అమ్మాయిలు బూతులు మాట్లాడటం అంత దారుణమైన విషయమా?

సీజేపీ నిరసన

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, గీతా పాండే
    • హోదా, ఉమెన్ అఫైర్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారత్‌లో ఇటీవలి నిరసన సమయంలో యువతులు బూతులు తిడుతున్న దృశ్యాలు ఒక అసాధారణమైన చర్చకు దారితీశాయి. అమ్మాయిలు బూతులు మాట్లాడితే అది అంత దారుణమైన విషయమా?

యువతులు బూతులు మాట్లాడటం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని "కల్చర్ షాక్ (సాంస్కృతిక దిగ్భ్రాంతి)'' గా వర్ణించగా, దాన్ని ప్రతిపక్ష ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.

"అబ్బాయిలు బూతులు మాట్లాడితే ఎలాంటి సమస్య లేదు, దాన్ని అనుమతిస్తారు. కానీ, ఒక అమ్మాయి బూతులు మాట్లాడితే అది సాంస్కృతిక దిగ్భ్రాంతి అవుతుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.

నిరసనకారులు ప్రభుత్వంపై తమ ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. అయితే, కొంతమంది ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. దీంతో, ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. మోదీ రాజకీయాలను విమర్శించే వారు కూడా ఆ మహిళలు హద్దు మీరారని అన్నారు.

ఈ నిరసనలు నెల క్రితమే ముగిశాయి. కానీ, మహిళా ఉద్యమాన్ని, మహిళలు తమ అభిప్రాయాలను తిట్ల వర్షం కురిపిస్తూ వ్యక్తం చేయడాన్ని దేశంలో ఎలా చూస్తున్నారనే విషయంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మళ్లీ చర్చను రేకెత్తించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విద్యా వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావాలని కోరుతూ దిల్లీలో, ఇతర నగరాల్లో వారాల తరబడి జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల సమయంలో.. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కొందరు యువతులు అసభ్యకరమైన భాషను వాడటంతో ఈ చర్చ మొదలైంది.

ఈ అంశంపై స్వయంగా సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ.. యువతులు బూతులు తిట్టడం తనకు ''సాంస్కృతిక దిగ్భ్రాంతి''ని కలిగించిందని, కానీ, తాను వారిని క్షమిస్తానని చెప్పారు.

అయితే, నిరసనకారులపై పోలీసులు జరిపిన హింసాత్మక అణచివేతపై ప్రధానమంత్రి ఎలాంటి కామెంట్ చేయలేదు. అలాగే, సీజేపీ నిరసనల్లో పాల్గొన్నందుకు తమను ట్రోల్ చేశారని, అత్యాచార బెదిరింపులు వచ్చాయని చెప్పిన మహిళలకూ ఆయన మద్దతుగా నిలబడ లేదు.

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Congress party

వారం చివరిలో పుణెలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో మోదీ చేసిన 'కల్చర్ షాక్' కామెంట్ గురించి విమర్శించారు రాహుల్ గాంధీ.

ఎగ్జామ్ పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పురుషులు, మహిళలు ఇద్దరూ అసభ్య పదజాలం వాడారని ప్రస్తావిస్తూ, మోదీ కేవలం మహిళల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

మోదీని అవమానిస్తూ మహిళా నిరసనకారులు పట్టుకున్న పోస్టర్లు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈయన ఈ కామెంట్లు చేశారు.

అభ్యంతరకరమైన పోస్టులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, సోషల్ మీడియాలో ట్రోల్స్ ద్వారా వేధింపులను, బెదిరింపులను ఎదుర్కొంటూ ఒక 15 ఏళ్ల బాలిక వివాదంలో చిక్కుకున్నారు.

ఆ యువతి తాను వాడిన భాషకు క్షమాపణలు కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. తాను ఆ వీడియోను తొలగించినట్లు కూడా ఆమె చెప్పారు. కానీ, ప్రజల్లో ఆగ్రహం మాత్రం అలానే కొనసాగింది.

ఈ వివాదం వల్ల చాలాసార్లు తాము ఇంటిని మారాల్సి వచ్చిందని ఆమె తల్లి స్థానిక మీడియాకు తెలిపారు.

నిరసన ముగిసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వర్టికల్ వీడియోలో మోదీ మరింత రాజీ ధోరణితో వ్యవహరించారు.

"కొంతమంది అల్లరి పిల్లలు నాగరిక సమాజంలో అసలు స్థానం లేని అత్యంత అసభ్యకరమైన బూతులు తిట్టారు. వాళ్లు నన్ను దూషించారు. చనిపోయిన నా తల్లిని కూడా దూషించారు. ఇది తీవ్రంగా కలచివేసింది" అని చెప్పారు.

తన మద్దతుదారుల ఆగ్రహాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన, వారి కోపాన్ని తాను అర్థం చేసుకుంటానని అన్నారు.

''ఇది కల్చర్ షాక్. మన అమ్మాయిలు ఇలాంటి భాషను ఎలా ఉపయోగించారు? కానీ, చిన్నతనంలో తప్పులు చేస్తారు, వాటిని సరిచేసుకునేందుకు ఒక అవకాశం ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నా'' అని తెలిపారు.

పుణెలో జరిగిన కార్యక్రమంలో, నిరసనకారుల లింగభేదాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక పితృస్వామ్య భావజాలం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

"అమ్మాయిలకు ఒక పరిధి ఉండి, అబ్బాయిలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఉంటుందనేది ఏం ఆలోచన విధానం? వారు ఏమైనా చేయవచ్చు, కావాలంటే బూతులు కూడా తిట్టవచ్చు... మనం ఈ పితృస్వామ్య వ్యవస్థను బద్దలు కొట్టాలి" అని ఆయన అన్నారు.

హిందూస్థాన్ టైమ్స్ పత్రికలో లింగ సమానత్వ సమస్యలపై ఒక కాలమ్ నిర్వహిస్తున్న జర్నలిస్ట్ నమితా భండారే బీబీసీతో మాట్లాడుతూ..''ప్రజలు అనుకునేదానికి విరుద్ధంగా, భారత్‌లో చాలామంది మహిళలు బూతులు మాట్లాడతారు. ఇది కొత్తేమీ కాదు'' అని అన్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర భారత్‌లోని అనేక గ్రామాలలో పెళ్లికూతురి కుటుంబానికి చెందిన మహిళలు వరుడి బృందాన్ని స్వాగతిస్తూ.. రకరకాల బూతులు నిండిన పాటలు పాడటం ఒక ముఖ్యమైన వివాహ ఆచారం. ఈ సంప్రదాయాన్ని ఎవరూ అభ్యంతరకరంగా భావించరు.

అందువల్ల, జంతర్ మంతర్ వద్ద మాట్లాడిన దాన్ని కల్చర్ షాక్ అని అభివర్ణించడం, బూతులు మాట్లాడినందుకు మహిళలను నిలదీయడం ''ద్వంద్వ ప్రమాణాల (డబుల్ స్టాండర్డ్స్)కు నిదర్శనం" అని భండారే అన్నారు.

ఎందుకంటే, ప్రధానమంత్రితో సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు తమకు అవసరమున్నప్పుడు మహిళలపై దూషణలు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని ఆమె అన్నారు.

స్త్రీ ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాలని 2022లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ భారతీయులకు పిలుపునిచ్చారు. ఆయన ప్రభుత్వం మహిళల అభ్యున్నతిని లక్ష్యంగా అనేక పథకాలను నిర్వహిస్తోంది. మహిళా ఓటర్లలో మోదీకి అపారమైన ప్రజాదరణ ఉంది.

కానీ, చాలా సందర్భాల్లో మోదీ, ఆయన పార్టీ సభ్యులు మహిళల విషయంలో అగౌరవంగా ప్రవర్తించారని విమర్శలు ఎదుర్కొన్నారు. మహిళల వస్త్రధారణ గురించి మహిళా వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు పలువురు సీనియర్ పార్టీ నేతలు విమర్శలు పాలయ్యారు.

2004లో జరిగిన ఒక సభలో "జెర్సీ ఆవు" అని, 2012లో మరో కార్యక్రమంలో "50 కోట్ల ప్రియురాలు" వంటి పదాలను ఉపయోగించినందుకు మోదీ స్వయంగా విమర్శలను ఎదుర్కొన్నారు.

అయితే, ఈ విమర్శలు కేవలం బీజేపీకి మాత్రమే పరిమితం కాలేదు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారితో సహా చాలామంది ప్రతిపక్ష పార్టీ రాజకీయ నేతలు కూడా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొన్నారు.

రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు ఫిర్యాదులు చేయడానికి మహిళలను ఉపయోగించుకోవడం గురించి కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.

''మహిళల పట్ల చాలాదారుణంగా వ్యవహరిస్తారు. వారిని లక్ష్యంగా చేసుకోవడం చాలా సులభం. ఇక వారు బూతులు మాట్లాడితే మాత్రం, 'మన అమ్మాయిలు ఎలా బూతులు మాట్లాడతారు, తిడతారు?' అని అందరూ ప్రశ్నిస్తారు" అని భండారే అన్నారు.

యువత

ఫొటో సోర్స్, Congress Party

2014 నుంచి గలి బంధ్ అభియాన్ (బూతు వాడకాన్ని అరికట్టేందుకు ఉద్దేశించిన ఉద్యమం) అనే ఒక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోన్న సామాజిక కార్యకర్త సునిల్ జలాన్, ''బూతులపై మనం దృష్టిపెట్టాలి. వాటిని ఎవరు ఉపయోగించారనే దానిపై కాదు'' అని చెప్పారు.

గత ఏడాది ఆయన ఎన్‌జీవో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలపై 70 వేల మందికి పైగా పార్టిసిపెంట్లపై చేపట్టిన సర్వేలో, 55 శాతం మందికి పైగా తాము అసభ్య పదజాలాన్ని వాడుతున్నట్లు ఒప్పుకున్నారు.

తల్లులను, అక్కాచెల్లెళ్లను ఉద్దేశిస్తూ ఎంత తరచుగా మీరు బూతులు వింటుంటారు లేదా వాడుతుంటారు? అనే సూటి ప్రశ్నను ఈ సర్వేలో అడిగారు.

వారి ఎన్‌జీవో చేపట్టిన సర్వే ద్వారా 2025లో బూతు పదాలు ఎక్కువగా వాడిన మ్యాప్ ఉత్తర భారత్‌లో ఎక్కువ శాతంలో చూపించింది.

దిల్లీలో 80 శాతం, పంజాబ్‌లో 78 శాతం, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలలో 74 శాతంగా ఉంది. చాలా దక్షిణ రాష్ట్రాలలో ఇది 44 శాతం కంటే తక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో ఇది 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఉంది.

దేశంలో అసభ్యకరమైన భాషపై సంభాషణ జరగడం ఇదే మొదటిసారనీ, "దీని వల్ల మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం" అని జలాన్ చెప్పారు.

"ఇది చాలా తీవ్రమైన సమస్య. సమాజంలో వ్యాపించిన ఒక వైరస్ లాంటిది. కామెడీ, జోకులు, సినిమాలు బూతులు మాట్లాడటాన్ని సాధారణం చేశాయి. దీనిని అణచివేయాలి" అని ఆయన అన్నారు. అయితే భారత్‌లో చాలా మంది జెన్ జడ్ తరం వారు బూతులను ఆ కోణంలో చూడటం లేదు.

"అనాదిగా బూతులు, నిరసనలు ఒకదానితో ఒకటి కలిసి సాగుతున్నాయి. వాటిలో దిగ్భ్రాంతిని కలిగించే అంశం ఉంటుంది. అది నిరసనకు ప్రాథమికమైనది" అని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ గతంలో బీబీసీకి తెలిపారు.

"ఇది కొంతమందికి అసహ్యంగా అనిపించవచ్చు, మరికొందరికి అనిపించకపోవచ్చు. కానీ ఇది ఎంతమాత్రం నేరం కాదు" అని చెప్పారు.

అంతేకాకుండా, ఇటువంటి భాష కేవలం వీధి నిరసనలకే పరిమితం కాదు. టెలివిజన్ చర్చల నుంచి కోర్టు గదుల వరకు, చివరికి పార్లమెంటు వరకు కూడా.. బూతులు మాట్లాడుకోవడం, వ్యక్తిగత దాడులు చేసుకోవడం భారత బహిరంగ ప్రసంగాల్లో భాగమవుతున్నాయి.

ఈ వారం ప్రారంభంలో వైరల్ అయిన ఒక వీడియోలో భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ చానెల్‌లో ఒక ఫీమెల్ ప్రజెంటర్ ఒక ఆలయ పూజారిని అదుపు చేయడానికి ప్రయత్నించడం కనిపించింది.

ఆ పూజారి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని ఉద్దేశించి వరుసగా బూతులు తిట్టగా, సదరు ప్రతినిధి కూడా అదే భాషలో తిరిగి సమాధానమిచ్చారు.

బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి 2023లో ఒక ముస్లిం ఎంపీపై పార్లమెంట్‌లో ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు పాల్పడి, ఆయనను బెదిరించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

ఆ తర్వాత నిరసనలు పెరగడంతో.. ఆయన తన వ్యాఖ్యలపై తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

"బూతులు ఉపయోగించడం అనేది ప్రజాస్వామ్యం మరింత లోతుగా పతనమవుతున్నదానికి ఒక లక్షణం, ఇది చర్చల అంతాన్ని, గౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది" అని సామాజిక శాస్త్రవేత్త శివ్ విశ్వనాథన్ అన్నారు.

నిరసనకారులు బూతులు ఉపయోగించడం వెనుక కారణం ఏంటంటే, "గౌరవంపై బలహీనమైన భావన ఉన్నప్పుడు, బూతులు ఒక ప్రతిస్పందనగా మారుతాయి"

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)