ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షల ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం :ప్రెస్‌రివ్యూ

ఉద్యోగం ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో యాభై కుటుంబాలకో వాలంటీర్‌ చొప్పున నియామకం కోసం సోమవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారని ఈనాడు తెలిపింది. ఈ మేరకు ఆది, సోమవారాల్లో జిల్లాల వారీగా కలెక్టర్లు ప్రకటనలు (నోటిఫికేషన్లు) జారీ చేస్తారు.

అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాక మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), తహసీల్దార్‌, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి కార్య నిర్వహణాధికారి(ఈవో)లతో కూడిన భాగస్వామ్య కమిటీ ఎంపికలు పూర్తి చేస్తుంది. 50 శాతం పోస్టుల్ని మహిళలకు కేటాయించనున్నారు.

నవరత్నాల్లో భాగంగా గ్రామాల్లో వాలంటీర్ల నియామకానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం వీటిని ఆమోదిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆశించిన స్థాయిలో పనితీరు కనపరచని వాలంటీర్లను తొలగించే అధికారం అధికారులకు ఉంది.

అభ్యర్థులు http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్‌ లింకులో దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలి. మండల స్థాయి కమిటీ వీటిని పరిశీలించి అర్హులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తుంది. ఎంపికైన వాలంటీర్లను గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడెక్కడ నియమించాలో ఎంపీడీవోయే నిర్ణయిస్తారు.

వాలంటీర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం చెల్లిస్తారు. దీనికింద ఏటా రూ.1,200 కోట్లు అవసరం. ఎంపిక, శిక్షణలకు ప్రాథమికంగా రూ.13.50 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ పేర్కొనే విధులు, బాధ్యతల మేరకు వాలంటీర్లు పని చేయాలి. మండల స్థాయిలో ఎంపీడీవోలు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు వీరి పనితీరును సమీక్షిస్తారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక పరిశీలన వ్యవస్థ పనిచేయనున్నది.

నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల ఇళ్ల ముంగిటే ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే కార్యక్రమ ధ్యేయమని జీవోలో వివరించారు.

విధి నిర్వహణలో భాగంగా వాలంటీర్లు తమ దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను సైతం గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేలా వ్యవస్థను రూపొందించారు.

నగరాలు, పట్టణాల్లోనూ 50 కుటుంబాలకో వాలంటీర్‌ నియామకానికి ప్రభుత్వం మరో జీవో జారీ చేయనుంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో స్వల్పమార్పులు చేసి సోమవారం తర్వాత జీవో విడుదల చేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో వాలంటీర్ల విద్యార్హత డిగ్రీగా నిర్ణయించారు. వీరి ఎంపిక కమిటీలో పురపాలక, నగరపాలక కమిషనర్‌లు కీలకం కానున్నారని ఈనాడు తెలిపింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఫొటో సోర్స్, kcr/fb

ఎర్రమంజిల్‌కు సీఎంవో

తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం వేగం పెంచింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పూర్తి కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాలయ నిర్మాణంపై దృష్టి పెట్టారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

భవన నిర్మాణాలకు ఈ నెల 27న శంకుస్థాపన కూడా ఖరారవడంతో మిగతా అంశాలపై కసరత్తు చేస్తున్నారు. శనివారం రోడ్లు భవనాలు, సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

సుదీర్ఘంగా సాగిన ఈ సమీక్షలో సచివాలయంలోని మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు; శాఖా కార్యాలయాల తరలింపు; ముఖ్యమంత్రి, జీఏడీ కార్యాలయాలకు భవన వసతి; ఆర్కిటెక్ట్‌ నియామకం; సచివాలయ భవన నమూనా తదితర అంశాలపై చర్చించారు. సచివాలయంలోని మంత్రులు, కార్యదర్శుల చాంబర్లను నగరంలోని ఆయా శాఖల విభాగాధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలకు తరలించే విషయమై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యాలయాల తరలింపునకు సరిపడా భవన వసతి ఉందా లేదా అని ఆరా తీశారు.

అయితే ఏ కార్యాలయానికి తరలించినా అక్కడి చాంబర్లు, భవన వసతులను ఆధునికీకరించే పరిస్థితి ఉండకూడదని సీఎం హెచ్చరించినట్లు సమాచారం. మంత్రులు, కార్యదర్శుల చాంబర్ల ఆధునికీకరణ పేరిట అనవసర ఖర్చు చేయొద్దని చెప్పారు.

ఇప్పటికైతే ఉన్న భవన వసతులను వినియోగించుకోవాలని, వాటిలోనే సర్దుకోవాలని, సాధ్యమైనంత త్వరగా కొత్త సచివాలయాన్ని నిర్మించుకుందామని చెప్పినట్లు తెలిసింది. ఏయే కార్యాలయాన్ని ఎక్కడికి తరలించాలన్న విషయమై ఇప్పటికే జీఏడీ అధికారులు ప్రాథమికంగా 'బ్లూప్రింట్‌'ను తయారు చేసినట్లు సమాచారం. దీన్ని సీఎంకు సమర్పించారు.

మంత్రులు, కార్యదర్శుల చాంబర్లను ఆయా కమిషనరేట్లు/డైరెక్టరేట్లకు తరలిస్తే సరిపోతుందని అధికారులు వివరించినట్లు సమాచారం. రవాణా శాఖ చాంబర్లను బస్‌భవన్‌ లేదా ఖైరతాబాద్‌ కమిషనరేట్‌కు తరలించే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ చాంబర్లు, కార్యాలయాలను కమిషనరేట్‌ లేదా నాంపల్లిలోని ఉద్యానవన శిక్షణ సంస్థ లేదా పబ్లిక్‌ గార్డెన్‌లోని ఉద్యానవన కమిషనరేట్‌కు తరలించనున్నారు. సీఎంవో, జీఏడీకి ఎర్రమంజిల్‌లో రోడ్లు భవనాల శాఖ కోసం నూతనంగా నిర్మించిన ఈఎన్‌సీ కార్యాలయాన్ని గానీ, పౌర సరఫరాల భవనాన్ని గానీ వినియోగించుకోవాలన్న చర్చ వచ్చింది.

బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి వీటిని తరలించాలన్న చర్చ జరిగినప్పటికీ అక్కడ స్థలం ఎక్కువగా లేదని, పార్కింగ్‌ సమస్య ఉందని అధికారులు వివరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ, పౌర సరఫరాల భవనాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు నమూనాను పంపించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ కూడా నమూనాలను పంపారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

జగన్

ఫొటో సోర్స్, jagan/fb

అవినీతిపై రాజీలేని పోరు

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వ్యవస్థీకృతం చేసిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించడమే లక్ష్యంగా పోరాటం ప్రారంభించానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని సాక్షి తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంత అవినీతి దేశంలో మరెక్కడా ఉండదని ఢిల్లీలో చర్చ జరుగుతోందన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎంగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారని, ఆయన తీరు వల్లే జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాను కూడా కళ్లు మూసుకుంటే రాష్ట్రం భవిష్యత్‌ అధోగతిపాలవుతుందన్నారు. దేశంలోనే అత్యున్నత పారదర్శక విధానాలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా మార్చే వరకు విశ్రమించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ పనుల్లో అక్రమాలపై విచారణ చేయడానికి ప్రభుత్వం ఈనెల 14న నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కమిటీ సభ్యులతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటిసారి సమావేశమయ్యారు.

నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. అక్రమార్జన కోసం అవినీతిని వ్యవస్థీకృతం చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అప్పటి వరకు పని చేస్తున్న కాంట్రాక్టర్లపై 60సీ నిబంధన కింద వేటు వేయడం.. మిగిలిపోయిన పని అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేయడం.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు కుదిరితే నామినేషన్‌ పద్దతిలో కట్టబెట్టడం, కుదరకపోతే టైలర్‌ మేడ్‌ నిబంధనలతో టెండర్‌ నిర్వహించి అప్పగించడం.. అవసరం లేకపోయినా జీవో 22, జీవో 63 ద్వారా అదనపు నిధులు దోచిపెట్టడం ద్వారా చంద్రబాబు భారీ ఎత్తున దోచుకున్నారని, ఈ దోపిడీ వల్ల రాష్ట్ర ఖజానా అతలాకుతలమైందని వివరించారు.

చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను సిద్ధమైతే, అవినీతిని పట్టించుకోకుండా కళ్లు మూసుకోవాలని కొందరు తనకు ఉచిత సలహాలు ఇచ్చారని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురాకపోతే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదని, అందుకే అత్యంత పారదర్శకత కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ ఒత్తిడి వల్ల అంచనా వ్యయం పెంచేసి.. ఖజానాకు జరిగిన నష్టాన్ని బయటపెట్టి.. ప్రజాధనాన్ని మిగిల్చే అధికారులకు ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానం చేస్తామని పునరుద్ఘాటించారని సాక్షి పేర్కొంది.

టీ వ్యాలెట్

ఫొటో సోర్స్, Twallet/fb

లావాదేవీల్లో టీ-వ్యాలెట్ జోరు

దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యాలెట్‌గా గుర్తింపు పొందిన టీ-వ్యాలెట్ ఆర్థిక లావాదేవీల్లో శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్నదని నమస్తే తెలంగాణ పేర్కొంది.

కేవలం రెండేళ్ల వ్యవధిలోనే రూ.2,158 కోట్ల విలువైన 54.33 లక్షల లావాదేవీలు నిర్వహించి ప్రముఖ స్థానంలో నిలిచింది.

ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందజేయడంతోపాటు కనీసం ఫోన్ సౌకర్యంలేని వినియోగదారులు సైతం ఉపయోగించుకునేలా రూపొందించిన టీ-వ్యాలెట్ ఈ నెల ఆరంభంలోనే రెండేళ్లు పూర్తిచేసుకుని ప్రజలకు మరిన్ని వినూత్న సేవలను అందించే దిశగా ముందుకు సాగుతున్నది.

2017 జూన్ 1న ప్రారంభమైన టీ-వ్యాలెట్ దేశంలోనే తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాలెట్‌గా గుర్తింపు పొందింది. తొలుత విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులు, జీహెచ్‌ఎంసీ తదితర సేవలతో ప్రారంభమైన టీ-వ్యాలెట్.. ఆ తర్వాత మరిన్ని రంగాలకు విస్తరించి ట్రాఫిక్ చలాన్లు, టీఎస్‌ఆర్టీసీ బస్‌టికెట్లు, విమాన టికెట్లు, టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు, కార్మికశాఖకు సంబంధించిన ఫీజుల చెల్లింపులతోపాటు టాస్క్, దోస్త్ రిజిస్ట్రేషన్లు, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్‌లు, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు లాంటి సేవలను అందజేస్తున్నది.

ఇటీవల పౌరసరఫరాల శాఖలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-పాస్ యంత్రాలను కూడా టీ-వ్యాలెట్‌తో అనుసంధానం చేయడంతో గ్రామీణులకు సైతం డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి వచ్చాయి. టీ-వ్యాలెట్‌కు కో-బ్రాండింగ్ భాగస్వామిగా సేవలు అందజేస్తున్న ట్రాన్సాక్షన్ అనలిటిక్స్ సంస్థ.. దేశంలోనే తొలిసారి రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అనుమతితో వ్యాలెట్ సేవలు అందజేస్తున్న సంస్థగా గుర్తింపు పొందిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)