You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పెల్లెట్ గన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు.. రాహుల్ గాంధీ ఏమన్నారు?
సాహిల్ లోచబ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పెల్లెట్ గన్ కాల్పుల ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
జంతర్ మంతర్ దగ్గర నిరసనలో జులై 20న సాహిల్ గాయపడ్డారు.
‘‘న్యాయం దిశగా ఇది తొలి అడుగు. కేసు నమోదైంది. మేం ఉదయం 11.30గంటలకు వచ్చాం. 6గంటల45నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదయింది. దిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక్కడ కూడా అమిత్ షా తుది అనుమతి ఇవ్వాల్సి వచ్చింది’’అని ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం రాహుల్ గాంధీ అన్నారు.
‘‘రాహుల్ గాంధీ, ఆయన బృందం నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. నిన్న, మొన్న నేను వాళ్లతో మాట్లాడినప్పుడు నా ఎఫ్ఐఆర్ నమోదు కావడం లేదని చెప్పాను. అప్పుడు వాళ్లు మనం కలుద్దామని, తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు వెళ్తామని చెప్పారు. నాకు సహాయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది న్యాయానికి లభించిన విజయం. ఈ ఎఫ్ఐఆర్ దాని దిశగా వేసిన మొదటి అడుగు’’అని సాహిల్ లోచబ్ అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ దిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్(సంసద్ మార్గ్) పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేశారు. సాహిల్ లోచబ్ ఇచ్చిన పోలీసు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై ఆయన పోలీసు అధికారులతో మాట్లాడారు.
‘దిల్లీలోనే పరిస్థితి ఇలా ఉంటే...’
"నెల రోజులు గడిచాయి. శరీరంలో పెల్లెట్ల ముక్కలున్నాయి. మూడు ముక్కలు కంట్లో ఉన్నాయి. ఆ కన్ను కనిపించడం లేదు. మూడు నాలుగు ముక్కలు గుండె దగ్గర ఉన్నాయి. ఒక యువకుడికి అన్యాయం జరిగిందని స్పష్టంగా కనిపిస్తోంది"
''ఈ ఉదయం 11:30 గంటలకు ఇక్కడికి వచ్చాను. 6గంటల45నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఎంత మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎంత మంది పిల్లలు చంపబడుతున్నారో, ఎంత మంది కాల్పులకు గురవుతున్నారో, ఎంత మంది శరీరాల్లో తూటాల ముక్కలు ఉన్నాయో ఊహించండి. ఈ పోలీస్ స్టేషన్ దిల్లీ నడిబొడ్డున ఉంది. ఇక్కడే న్యాయం దొరకడం లేదు. మరి గ్రామాల్లో, చిన్న పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లలో ఏం జరుగుతుందో ఊహించండి.
మేము ఇక్కడ ఏ తప్పూ చేయలేదు. మేము ఒక భారత పౌరుడికి, ఆయన తల్లికి న్యాయం చేయాలని కోరాం. దానికే ఎనిమిది గంటల సమయం పట్టింది'' అని రాహుల్ గాంధీ అన్నారు.
‘రాహుల్ గాంధీ దాదాపు ఏడున్నరగంటలపాటు ధర్నా చేయడంతో అమిత్ షా, దిల్లీ పోలీసులు చివరకు వెనక్కి తగ్గి ఎఫ్ఐఆర్ నమోదుచేయాల్సి వచ్చింది. సరిగ్గానేచెప్పారు..ప్రపంచం తలవంచుతుంది...దాన్ని తలవంచేలా చేయడానికి ఎవరో ఒకరు కావాలి'' అని కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఎఫ్ఐఆర్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
ఏయే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదయింది?
పెల్లెట్ గన్ గాయాల కేసులో దిల్లీ పోలీసులు భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్లు 118, 125 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు కాంగ్రెస్ పోస్ట్ చేసిన ఎఫ్ఐఆర్‌లో ఉంది.
సెక్షన్ 118 ప్రమాదకరమైన ఆయుధాలు లేదా సాధనాలతో ఉద్దేశపూర్వకంగా గాయం లేదా తీవ్రమైన గాయం కలిగించడానికి సంబంధించినది. సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ప్రమాదం కలిగించే చర్యలకు సంబంధించినది.
ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన తర్వాత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
‘వందేమాతరంపై వైఖరితో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడినట్టుంది’
అంతకుముందు రాహుల్ గాంధీ అరాచక రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన బీజేపీ ఆయన చట్టాన్ని గౌరవించరా అని ప్రశ్నించింది.
"ఈ ఘటనలో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు స్వయంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తున్నారు" అని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
రాహుల్ గాంధీ చర్యలను వందేమాతరం వివాదంతో ముడిపెట్టారు రవిశంకర్ ప్రసాద్.
"వందేమాతరంపై తీసుకున్న వైఖరితో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడినట్టు అనుమానంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
"ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ముందస్తు నోటీసు లేకుండా సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ బయట ఆయన ధర్నాకు కూర్చున్నారు. రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న ఘటనపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఆయనతో చెప్పారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. రాహుల్ ఏ చట్టాన్నీ గౌరవించాలనుకోవడం లేదా'' అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
''జాతీయ గీతం వందేమాతరంపై తీసుకున్న వైఖరి కారణంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ చర్యలను మేం ఖండిస్తున్నాం'' అని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.
‘అమిత్ షా ఆదేశాలతోనే పెల్లెట్‌గన్‌లతో కాల్చారు’
రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపించింది.
"అమిత్ షా దేశంలోని పిల్లలపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపమని ఆదేశించారు. సాహిల్ లోచబ్‌కు ఒక పెల్లెట్ తగిలి కంటికి తీవ్ర గాయమైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సాహిల్, ఆయన తల్లి పలుమార్లు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే సాహిల్,ఆయన తల్లితో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోలీసు అధికారులను కలిసి దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కోరారు" అని కాంగ్రెస్ 'ఎక్స్'లో రాసింది.
సాహిల్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వీలుగా దర్యాప్తు నంబరు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపించింది.
ఆందోళనల సమయంలో పెల్లెట్ గన్‌ల వాడకంపై టీఎంసీ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ఆర్‌టీఐ ద్వారా సమాచారం సేకరించారు.
పెల్లెట్ గన్‌ల వల్ల కనీసం ఐదుగురు గాయపడినట్టు ఆర్‌టీఐ ద్వారా తెలిసిందని గోఖలే చెప్పారు.
"ఆస్పత్రుల రికార్డుల ప్రకారం అసలు కేసుల సంఖ్య దానికి రెట్టింపు అని, మొత్తం పదిమంది గాయపడ్డారని తెలుస్తోంది'' అని ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
గోఖలే సేకరించిన సమాచారం ప్రకారం పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడ్డ తొమ్మిది మందిని లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో, ఒకరిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. దిల్లీలోని ఎయిమ్స్, ఆర్ఎంఎల్ ఆస్పత్రుల నుంచి మరిన్ని రికార్డుల సమాచారం తెలుసుకునేందుకు గోఖలే ప్రయత్నిస్తున్నారు.
"పోలీసులు పెల్లెట్ గన్‌లను వాడడం, దాని గురించి అబద్ధాలు చెప్పడం, గాయపడ్డ వారి సంఖ్యను వెల్లడించడానికి నిరాకరించడం జరుగుతున్న ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?" అని 'ఎక్స్'లో గోఖలే ప్రశ్నించారు.
''దేశ రాజధాని నడిబొడ్డున శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై పెల్లెట్ గన్‌లను ఉపయోగించారు. అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు ఇప్పటికీ పూర్తి వివరాలను బయటపెట్టడం లేదు. పెల్లెట్ గన్‌ల వల్ల గాయపడ్డ వారి సంఖ్యను మోదీ ప్రభుత్వం ఇంకా ఎందుకు వెల్లడించడం లేదు?" అని గోఖలే అన్నారు.
రాహుల్ గాంధీ ఏమంటున్నారు?
జూలై 20న జంతర్ మంతర్ దగ్గర పెల్లెట్ గన్‌లను ఉపయోగించారని సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన చేస్తూ రాహుల్ గాంధీ అన్నారు.
ఒక పెట్టెలో ఉంచిన పెల్లెట్లను చూపించిన రాహుల్ గాంధీ.. అవి సాహిల్ శరీరం నుంచి తొలగించినవంటూ ఆరోపించారు.
"సాహిల్ శరీరంలో 200 పెల్లెట్లు ఉన్నాయి. అందులో మూడు మూడు పెల్లెట్లు కంట్లో ఉన్నాయి" అని రాహుల్ గాంధీ చెప్పారు.
దిల్లీ ఎయిమ్స్, లేడీ హార్డింగ్ ఆసుపత్రి వైద్య నివేదికలను కూడా చూపించారు.
"సాహిల్ శరీరంలో 200కు పైగా పెల్లెట్లు ఉన్నాయని వాటిలో మూడు ఆయన కంట్లో ఉన్నాయని ఈ నివేదికల్లో స్పష్టంగా ఉంది. ఆయన ఆ కంటితో ఇక చూడలేరు. ఆయన గుండెకు చాలా దగ్గరగా కూడా పెల్లెట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. వాటిని తొలగించడం సాధ్యం కాదు" అని రాహుల్ గాంధీ చెప్పారు.
''మేం పెల్లెట్లు కాల్చలేదని దిల్లీ పోలీసులు చెబుతున్నారుగానీ మీరు కాల్చకపోతే మరి ఎవరో ఒకరు వాటిని కాల్చి ఉండాలి. బహుశా మరెవరైనా సాహిల్‌పై ఈ పెల్లెట్లను కాల్చి ఉండవచ్చు. ఒకవేళ ఎవరూ కాల్చి ఉండకపోతే బహుశా ఆయన తనపై తానే ఈ పెల్లెట్లను కాల్చుకుని ఉండొచ్చు'' అని రాహుల్ గాంధీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
''మాకు కావలసింది ఒక్కటే. ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకు మేం ఇక్కడి నుండి కదలం'' అని ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)