యాస్తిక భాటియా, క్రాంతి గౌడ్: లార్డ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు రాసిన చరిత్ర..142 ఏళ్లలో తొలిసారి

భారత మహిళల క్రికెట్ జట్టు, లార్డ్స్ మైదానం, ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది.
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

క్రికెట్‌కు మక్కాగా గుర్తింపు పొందిన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు 270 పరుగుల తేడాతో గెలిచింది.

మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం కోసం 457 పరుగులు చేయాల్సి ఉండగా 186 పరుగులకే ఆలౌటైంది.

భారత మహిళా క్రికెట్‌లో ఇదొక అపూర్వ విజయం. ఎందుకంటే ఇంగ్లండ్‌లో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.

లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతంగా ఆడింది. అనేక రికార్డుల కారణంగా ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

లార్డ్స్‌లో పురుషుల క్రికెట్ తొలి టెస్ట్ మ్యాచ్ 1884 జూలై 21 నుంచి 23 వరకు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5 పరుగుల తేడాతో ఓడించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత మహిళల క్రికెట్ జట్టు, లార్డ్స్ మైదానం, ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, తొలి ఇన్నింగ్స్‌లో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో స్నేహ్ రాణా నాలుగు వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ జరిగిన 142 ఏళ్ల తర్వాత లార్డ్స్‌లో మహిళల మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో ఇండియన్ ప్లేయర్ యాస్తిక భాటియా సెంచరీ సాధించింది. క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు పడగొట్టింది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు చరిత్ర సృష్టించారు.

భారత మహిళల క్రికెట్ జట్టు, లార్డ్స్ మైదానం, ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లార్డ్స్ గ్రౌండ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన క్రీడాకారిణిగా క్రాంతి గౌడ్ రికార్డులకెక్కారు.

రికార్డు సృష్టించిన క్రాంతి గౌడ్

ఇంగ్లండ్డ్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 285 పరుగులు చేసింది.

స్మృతి మంధాన 83 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 58 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ జట్టును 170 పరుగులకే ఆలౌట్ చేసి 115 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

మీడియం పేసర్ క్రాంతి గౌడ్ 37 పరుగులకు ఐదు వికెట్లు తీసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించుకుంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ఆమె నిలిచింది.

సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు తీయగా దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టింది.

భారత మహిళల క్రికెట్ జట్టు, లార్డ్స్ మైదానం, ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో యాస్తిక భాటియా 113 పరుగులు చేసింది.

సెంచరీతో చరిత్ర రాసిన యాస్తిక భాటియా

రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. వికెట్ కీపర్-బ్యాటర్ యాస్తిక భాటియా సెంచరీ సాధించింది.

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాటర్‌గా యాస్తిక భాటియా నిలిచింది.

యాస్తిక 113 పరుగులు చేసి 14 ఫోర్లు కొట్టింది. స్మృతి మంధాన రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి అర్ధశతకం సాధించింది. రిచా ఘోష్ 50 పరుగులు చేసింది.

భారత జట్టు తమ రెండవ ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లండ్‌కు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత బౌలర్లు పకడ్బందీగా బౌలింగ్ చేశారు. స్పిన్నర్ స్నేహ్ రాణా 42 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టింది.

సైలీ సత్ఘరే, క్రాంతి గౌర్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)