‘చట్టబద్ధమైన పనులను కూడా నేరంగా మారుస్తున్నారు, నిరసన తెలిపితే జైలుకు పంపుతున్నారు’: సుప్రీం కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై తీవ్ర చర్చ

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

విభిన్న అభిప్రాయాలకు భారత్‌లో చోటు రోజురోజుకూ తగ్గిపోతోందని సుప్రీం కోర్టు నాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శనివారం అన్నారు.

తమ హక్కుల కోసం నిరసన తెలిపే విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని, వారికి బెయిల్ కూడా లభించని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకవేళ బెయిల్ వచ్చినా, వారి స్వేచ్ఛను తీవ్రంగా పరిమితం చేసేలా కోర్టులు కఠినమైన షరతులు విధిస్తాయని అభిప్రాయపడ్డారు.

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలను ముగిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది.

సుమారు నెలరోజుల పాటు సాగిన ఈ నిరసనల్లో భాగంగా, జులై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌ సందర్భంగా పెద్ద ఎత్తన హింస జరిగింది. ఇందులో పలువురు నిరసనకారులు, కొంతమంది పోలీసులు గాయపడ్డారు.

జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వస్తున్నాయి.

భారత్‌లో ఎదురుతిరిగే గొంతులను అణచివేస్తున్నారనడానికి ఇది నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.

నిజానికి, అసమ్మతిని తెలియజేసే చట్టబద్ధమైన మార్గాలను కూడా ఇప్పుడు నేరంగా మార్చేస్తున్నారని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు.

బెయిల్ నిరాకరించడం, ఒకవేళ బెయిల్ ఇచ్చినా సెల్ఫ్ సెన్సార్‌షిప్ విధించే ధోరణిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గంగానదిలో పడవ మీద ఇఫ్తార్ పార్టీ చేసుకున్న కొందరు యువకులకు బెయిల్ నిరాకరించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.

భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన జస్టిస్ జీపీ సింగ్ స్మారక ఉపన్యాసంలో జస్టిస్ భుయాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లోని యూనివర్సిటీలు ఇలాంటి అంశాలపై విద్యార్థులు ఆలోచించడానికి, పరిశోధనలు చేయడానికి వేదికలుగా ఉండాలి కానీ, వారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

జస్టిస్ భుయాన్ ఏమన్నారు?

లైవ్ లా వెల్లడించిన వివరాల ప్రకారం.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం, శాంతియుతంగా నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక స్వేచ్ఛ అని జస్టిస్ భుయాన్ అన్నారు. చర్చలు, విభేదాలు అనేవి ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటివని పేర్కొన్నారు.

"దురదృష్టవశాత్తూ ఇప్పుడు చట్టబద్ధమైన కార్యకలాపాలను కూడా నేరంగా మార్చేస్తున్నారు. పరిస్థితులు మారిపోయాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ మార్పులపై తమ బాధను వెళ్లగక్కే ప్రజలను నేరస్థుల్లా తరుముతున్నారు. క్యాంపస్‌లలో నిరసన తెలిపే విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. వారికి 30-40 రోజుల వరకు బెయిల్ రావడం లేదు. సస్పెండ్ చేస్తున్నారు. దాంతో వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇదంతా అవ్వడానికి చాలా సమయం పడుతుంది'' అని జస్టిస్ భుయాన్ ప్రసంగించారు.

చట్టం ప్రకారం నేరం కాని పనికి, బెయిల్‌ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని జస్టిస్ భుయాన్ ప్రశ్నించారు.

"చికెన్ బిర్యానీ తినడం నేరం కాదని నేను గట్టిగా నమ్ముతున్నా. గంగానదిపై చికెన్ తినకుండా అడ్డుకునే చట్టమేదీ లేదు. కేవలం ఈ కారణంతోనే వారిని అరెస్టు చేసి మూడు నెలల పాటు జైలులో ఉంచారు.

గంగానదిపై చికెన్ బిర్యానీ తిన్నారనే ఈ కారణంతో ప్రజలను అరెస్టు చేసి మూడు నెలల పాటు బెయిల్ నిరాకరించవచ్చా? నాకు నేనే ఈ ప్రశ్న వేసుకుంటాను" అని ఆయన వ్యాఖ్యానించారు.

బెయిల్ ఇచ్చే విషయంలో కోర్టుల వైఖరిని కూడా ఆయన ప్రశ్నించారు.

ఇప్పుడు కోర్టులు బెయిల్ ఇచ్చేటప్పుడు, ఒక వ్యక్తి నిరసన తెలిపే స్వేచ్ఛపై ఆంక్షలు విధించేలా షరతులు పెడుతున్నాయని ఆయన తెలిపారు.

దిల్లీ అల్లర్లకు సంబంధించిన గుల్ఫిషా ఫాతిమా కేసును కూడా జస్టిస్ భుయాన్ ప్రస్తావించారు. ఆ కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీం కోర్టు కఠినమైన షరతులు విధించింది.

"ఆ యువ విద్యార్థి యాక్టివిస్టుల కేసును చూడండి. వాళ్లు ఎక్కువ కాలం జైల్లోనే ఉన్నారు. కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది. కానీ, వారు ప్రత్యక్షంగా గానీ, వర్చువల్‌గా గానీ ఏ రకమైన బహిరంగ సభల్లో పాల్గొనకుండా, ప్రసంగించకుండా నిరోధించింది.

ఇలాంటి షరతులు వారి ప్రాథమిక స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలాంటి ఆర్డర్లు ఇవ్వడం లేదా షరతులు పెట్టడం ద్వారా కోర్టులు ఇలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని మెసేజ్ ఇస్తున్నాయా? అని ప్రజలు ప్రశ్నించడం పూర్తిగా సరైనదే" అని ఆయన స్పష్టం చేశారు.

బాంబే హైకోర్టుపై విమర్శలు

ఇవే కాకుండా బాంబే హైకోర్టును కూడా జస్టిస్ భుయాన్ విమర్శించారు.

పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిరసన తెలిపేందుకు పర్మిషన్ అడిగిన సీపీఎం పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేయడాన్ని జస్టిస్ భుయాన్ విమర్శించారు.

''మన దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా.. ఎక్కడో ఉన్న గాజా, పాలస్తీనా గురించి మాట్లాడటం దేశభక్తి కాదు. ఈ దేశ సమస్యలపై మాట్లాడండి" అని కోర్టు వ్యాఖ్యానించడం తనకు వింతగా అనిపించిందన్నారు.

''ముంబయిలోని శివాజీ పార్క్‌లో కొందరు, గాజా ప్రజలకు మద్దతుగా నిరసన తెలపాలని అనుకున్నప్పుడు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం నాకు చాలా వింతగా అనిపించింది. ఆ తర్వాత వారు బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో గౌరవనీయ న్యాయమూర్తి, 'భారతదేశంలో మీకు మాట్లాడటానికి ఏ సమస్యలూ లేవా? అంతదూరంలో ఉన్న గాజా గురించి ఆందోళన చెందుతున్నారు' అని వ్యాఖ్యానించినట్లు'' జస్టిస్ భుయాన్ చెప్పారు.

ఇండియా ఎప్పటి నుంచో పాలస్తీనాను గుర్తిస్తోందని, గాజా హింసపై ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మురళీధరన్‌తో విచారణ జరిపించిన ఐక్యరాజ్యసమితి.. ఆ రిపోర్టును ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు.

ఆ రిపోర్టు ఇప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉందని ఆయన అన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులపై జరిపిన హింస వివరాలు ఆ రిపోర్టులో ఉన్నాయని చెప్పారు.

రిటైర్మెంట్ తర్వాత మాజీ న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరడం ప్రాథమికంగా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, ఇది స్వతంత్ర అధికారాల సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన కేశవానంద భారతి తీర్పు ఇప్పటికీ సరైనదేనని జస్టిస్ భుయాన్ అన్నారు. రాజ్యాంగంలోని ఏ నిబంధనైనా సవరించవచ్చని, అయితే దాని మూల స్వరూపాన్ని మార్చలేమని 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఆ తీర్పులో చెప్పింది.

ఈ తీర్పును విమర్శించినందుకు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను కూడా ఆయన విమర్శించారు.

'ఈ తీర్పు కాలపరీక్షకు నిలిచింది. రాజ్యాంగ ధర్మాసనాలు దీన్ని డజనుకు పైగా సార్లు అమలు చేశాయి. కాబట్టి, అప్పటి ఉపరాష్ట్రపతి ఈ తీర్పు చెల్లుబాటును ప్రశ్నించడం తప్పు. అలాగే, ఈ తీర్పుపై తనకు పూర్తి నమ్మకం లేదని భారత మాజీ సీజేఐ రాజ్యసభలో చెప్పడం కూడా తప్పే' అని ఆయన అన్నారు.

ప్రజలు ఏమన్నారంటే..

జస్టిస్ భుయాన్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనిపై అనేకమంది స్పందించారు.

దిల్లీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్తాబ్ ఆలం, జస్టిస్ భుయాన్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

"భారతదేశంలో అసమ్మతికి చోటు రోజురోజుకు తగ్గిపోతోందని జస్టిస్ భుయాన్ విచారం వ్యక్తం చేశారు'' అని ఆయన పేర్కొన్నారు.

"అసలైన కోర్టు తీర్పుల్లో చెప్పాలనుకున్నా చెప్పలేని విషయాలను చెప్పడానికే ఈ రోజుల్లో ఇలాంటి స్పీచ్‌లు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు మార్నింగ్ వాక్‌లు, రిటైర్మెంట్ తర్వాత లభించే పదవులే ముఖ్యం" అని దేబాశిష్ రాయ్ చౌదరీ అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

భోగేంద్ర ఠాకూర్ అనే వ్యక్తి కూడా ఎక్స్ ద్వారా స్పందించారు.

''సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేడు చేసిన వ్యాఖ్యలకు ఉన్న విలువేంటి? సుప్రీం కోర్టు తీర్పులకు.. అవి రాసే కాగితానికి ఉన్నంత విలువ కూడా ఉండటం లేదు. చెప్పిన మాటలను ఆచరణలో పెట్టాలి. వారు చాలా బాగా మాట్లాడతారు. తీరా సమయం వచ్చాక మోదీ, ఆయన సన్నిహితులు కోరుకున్నట్లే తీర్పు ఇస్తారు'' అని ఆయన ట్వీట్ చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)