You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19: ఆస్ట్రాజెనెకా వాక్సీన్ పంపిణీ నిలిపివేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ - Newsreel
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు తమ ప్రజలకు ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సీన్ పంపిణీని నిలిపివేశాయి. యూరప్‌లో ఈ వాక్సీన్ తీసుకున్న వారిలో కొందరికి రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడిన ఉదంతాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నెదర్లాండ్స్, ఐర్లండ్ సహా పలు ఇతర యూరప్ దేశాలు సైతం ముందు జాగ్రత్త చర్యగా ఆస్ట్రాజెనెకా వాక్సీన్ వినియోగాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
అయితే.. ఈ వాక్సీన్‌కు, రక్తంలో గడ్డలు ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందనే దాఖలాలు ఏవీ లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఈ వాక్సీన్‌కు సంబంధించి నివేదికలను తాము సమీక్షిస్తున్నామని చెప్పింది. అయితే కరోనా మహమ్మారిని నియంత్రించటానికి టీకాలు ఇవ్వటాన్ని కొనసాగించటం ముఖ్యమని సూచించింది.
జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఏం చెప్పాయి?
ఆస్ట్రాజెనెకా వాక్సీన్ ఇవ్వటాన్ని తక్షణం నిలిపివేస్తున్నామని జర్మనీ ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో వాక్సీన్లకు సంబంధించిన అధికారిక సంస్థ పాల్ ఎర్లిఖ్ ఇన్‌స్టిట్యూట్ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
ఆ తర్వాత కొంత సేపటికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా.. ఫ్రాన్స్‌లోనూ ఈ వాక్సీన్ వినియోగం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) తదుపరి సూచనలు ఇచ్చే వరకూ ఈ నిలిపివేత కొనసాగుతుందన్నారు.
ఇటలీ కూడా దేశవ్యాప్తంగా ఈ వాక్సీన్ పంపిణీ మీద నిషేధాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈఎంఏ నిర్ణయం వచ్చే వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
అంతకుముందు.. కోవిడ్-19 సోకకుండా నిరోధించటానికి ఉద్దేశించిన ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వాక్సీన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చనే ఆందోళనల నేపథ్యంలో ఆ వాక్సీన్ వినియోగాన్ని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ వాక్సీన్ వినియోగాన్ని మార్చి 29వ తేదీ వరకూ నిలిపివేశామని డచ్ ప్రభుత్వం చెప్తోంది.
రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్ కూడా ఇంతకుముందే ఆస్ట్రాజెనెకా వాక్సీన్ వినియోగాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికిముందు డెన్మార్క్, నార్వే, బల్గేరియా, ఐస్‌లాండ్, థాయిలాండ్‌లు ఆస్ట్రాజెనెకా వినియోగాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేశాయి.
ఆస్ట్రాజెనెకా ఏం చెప్తోంది?
అయితే.. ఆస్ట్రాజెనెకా వాక్సీన్ తీసుకున్న వారిలో రక్త నాళాల్లో గడ్డలు (బ్లడ్ క్లాట్స్) కట్టినట్లు నమోదైన కేసుల సంఖ్య.. సాధారణ ప్రజానీకంలో నమోదయ్యే అవే కేసుల సంఖ్య కన్నా ఎక్కువేమీ లేవని నిపుణులు చెప్తున్నారు.
యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లలో గత వారాంతం వరకూ సుమారు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకున్నారని.. వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 40 కన్నా తక్కువగానే నమోదయ్యాయని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలిపింది.
ఈయూ, బ్రిటన్ వ్యాప్తంగా ఈ వాక్సీన్ తీసుకున్న వారిలో డీప్-వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) - రక్త నాళంలో గడ్డలు ఏర్పడం - కేసులు 15 నమోదయ్యాయని; పల్మనరీ ఎంబోలిజం - రక్తపు గడ్డ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించటం - కేసులు 22 నమోదయ్యాయని వివరించింది.
రక్తంలో గడ్డలు ఏర్పడుతున్న సంఘటనలను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ప్రస్తుతం సమీక్షిస్తోంది. అదే సమయంలో.. ఈ వాక్సిన్ వల్ల ఉండే ముప్పుల కన్నా దానివల్ల లభించే ప్రయోజనాలకు ఎక్కువ విలువ ఉందని ఆ సంస్థ చెప్తోంది.
ఈ వాక్సీన్ వల్ల రక్తంలో గడ్డలు తయారవుతున్నాయని ఆధారాలు సూచించటం లేదని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ పేర్కొంది. దేశ ప్రజలు ఈ వాక్సీన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
అయితే... ''వాక్సీన్ గురించి ఎలాంటి సందేహాలకూ మేం తావివ్వలేం. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి దీని వినియోగం ఆపటం మంచిది'' అని డచ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19: ఆస్ట్రాజెనెకా వాక్సీన్ పంపిణీ నిలిపివేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ
ఆయుధాల ఎగుమతిలో అగ్ర స్థానంలో అమెరికా.. ఎక్కువగా కొంటున్న దేశం ఏదంటే...
ప్రపంచ వ్యాప్తంగా అమెరికా చేస్తున్న ఆయుధాల ఎగుమతులు గత ఐదేళ్ళలో 37 శాతం పెరిగినట్లు స్వీడన్‌కి చెందిన ఒక పరిశోధనా సంస్థ తెలిపింది.
అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి ఆయుధాల ఎగుమతులు పెరగటంతో.. రష్యా, చైనాల ఆయుధ ఎగుమతుల వాటా తగ్గిపోయింది.
కోల్డ్ వార్ ముగిసినప్పటి నుంచి ఆయా దేశాల ఎగుమతులు దిగుమతుల వాటాలలో పెద్దగా తేడాలు లేవు. కానీ, మహమ్మారి ప్రభావంతో ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. ఈ ఆయుధాల దిగుమతులు మిడిల్ ఈస్ట్ (పశ్చిమాసియా) దేశాలలో పెరిగినట్లు కనిపిస్తోంది.
"గత రెండు దశాబ్దాల్లో విరివిగా పెరిగిన ఆయుధాల బదిలీ కార్యక్రమం ముగిసినట్లే అని అప్పుడే చెప్పలేం" అని ఈ డేటాని సేకరించిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో సీనియర్ రీసెర్చర్ పీటర్ వీజ్మాన్ అన్నారు.
"కోవిడ్ 19 చాలా దేశాలపై మోపిన ఆర్ధిక ప్రభావం వలన చాలా దేశాలు రానున్న సంవత్సరాలలో తాము చేపట్టవలసిన ఆయుధాల దిగుమతులను పునఃపరిశీలిస్తున్నాయి. కానీ, గత సంవత్సరం మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా చాలా దేశాలు భారీ ఆయుధాల కోసం పెద్ద పెద్ద ఒప్పందాల పై సంతకాలు చేసుకున్నాయి" అని ఆయన చెప్పారు.
2016కి ముందు ఐదేళ్లతో పోలిస్తే 2016-2020 మధ్యలో అంతర్జాతీయంగా ఆయుధాల అమ్మకాలు నిలకడగా ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంది.
అమెరికా చేస్తున్న ఎగుమతుల్లో సగం (47 శాతం) మిడిల్ ఈస్ట్ దేశాలకే వెళ్లాయి. అందులో 24 శాతం ఆయుధ ఉత్పత్తులు ఒక్క సౌదీ అరేబియాకే ఎగుమతి అయ్యాయి.
అమెరికా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 96 దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీంతో గత ఐదేళ్ళలో ఆయుధాల అమ్మకంలో అమెరికా వాటాను పెంచుకుంది.
ఫ్రాన్స్ కూడా తమ ఆయుధాల ఎగుమతులను 44 శాతానికి, జర్మనీ 21 శాతానికి పెంచాయి. ఇజ్రాయెల్, సౌత్ కొరియా కూడా ఆయుధ ఎగుమతులను గణనీయంగా పెంచుకున్నాయి. కానీ, ఆయుధాల ఎగుమతిలో ఇవి కీలకమైన దేశాలు కావు.
ఆసియాలో ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, పాకిస్తాన్, ఇండియా ఆయుధాల దిగుమతులను ఎక్కువగా చేసుకునే దేశాలలో ఉన్నాయి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్న గవర్నర్
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కేవలం ఆరు సంవత్సరాల వ్యవధిలోనే అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు దీటుగా దూసుకుపోతోందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. దూరదృష్టితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రి వర్గం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఉండవని, విద్యుత్‌రంగం దెబ్బతింటుందని, పరిశ్రమలు రావని, అభివృద్ధి కుంటుపడుతుందని కొందరు దుష్ప్రచారం చేశారని, కానీ అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి పని చేసిందని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిందని అన్నారు.
పలు వినూత్న పథకాలతో ప్రభుత్వం విమర్శకుల నోళ్లు మూయించిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో చీకటి ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందరూ కలిసికట్టుగా శ్రమించి అభివృద్ధికి బాటలు పరుచుకున్నామని, అయితే ఇది రాత్రికి రాత్రే సాధించిన విజయంకాదని గవర్నర్ అన్నారు.
రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ వివిధ రంగాలలో ఏ స్థాయిలో ఉందో, ఏ మేరకు ప్రణాళికలు అవసరమో ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర నాయకుడిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన అనుభవంతో భవిష్యత్తు కార్యాచరణను రచించారని గవర్నర్ అన్నారు.
ఆర్ధిక రంగంలో క్రమశిక్షణలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిందని, 2020-21 ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2,27,145గా ఉంటుందని అంచనా వేసినట్లు గవర్నర్ తెలిపారు. ఇది 2013-14 ఆర్ధిక సంవత్సరం నాటికి రూ. 1 లక్షకుపైగా మాత్రమే ఉండేదని ఆమె అన్నారు.
2019-20నాటికి ఆర్ధిక మాంద్యం, 2020-2021కి కరోనా వైరస్ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపినా, దానిని తట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలు జరిపిందని గవర్నర్ వెల్లడించారు.
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ తీవ్రంగా శ్రమించారని ఆమె అన్నారు. అన్నివర్గాల వారికి కరోనా చికిత్సను ఉచితంగా అందించి ప్రభుత్వం ఎన్నో ప్రాణాలను నిలబెట్టిందని చెప్పారు.
మిషన్ భగీరథ పథకం మంచి నీటి సమస్యను తీర్చిందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, మారుమూల తండాలకూ కూడా తాగునీరు ఇవ్వడం ద్వారా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందామని, తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని గవర్నర్ వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో మంచి నీటి వ్యవస్థ కొద్ది ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేదని ఆమె తెలిపారు.
సులభతర వాణిజ్య విధానంలో దేశంలోని టాప్-3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని, 15వేలకు పైగా పరిశ్రమలు, 15 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పించామని గవర్నర్ తెలిపారు.
ఒక్క ఐటీ రంగంలోనే 250కి పైగా కొత్త కంపెనీల, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని గవర్నర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- చైనా: ‘అర్ధరాత్రి వస్తారు.. నచ్చిన ఆడవాళ్లను ఎత్తుకెళ్లిపోతారు.. అడిగేవారే లేరు’
- ‘కొకైన్ హిప్పోలు’: శాస్త్రవేత్తలు వీటిని చంపేయాలని ఎందుకు చెబుతున్నారు?
- ఉత్తరాఖండ్: వరద వేగానికి మృతదేహాలపై బట్టలు కూడా కొట్టుకుపోయాయ్
- బీరుబాలా: మంత్రగత్తెలనే నెపంతో దాడులు చేసేవారికి ఈమె పేరు చెబితేనే వణుకు పుడుతుంది
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు? చరిత్రలో అక్కడ జరిగిన కుట్రలెన్ని? తెగిపడిన తలలెన్ని
- బైరిపురం: పంచాయితీ ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఓటు వేయని గ్రామమిది.. ఏకగ్రీవాలతో ఇక్కడ అభివృద్ధి జరిగిందా?
- ‘నా భార్య నన్ను పదేళ్ళు రేప్ చేసింది'
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి ‘గంటా’ పిలుపు.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు
- నియాండర్తాల్ మానవులు, తొలి తరం ఆధునిక మానవుల మధ్య సెక్స్ గురించి శాస్త్రవేత్తలు ఏం తెలుసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)