చమురు సంస్థలు లాభాలు ప్రకటిస్తున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

భారత్‌లో గడచిన నెలలో పది రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ రేట్లు 4 సార్లు పెరిగాయి.

ఇది మే 15న మొదలైంది. ఈ రెండింటి మీద తొలిసారి సుమారు 3 రూపాయలు పెంచారు.

ఆ తర్వాత మే 19న లీటరుకు 87 నుంచి 91 పైసలు పెరిగింది. మూడోసారి మే 23న లీటరుకు మళ్లీ సుమారు 87 నుంచి 91 పైసల వరకు పెంచారు.

మే 25న నాలుగోసారి ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2.61, డీజిల్ ధరను లీటరుకు రూ. 2.71 పెంచారు.

అంటే మే 15 నుంచి మే 25 మధ్య పది రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు 7నుంచి 7.50 రూపాయలు పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం వల్లే ఇంధన ధరలు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో భారత్ ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడుతోంది.

ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు చాలా కాలంగా ఇంధనాన్ని, ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు అమ్మడం వల్ల భారీగా నష్టాల్లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఆ నష్టాన్ని తగ్గించడానికి ఇంధన ధరల పెంపు అవసరమని తెలిపింది.

పెట్రోలు ధరల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ధరలను పెంచలేదని, ఎక్సైజ్ సుంకాన్ని కూడా తగ్గించామని, అలా కాకుండా అంతర్జాతీయ ధరల ప్రకారం దేశంలో పెట్రోల్ ధరల్ని పెంచి ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా ఉండేవని ప్రభుత్వం అంటోంది.

ప్రతిపక్షం విమర్శలు

ఇంధన ధరల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. మే15న తొలిసారి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

"మోదీ ప్రభుత్వం చేతకానితనానికి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. ఇప్పుడే 3 రూపాయల షాకిచ్చారు. మిగిలింది వాయిదాల్లో వసూలు చేస్తారు" అని అందులో రాశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మందగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు.

"కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ముడి చమురు ధర తక్కువగా ఉండటం లేదా పడిపోవడం జరిగింది. దీని వల్ల వచ్చే ప్రయోజనాన్ని ప్రజలకు అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి. కానీ ఇది జరగలేదు. ప్రజలను దోచుకున్నారు" అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన మెసేజ్‌లో రాశారు.

పెట్రోలియం కంపెనీలకు నష్టాలు వచ్చాయా?

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి ముందు, ప్రజలపై భారం మోపకుండా ఉన్నందుకు ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థలు రోజుకు రూ. 1000 కోట్లు నష్టపోయాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి అన్నారు.

అయితే మూడు ప్రధాన పెట్రోలియం కంపెనీలు.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం జనవరి నుంచి మార్చ్ 2026 త్రైమాసికానికి తమ ఫలితాలు ప్రకటించాయి.

తమ కంపెనీలన్నీ బాగా రాణించి లాభాలు ఆర్జించాయని అందులో ప్రకటించాయి.

సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మూడు కంపెనీలు కలిపి 19వేల కోట్ల రూపాయలకు పైగా లాభం ఆర్జించాయి.

పెట్రోలియం కంపెనీలు నష్టాల్లో ఉన్నాయన్న వాదనను దిల్లీలోని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనీషియేటివ్ డైరెక్టర్ అజయ్ శ్రీవాస్తవ ప్రశ్నిస్తున్నారు.

"కంపెనీలన్నీ తాము లాభాల్లో ఉన్నట్లు చూపించాయి. మరోవైపు ప్రభుత్వం ధరలు పెంచకపోవడం వల్ల ఈ కంపెనీలు రోజూ కోట్ల రూపాయలు నష్టపోయాయని వార్తలు వస్తున్నాయి. ఏంటిదంతా?" అని ఆయన ప్రశ్నించారు.

"వ్యవస్థలో పారదర్శకత ఉండాలి. అప్పుడే పెట్రోలియం కంపెనీలకు ఎంత శాతం డబ్బు వస్తోంది? ప్రభుత్వానికి పన్నుల్లో ఎంత వస్తోంది? అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ వివరాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచితే అంతా పారదర్శకంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

"2020-21లో ముడి చమురు ధర 25-30 డాలర్లు ఉంది. అప్పుడు కూడా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతే ఉన్నాయి. అంటే పెట్రోలియం సంస్థలకు భారీ లాభాలు వచ్చాయి. ఆ లాభాన్ని ఒక నిధిలో జమ చేయాల్సింది. లేకపోతే పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించి ఉండాల్సింది. కానీ ప్రభుత్వం అలా చేయలేదు" అని శ్రీ వాస్తవ చెప్పారు.

"అప్పట్లో వచ్చిన లాభాలను ఒక నిధిలా పక్కన పెట్టి ఉంటే, ధరలు పెరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు. ప్రజలపై భారం పడకుండా ఆ నిధిని వాడుకునే అవకాశం ఉండేది" అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

ఇంధన ధరల విషయంలో పారదర్శకత లోపించిందనీ, పారదర్శకత తీసుకువస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ ఆయన చెప్పారు.

పెట్రోలియం కంపెనీలు మార్చ్ వరకు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రాబోయే త్రైమాసికాల్లో ఈ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చని భావిస్తున్నారు.

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు నిల్వ చేసి ఉండాల్సిందా?

2022 ‌యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన తర్వాత ముడి చమురు దిగుమతుల విషయంలో భారత్ విధానం నాటకీయ మలుపు తిరిగింది.

పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో భారత్‌కు చౌక ధరకు ముడి చమురు లభించింది.

భారత్ దీనిని సద్వినియోగం చేసుకుని రష్యా నుంచి దిగుమతులను వేగంగా పెంచింది.

దీంతో భారత్‌కు రష్యా ప్రధాన ముడి చమురు సరఫరాదారుగా మారింది.

2022-23లో రష్యా నుంచి వచ్చే ముడి చమురు వాటా 2 శాతం నుంచి 19 శాతానికి పెరిగింది. 2023-24లో ఇది దాదాపు 40 శాతానికి చేరుకుంది.

ముడి చమురు చౌకగా రావడంతో భారత దిగుమతుల బిల్లు తగ్గింది. రష్యా నుంచి భారత్ కొన్న ముడిచమురును శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతోందా అనే ప్రశ్నలు తలెత్తాయి.

మధ్యప్రాచ్యంలో యుద్ధం మొదలైన తర్వాత ఎగుమతులను ఆపేసి, ఆ ముడి చమురును దేశీయ అవసరాల కోసం నిల్వ ఉంచుకోవాలా? అనే మరో ప్రశ్న కూడా వచ్చింది.

"ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత చైనా, సింగపూర్‌తో పాటు మరికొన్ని దేశాలు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతిని ఆపేశాయి. తమ దేశంలో పెట్రోల్ కొరత రాకుండా వాళ్లు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. భారత్ కూడా అలాగే చేసి ఉండాల్సింది" అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

"ప్రస్తుత డేటా ప్రకారం చూస్తే చైనా వద్ద 6 నెలలకు సరిపడా నిల్వలున్నాయి. భారత్ వద్ద పెట్రోలియం నిల్వలు కొన్ని రోజులు మాత్రమే వస్తాయి. ఇరాన్‌లో యుద్ధం మొదలవగానే భారత్ ఎగుమతుల్ని నిషేధించి ఉండాల్సింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనా దగ్గర భారీగా ముడి చమురు నిల్వలు ఉండేవనీ, అయినప్పటికీ వారు ఎగుమతుల్ని ఆపేశారనీ, భారత్ అలా చేయకుండా ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ఎగుమతి చేస్తోందని శ్రీవాస్తవ అన్నారు.

"జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎగుమతుల్ని అపేలా ప్రభుత్వం ప్రయత్నించి ఉండాల్సింది. అయితే తమకు ఎగుమతి ఒప్పందాలు ఉన్నాయని సంస్థలు చెబుతున్నాయి. ఒప్పందాల్ని ఉల్లంఘిస్తే వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.

‘‘ఇది నిజమే అయినా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎగుమతుల్ని ఆపి వేసి ఉండాల్సింది’’ అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

అయితే చమురు నిల్వ కేంద్రాల గురించి ప్రశ్నిస్తున్నారు ఐసీఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ఠ. ఐసీఆర్‌లో భారత్‌లో ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.

"రష్యా నుంచి కొన్న ముడి చమురును నిల్వ చేసుకోవాలనే వాదన సరైందని నేననుకోవడం లేదు. మనకు మరింత నిల్వ అవసరమై ఉండచ్చు. ఆ సమయంలో చమురు చౌకగా దొరికిందని భారత్ ఎగుమతి చేయలేదు. భారత్‌కున్న సామర్థ్యం మేరకు నిల్వ చేసుకుంది" అని వశిష్ఠ చెప్పారు.

"ఇరాన్ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో పరిస్థితి మరింత దిగజారింది. ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన ధరలు 50శాతం పెరిగాయి. భారత్‌లోనూ దశల వారీగా పెరుగుతున్నాయి. ఇలా చేయక తప్పదు" అని ఆయన అన్నారు.

చైనా సంసిద్ధత బావుందా?

ఈ పరిస్థితుల మధ్య ఇరాన్‌లో యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడానికి చైనా ఏం చేసిందనే సందేహం వస్తుంది.

రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడంపై ఆమెరికా ఆంక్షలు విధించిందనీ, దీంతో రష్యా నుంచి చైనా భారీగా ముడి చమురు దిగుమతి చేసుకునే దేశంగా మారిందని శ్రీవాస్తవ చెప్పారు.

"అమెరికాకు చైనాను ఆపే ధైర్యం లేదు. కనీసం బెదిరించే సాహసం కూడా చేయలేదు. రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతుల్ని ఆపేయడంతో మిగిలిపోయిన ముడి చమురును చైనా కొనేసింది. దీంతో చైనాకు మరింత చౌకగా ముడి చమురు లభించింది" అని ఆయన వివరించారు.

స్వతంత్ర సార్వభౌమ దేశంగా చైనా తన పాలసీని నిర్ణయించుకుందని శ్రీవాస్తవ అంటున్నారు.

ఒక దేశంతో 10 నుంచి 20 ఏళ్ల పాటు ఉండే దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటే ముడి చమురు చౌకగా లభిస్తుందని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

"ఇరాన్ యుద్ధానికి ముందు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవడం వల్ల భారత్ పొందిన ప్రయోజనాలనే చైనా చాలా కాలంగా పొందుతోంది. చైనా సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తూ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. దీనివల్ల భారత్ కొద్దిగా ఒత్తిడికి గురై ఉండవచ్చు" అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.

భారతదేశ ఇంధన భద్రత 80 శాతం సంక్షోభంలో ఉందనీ, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను తట్టుకుని ఈ సంక్షోభాన్ని అధిగమించడంపై భారత్ దృష్టి పెట్టాలనీ శ్రీవాస్తవ అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు చైనా మెరుగ్గా సిద్ధమైందని ప్రశాంత్ వశిష్ఠ అన్నారు.

"కొన్నేళ్లుగా చైనా పునరుత్పాదక ఇంధనంపై దృష్టి పెట్టింది. వందల గిగావాట్ల ప్రాజెక్టులను నిర్మించింది. విద్యుదీకరణలో కూడా చాలా కృషి చేసింది. దేశీయంగా ముడి చమురు నిల్వలను, చమురు ఉత్పత్తిని పెంచింది" అని వశిష్ఠ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఎలా ముందుకు సాగాలన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న.

భారత్ తన ఇంధన వనరులను వైవిధ్యపరచడం అనే అంశాన్ని మరింత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ వశిష్ఠ అభిప్రాయపడ్డారు.

"ఇథనాల్‌ను 100 శాతం ఇంధనంగా మార్చే ప్రక్రియ భారత్‌లో జరుగుతోంది. ఇది దీర్ఘకాలిక అంశం. దీనికి చాలా ఏళ్లు పట్టచ్చు. మనం పెట్రోల్, డీజిల్‌లను అకస్మాత్తుగా వాడటం మానేయలేము. గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది" అని వశిష్ఠ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)