80వ స్వాతంత్య్ర వేడుకలు: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని 5 కీలక అంశాలు

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ప్రధాన మంత్రిగా వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని మోదీ. అనంతరం, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

తన ప్రసంగానికి ముందు త్రివిధ దళాలతో పాటు దిల్లీ పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు.

ప్రధాని మోదీ జెండా ఎగురవేసే సమయంలో స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్‌తో 21- గన్ సెల్యూట్ కాల్పులు జరిపారు. అంతకుముందు, ప్రధాన మంత్రి రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, Doordarshan National

1.వందేమాతరం గురించి..

ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వందేమాతరం' గురించి ప్రస్తావించారు.

"ఇది ఒక చారిత్రక దినం. స్వాతంత్య్రం తర్వాత ఎర్రకోట ప్రాకారాల నుంచి 'వందేమాతరం' ప్రతిధ్వనించిన సమయం ఇది. ఈ రోజు మనమందరం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత ప్రజలు 'వందేమాతరం' 150 ఏళ్ల ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు.. ఇంతకంటే గొప్ప సందర్భం ఇంకేముంటుంది?" అని అన్నారు.

12 ఏళ్ల తన పదవీకాలంలో సాధించిన విజయాలను వివరించడంతో పాటు, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న తమ ప్రభుత్వ దార్శనికతను పంచుకున్నారు.

దేశ ప్రజల సంకల్పం, కృషి వల్ల అభివృద్ధి కొత్త ఊపు అందుకుందని ఆయన అన్నారు.

"గత 12 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. దేశ ప్రజల కృషి ఫలితంగా భారతదేశం ఒక పెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది" అని ప్రధాన మంత్రి అన్నారు.

తయారీ రంగం, వస్త్ర పరిశ్రమ, రక్షణ, రైల్వేలు, కనెక్టివిటీ, ఫార్మా, స్టార్టప్‌ల రంగాలలో భారతదేశం సాధించిన విజయాలను తన ప్రసంగంలో వివరించారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, Doordarshan National

2.'నక్సలిజం ఆలోచన' పెద్ద సవాల్

నక్సలిజం, మావోయిజం లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసి తల్లిదండ్రుల కలలను ఛిన్నాభిన్నం చేశాయని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో చెప్పారు.

తుపాకీ నీడలో నక్సలిజం 40 ఏళ్ల పాటు దేశంలోని అనేక ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేసిందని.. పోలీసు, భద్రతా సిబ్బందిలో 3,500 మందికి పైగా అమరులయ్యారని ప్రధాని చెప్పారు. యుద్ధంలో చనిపోయే సైనికుల కంటే ఎక్కువ సంఖ్యలో పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టారని మోదీ అన్నారు.

"ఈ నక్సలిజం భూమిని రక్తంతో తడిపింది. 2014లో, దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తి చేయాలని మనం సంకల్పించుకున్నాం. నేడు, నక్సల్, మావోయిస్టు హింస అంతిమ శ్వాస తీసుకుంటోంది. ఒకప్పుడు నక్సలైట్ తూటాలు మోగిన చోట, నేల రక్తంతో తడిసిన చోట, ఇప్పుడు ఆ నక్సలైట్ ప్రాంతాలలో అభివృద్ధి, విశ్వాసం, కృషి అనే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది" అన్నారు ప్రధాని.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

3.ఈ 12 ఏళ్లలో ప్రభుత్వ విజయాలు

ప్రధాన మంత్రిగా తన 12 ఏళ్ల పాలనలో విజయాలను ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగంలో ప్రస్తావించారు.

ప్రజల కృషితో తక్కువ సమయంలో 25 కోట్ల మంది దేశ ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.

"గత 12 సంవత్సరాలలో, రక్షణ రంగం నాలుగు రెట్లు, ఖాదీ పరిశ్రమలు ఐదు రెట్లు, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 33 రెట్లు పెరిగాయి. డిజిటల్ ఆవిష్కరణలలో కూడా మనం మనదైన ముద్ర వేశాం, డిజిటల్ లావాదేవీలు 100 రెట్లు పెరిగాయి. మంజూరైన పేటెంట్ల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది" అని మోదీ వివరించారు.

"పేదల కోసం మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతి సంవత్సరం నాలుగు రెట్లు వేగంతో ఇళ్లను నిర్మించాం. మెట్రోను విస్తరించాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా మారాలనే సంకల్పం అసంపూర్ణంగా మిగిలిపోకూడదు" అని నరేంద్రమోదీ అన్నారు.

"భారతదేశం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు, స్వయం సమృద్ధి సాధించాలి. ప్రపంచం ఎన్నో విషయాలను చౌకగా, వేగంగా అందిస్తుంది, కానీ అవి మన బలాన్ని పెంచవు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అందరూ కలిసి రావాలి" అని ప్రధాని మోదీ కోరారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

4.సంస్కరణల అమలు

మనం సంస్కరణల యాత్రను ప్రారంభించామని.. భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని మోదీ చెప్పారు.

"అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి, ఒక నూతన ప్రవాహం అవసరం. నేను ఏడు శక్తి ప్రవాహాలను ప్రస్తావిస్తున్నాను. ఉత్పత్తిని పెంచడం, చిన్న భాగాలను తయారు చేయడం ,పెద్ద యంత్రాలను నిర్మించడం ద్వారా తయారీ రంగాన్ని గణనీయంగా విస్తరించాల్సి ఉంటుంది. వస్తువుల రూపకల్పన నుంచి తయారీ వరకు, ప్రతిదానిలో భారత్ ప్రపంచ విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది."

"నాణ్యమైన ఉత్పత్తులే మన ఐడెంటిటీ కావాలి. ప్రపంచ మార్కెట్లో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనేదే మన మంత్రం అని నేను ప్రతి తయారీదారుడికి చెప్పాలనుకుంటున్నాను. మనం ఆహార శుద్ధిలో పురోగతి సాధించాలి. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు తెరుచుకున్నాయి కాబట్టి, మనం వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు అనుసంధానించాలి" అని కోరారు.

స్వాతంత్య్ర దినోత్సవం, స్వాతంత్య్ర వేడుకలు, నరేంద్ర మోదీ, దిల్లీ, ఎర్రకోట

ఫొటో సోర్స్, ANI

5.యువత, మహిళలు..

యువత లక్ష్యంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి కొన్ని కార్యక్రమాలను ప్రకటించారు.

కోటి మంది యువతకు కృత్రిమ మేథలో శిక్షణ అందిస్తామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఉచితంగా ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపారు.

"భారతదేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది, దాని వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది కూడా యువతే. భారతదేశ అభివృద్ధి లక్ష్యం యువతతో మమేకమవ్వడమే. 250,000కు పైగా నమోదిత స్టార్టప్‌లు ఉన్నాయి. దీని కోసం లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు, ఇది యువత కలలకు రెక్కలు తొడుగుతుంది" అని చెబుతూ యువత అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలని ప్రధాని సూచించారు.

నారీ శక్తి వందన్ చట్టాన్ని ప్రస్తావిస్తూ.. మహిళల గౌరవార్థం ముందుకొచ్చి, చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంలో తోడ్పడాలని ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకం కింద అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని నరేంద్ర మోదీ అన్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్, డా.భీంరావ్ అంబేడ్కర్, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, భగవాన్ బిర్సా ముండా, జ్యోతిబా ఫూలే వంటి వారు కన్న కలలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరుతూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)