తమ మిగిలిన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తెలిపింది.
మూడో విడత చర్చల అనంతరం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో కలిసి సీజేపీ అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశంలో మాట్లాడారు.
"ప్రభుత్వం మన డిమాండ్లు అన్నింటినీ అంగీకరించింది. దీక్ష ముగిసింది, నిరసనకారులు క్షేమంగా ఇళ్లకు వెళ్లాలి" అని వారు విజ్ఞప్తి చేశారు.
"ప్రభుత్వం ఇతర డిమాండ్లను కూడా అంగీకరించింది" అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియా సమావేశంలో తెలిపారు.
"కేవలం దిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిరసనల్లో పాల్గొన్నందుకు భవిష్యత్తులో ఏ సీజేపీ కార్యకర్తపైనా చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది" అని ఆయన అన్నారు.
బాధిత కుటుంబాలకు కోటి పరిహారంపై కూడా అంగీకారం కుదిరిందని, చట్టప్రకారం పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని అశుతోష్ రాంకా తెలిపారు.
మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం సానుభూతితో పరిశీలించిందని, అంగీకరించిందని అన్నారు.
"ఈ రోజు మేం సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ప్రస్తుతం నమోదైన కేసులకు సంబంధించి నాలుగు అంశాలతో కూడిన ఒక లిఖితపూర్వక ముసాయిదాను వారు తీసుకువచ్చారు. వాటితో పాటు, మిగిలిన రెండు డిమాండ్లపై కూడా మేం చర్చించాం. ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోకూడదు, పరిహారం అందించాలి, అలాగే వారి ఐదు అంశాల చార్టర్‌ను పరిగణించడం.
మేమే వారికి ఎఫ్‌ఐఆర్‌ల కాపీలను అందిస్తాం, ఎలాంటి చర్యలు తీసుకోబోం. రెండో విషయానికి వస్తే.. పరిహారంపై ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మాకు కూడా సానుభూతి ఉంది. నిబంధనల ప్రకారం పరిహారం ఉంటుందని, సాధ్యమైనంత గరిష్టంగా వారికి అందిస్తామని మేం చెప్పాం" అని పేర్కొన్నారు.