కరోనావైరస్ అన్‌లాక్-3.0: సినిమా హాళ్లు, జిమ్‌లు ఆగస్ట్‌లో తెరుచుకోబోతున్నాయా... -ప్రెస్ రివ్యూ

చైనాలోని ఒక థియేటర్‌లో క్రిమి నివారణ రసాయనాలు చల్లుతున్న సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

దేశంలో అన్‌లాక్‌ 3.0కు విధి విధానాలు ఖరారవుతున్నాయని, 25 శాతం సీటింగ్‌తో సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశం ఉందని నమస్తే తెలంగాణతోపాటు పలు పత్రికలు ప్రముఖంగా కథనాలు రాశాయి. తాజా అన్‌లాక్‌లో సినిమా హాళ్లు, జిమ్‌లకు ఓకే చెప్పే అవకాశం ఉందని, స్కూళ్లు, మెట్రోలు మాత్రం మూసే ఉంచుతారని ఈ కథనాలు పేర్కొన్నాయి.

50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇవ్వాలని యజమానులు ప్రభుత్వాన్ని కోరినా, 25 శాతానికే కేంద్రం సుముఖంగా ఉన్నట్లు ఈ కథనాలు వెల్లడించాయి. థియేటర్లలో భౌతిక దూరంపై కేంద్రం కఠినమైన నిబంధనలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక బడులు తెరవడంపై వివిధ రాష్ట్రాలతో కేంద్ర మానవ వనరుల శాఖ సంప్రదింపులు జరుపుతోంది.

అయితే, కేంద్రం నిర్వహిస్తున్న సర్వేలో ఎక్కువమంది తల్లిదండ్రులు స్కూళ్లు ఇప్పుడే వద్దంటున్నట్లు తేలింది. వైరస్‌ ఉధృతి తగ్గితే సెప్టెంబర్‌, అక్టోబర్‌ నుంచి బళ్లు నడపాలని కొందరు తల్లిదండ్రులు చెబుతుండగా, అసలు ఈ విద్యా సంవత్సరాన్ని రద్దు చేసి జీరో ఇయర్‌గా ప్రకటించాలని కొందరు కోరుతున్నట్లు ఈ కథనాల్లో పేర్కొన్నారు.

గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్

ఫొటో సోర్స్, GunturGovtHospital/FB

ఆరు బయటే శవాలు - గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల శవాలు ఆరుబయటే పడి ఉంటున్నాయని ఈనాడు పత్రిక ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. వీరు కోవిడ్‌-19 బాధితులా లేక మామూలు రోగులా అన్నదానిపై సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదని ఈ కథనంలో పేర్కొంది.

శనివారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 11 గంటల మధ్యలో, ఆసుపత్రిలోని రెండు విభాగాల వద్ద రెండు మృతదేహాలు పడి ఉండగా, ఆ శవాల మధ్యే రోగులు రాకపోకలు సాగించారని ఈ కథనం పేర్కొంది. మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండటంతో సిబ్బంది హడావిడిగా వాటిని అక్కడి నుంచి తొలగించారని వెల్లడించింది.

మార్చురీ నిండి పోయిందని, శవాలను అక్కడ ఉంచే పరిస్థితి లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు ఈ కథనంలో రాశారు. బంధువులకు సమాచారం ఇచ్చినా కొందరు మృతదేహాలను తీసుకెళ్లడం లేదని ఆస్పత్రి సీనియర్ అధికారి సుధాకర్‌ వెల్లడించినట్లు ఈనాడు తెలిపింది. వైద్యం తర్వాత మరణిస్తే కరోనా ఉందన్న భయంతో బంధువులు వారిని ఇక్కడే వదిలేసి వెళుతున్నారని, గుంటూరు స్మశాన వాటికలో రోజుకు నాలుగు మృతదేహాలను మాత్రమే దహనం చేసే సామర్ధ్యం ఉందని ఆ అధికారి వివరించినట్లు ఈ కథనం పేర్కొంది.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, cgkhabar/bbc

ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ -వయోభారంతో మావోయిస్టుల అవస్థలు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఏఓబీలో మళ్లీ అలజడి మొదలైందని, పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి సహా పలు పత్రికలు కథనాలు రాశాయి.

ఈ ప్రాంతంలో గడిచిన 10 రోజుల్లో మూడు ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని ఆంధ్రప్రభ పేర్కొంది.తాజా ఎన్‌కౌంటర్‌లో మరోసారి అగ్రనేతలు తప్పించుకున్నారని ఈనాడు తెలిపింది. జులై 28 నుంచి అమరవీరుల వారోత్సవాలకు మావోయిస్టు నేత జగన్‌ పిలుపునివ్వడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు పెరగగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసుల నిఘా కూడా పెరిగిందని అందువల్లే ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగినట్లు ఆంధ్రప్రభ కథనం వెల్లడించింది.

మరోవైపు పోలీసులు, రక్షణ బలగాలు దూకుడుగా వెళుతుండగా, మావోయిస్టుల్లో చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనం రాసింది. అగ్రనేతల్లో ఎక్కువమంది 50ఏళ్ల పైబడ్డ వారేనని, వారిలో చాలామంది బీపీ, షుగర్‌, ఆర్ధరైటిస్‌లాంటి సమస్యలతో బాధపడుతున్నారని, కొందరికి కరోనా కూడా సోకడంతో నాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు ఈ కథనం వెల్లడించింది. ద్వితీయ శ్రేణి నాయకత్వంలో కూడా ఎక్కువమంది 40 ఏళ్లు దాటిన వారే కావడం, కొత్తగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఉద్యమం ఇప్పుడు వయోభారంతో ఇబ్బంది పడుతోందని ఈ కథనం పేర్కొంది.

యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్

ఫొటో సోర్స్, UniversalSrushtiFertility/FB

దంపతుల బలహీనతలే ఆసరా - విశాఖలో చిన్నారులు ఫర్‌ సేల్‌

ధనవంతుల ఆకాంక్షను, పేదల అవసరాలను ఆలంబనగా చేసుకుని విశాఖలో పసిపిల్లల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ఫెర్టిలిటీ సెంటర్‌ వ్యవహారం గుట్టురట్టయినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ఇచ్చింది.

ఈ కథనం ప్రకారం, విశాఖ కేంద్రంగా పని చేస్తున్న యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో పసిపిల్లల అమ్మకాలపై పోలీసులకు, చైల్డ్‌లైన్‌కు వరసగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. గత కొన్నేళ్లుగా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు.

పేదలు, అవాంఛిత గర్భం దాల్చిన వారికి ఉచిత ప్రసవం సౌకర్యం కల్పించి, వారి పిల్లలను ఈ ఫెర్టిలిటి సెంటర్‌ నిర్వాహకులు స్వాధీనం చేసుకుంటారు. తర్వాత వారిని పిల్లలు లేక బాధపడుతున్న దంపతులకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని అమ్ముకుంటారు. అలా కొనుక్కున్న వారికి ఆ శిశువు ఇక్కడే పుట్టినట్లు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఇలా ఇప్పటికే ఆరుగురు పిల్లలను అమ్ముకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఎంతమందిని ఇలా అమ్మారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వాహకులకు ఇద్దరు ఆశావర్కర్లు కూడా సహకరించినట్లు తేలింది. 2010లో సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌గా మొదలైన ఈ ఆసుపత్రి, ఫిర్యాదులు రావడంతో యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌గా పేరు మార్చుకుంది. వివిధ రాష్ట్రాలలో శాఖలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యజమానురాలు డాక్టర్‌ నమ్రతనను పోలీసులు కర్ణాటకలో అరెస్టు చేశారు.

ఏడాదికి ఐఐటీ రెండు సార్లు

ఫొటో సోర్స్, Getty Images

బీఏ చదివినా 'గేట్‌' రాయొచ్చు- పరీక్షా విధానంలో పలు మార్పులు

ఈ ఏడాది నుంచి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 'గేట్' పరీక్షా విధానంతోపాటు, సబ్జెక్టుల్లో కూడా అనేక మార్పులు చేర్పులు జరగబోతున్నాయని అన్ని పత్రికలు ప్రముఖంగా కథనాలను ప్రచురించాయి.

ఈ దఫా గేట్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ ముంబయి అనేక మార్పులు చేర్పులతో పరీక్ష నిర్వహించబోతోంది. ఇంతకు ముందులా కాకుండా ఈసారి ఆర్ట్స్‌ సబ్జెక్టులు చదివిన విద్యార్ధులు కూడా ఈ పరీక్షకు హాజరుకావచ్చు. ఇంతకు ముందు 25 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా, ఈసారి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌, హ్యూమనిటీస్‌ అండ్‌ సోషల్ సైన్సెస్ సబ్జెక్టులను కూడా ప్రవేశపెడుతున్నారు. దీంతో బీఎస్సీతోపాటు బీఏ విద్యార్ధులు కూడా ఎగ్జామ్‌ రాసేందుకు అవకాశం ఉంది.

గతంలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులకు మాత్రమే పరీక్ష రాసే అవకాశం ఉండగా, ఈసారి మూడో సంవత్సరం స్టూడెంట్లకు కూడా అవకాశం ఇస్తున్నారు. ఇంతకు ముందు ఎగ్జామ్‌కు ఒకే సబ్జెక్టు ఎంచుకునే అవకాశం ఉండగా, ఈసారి రెండు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. గతంలో రెండు విడతలుగా నాలుగు రోజులపాటు పరీక్ష జరగ్గా, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యే అవకాశం ఉండటం, కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి ఆరురోజులపాటు పరీక్ష నిర్వహిస్తారని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)