షావుకారు జానకి మృతి

ఫొటో సోర్స్, SOWKAR JANAKI
సీనియర్ నటి షావుకారు జానకి శుక్రవారం (ఆగస్టు 21, 2026) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆమె చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి.
తెలుగులో నటించిన 'షావుకారు' సినిమా తరువాత ఆమె పేరు ముందు 'షావుకారు' అనే పదం స్థిరపడిపోయింది.
షావుకారు జానకి తన 70 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 450కి పైగా చిత్రాల్లో నటించారు. సినీ, టీవీ, వాయిస్, రేడియో, రంగస్థల కళాకారిణిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
చలనచిత్ర రంగంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా 2022లో భారత ప్రభుత్వం ఆమెను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది.
తన నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం అందించే 'కళైమామణి' సహా పలు అవార్డులు అందుకున్నారు ఆమె.


ఫొటో సోర్స్, AVM Pictures
1931 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో జన్మించిన షావుకారు జానకి, ప్రముఖ నటి కృష్ణకుమారికి సోదరి.
బాల్యంలోనే నాటక రంగంలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె, 11 ఏళ్ల వయసులో ఓ తెలుగు రేడియో కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
అనంతరం1949లో విడుదలైన 'రక్షా రేఖ' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.
ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె భాగమయ్యారు.
జానకి తన సుదీర్ఘ కెరీర్‌లో 'కన్యా శుల్కం', 'డాక్టర్ చక్రవర్తి', 'రోజులు మారాయి', 'తోడికోడళ్లు','సంసారం ఒక చదరంగం','గీతాంజలి', 'జయం మనదే', 'బాబు బంగారం' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు.
జానకి మృతిపై సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తీరని లోటు: తమిళనాడు సీఎం విజయ్
షావుకారు జానకి మరణం తీరని లోటని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు.
విజయ్ విడుదల చేసిన సంతాప సందేశంలో.. "విలక్షణ నటనతో ఎన్నో తరాల ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న షావుకారు జానకి అనారోగ్యంతో కన్నుమూశారన్న వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను" అని పేర్కొన్నారు.
"చిత్ర పరిశ్రమలో 70 ఏళ్లకు పైగా ప్రయాణించి, ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆమె కళాసేవ ఎప్పటికీ ప్రశంసనీయం. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ లాంటి వివిధ భాషా చిత్రాల్లో నటించి సత్తా చాటడంతో పాటు పద్మశ్రీ అవార్డు, కళైమామణి అవార్డు, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు పొందిన శ్రీమతి షావుకారు జానకి మరణం చిత్రసీమకు తీరని లోటు" అని ఆయన పేర్కొన్నారు.
షావుకారు జానకి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ప్రముఖ నటుడు చిరంజీవి 'ఎక్స్' వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో .. "ప్రముఖ నటి షావుకారు జానకి ఆకస్మిక మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. 400కు పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన షావుకారు జానకి భౌతికంగా మనకు దూరం అయినా ఆమె నటించిన పాత్రల ద్వారా చిరస్థాయిగా మన మనసుల్లో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు.
నటుడు చిరంజీవి తన ఎక్స్ పోస్టులో .."ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. 'షావుకారు' చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాలపాటు కొనసాగింది. వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం" అని తెలిపారు.
షావుకారు జానకి మరణించారని తెలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలు మేటి చిత్రాల్లో షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన కొనియాడారు. చలనచిత్ర రంగంలో ఆమె లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































