర్, నవీపేట్‌ మండలంలోని నాళేశ్వర్, రెంజల్‌ మండలంలోని దూపల్లి పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

ఆరు, ఏడు తరగతుల్లో ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో అనుమతి ఇవ్వగా వచ్చే ఏడు ఎనిమిదో తరగతికి ఆంగ్ల మాధ్యమాన్ని విస్తృత పరచనున్నారు. దశల వారీగా పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది.

ఆంగ్ల మాధ్యమం అమలుకు మూడేళ్ల కిందటే విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలను స్వీకరించారు. అయితే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అమలుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. చివరకు ఈ విద్యా సంవత్సరానికి గాను ఆంగ్ల మాధ్యమం అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో విద్యాశాఖ అనుమతులను ఇస్తోంది.

2021 జనగణనలో మన జనాభా చైనాను మించిపోతుంది?

ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా ఉన్న చైనా రికార్డును భారత్‌ అధిగమించనుందా? 2020 కల్లా 64% యువతతో 'యువ భారత్‌'గా నిలవనుందా? అంటే.. 2021 జనాభా లెక్కల్లో ఇదే తేలనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. 2018 అంచనాల మేరకు భారత జనాభా 133.92 కోట్లు కాగా.. చైనాలో 138.64 కోట్ల మంది ఉన్నారు. రెండు దేశాల మధ్య తేడా 4.72 కోట్లే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం.. 2021 జనగణనలో భారత్‌ చైనాను మించిపోవచ్చు.

అంతేకాదు.. 2020 కల్లా అంటే వచ్చే ఏడాది నాటికి భారత జనాభాలో 64 శాతం యువతే ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశంగా భారత్‌ నిలవనుంది.

కుటుంబ నియంత్రణపై శ్రద్ధ లేకపోవడం వంటి కారణాలతో భారత్‌లో జనాభా నియంత్రణలో లేదనేది ఐరాస, ఇతర సంస్థల అభిప్రాయం. దీనివల్ల నిరుద్యోగం, పౌష్ఠికాహారలోపం, మాతాశిశు మరణాలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి

2021 జనాభా లెక్కలకు ఈ ఏడాది ఆగస్టు 12న అంకురార్పణ జరగనుంది. రెండు దశల్లో జనగణనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి జనగణనకు 33 లక్షల మందిని నియమిస్తుండగా.. పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడనున్నారు. ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు.

జన్‌ధన్ ఖాతాల్లో లక్ష కోట్ల డిపాజిట్లు

జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

జూలై 3 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 36.06 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) బ్యాంక్ ఖాతాల్లో రూ.1,00,495.94 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది.

జూన్ 6 నాటికి ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 99,649.84 కోట్లుగా ఉన్నాయి. ఆగస్టు 28, 2014న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)