మీకు ఉరిశిక్ష ఎందుకు విధించకూడదు.. 'సమత' అత్యాచారం, హత్య కేసులో దోషులను అడిగిన హైకోర్టు - ప్రెస్ రివ్యూ

సమత
ప్రచురణ

'సమత'పై లైంగిక దాడి, హత్యలకు పాల్పడి, ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులకు మంగళవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసిందని నవ తెలంగాణ తెలిపింది.

కింది కోర్టు లేదా స్పెషల్ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు నిర్థరించాలి. దీనికోసం ముగ్గురు దోషులకూ నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను మార్చి 24కు వాయిదా వేసింది.

Presentational grey line
Presentational grey line

ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు విధించిన ఉరిశిక్షను ఎందుకు అమలు చేయకూడదో వివరణ ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తన నోటీసుల్లో పేర్కొంది.

2019 నవంబర్ 24న తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటార్ గ్రామం దగ్గర ఒక దళిత మహిళను ముగ్గురు వ్యక్తులు దారి కాసి, పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, హత్య చేశారు. అదే సమయంలో దిశ కేసు జరగడంతో, సమత కేసు కూడా వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో నిందితులను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. దాదాపు 20 రోజుల్లోనే చార్జిషీటు వేశారు. ప్రభుత్వం కూడా ఫాస్ట్రాక్ కోర్టును నియమించింది. చార్జిషీటు వేసిన రోజు నుంచి రోజూ కోర్టులో ఇదే కేసు విచారించారు.

ముగ్గుర దోషులకూ మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జనవరి 30న తీర్పునిచ్చింది.

పరీక్షలు

ఫొటో సోర్స్, Getty Images

పదో తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులు

పదో తరగతి ప్రశ్నాపత్రంలో మార్పులను సూచిస్తూ ఎన్‌సీఈఆర్టీ ఓ బ్లూప్రింట్ సిద్ధం చేసిందని సాక్షి తెలిపింది.

ఈ కథనం ప్రకారం... పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇకపై ఒకటే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇప్పటి వరకూ సాధారణ ప్రశ్నలకు, బిట్ పేపర్‌కూ వేర్వేరు పత్రాలు ఇచ్చేవారు. ఇక నుంచి ఈ రెండింటినీ ఒకే పత్రంలో ఇవ్వనున్నారు.

ప్రస్తుతమున్న 11 పేపర్లు అలానే కొనసాగుతాయి. విద్యార్థులు సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్ అందిస్తారు. మార్కుల మెమోలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను సబ్జెక్టు వారీగా, పేపర్ల వారీగా పొందుపరుస్తారు.

ఎన్సీఈఆర్టీ సిద్ధం చేసిన బ్లూప్రింట్‌లో ఆరు నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల వరకూ అనుసరించాల్సిన విధానం, పబ్లిక్ పరీక్షల విధానాల్ని వివరించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో చర్చించి తుది నివేదిక సిద్ధం చేస్తారు.

ఇంటర్మీడియట్

ఫొటో సోర్స్, Getty Images

కాలేజీ మానితే భారీ ఫైన్ కట్టాల్సిందే

ఇంటర్మీడియట్‌లో హాజరు మినహాయింపు రుసుములను భారీగా పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ఉత్తర్వులు జారీచేసిందని ఈనాడు తెలిపింది.

దీని ప్రకారం... 60శాతం లోపు హాజరు ఉన్నవారిని ప్రైవేట్ విద్యార్థులుగా గుర్తిస్తారు. 60-75శాతం మధ్య ఉన్నవారు గతంలో చెల్లించే రుసుము రూ.200-500. దీన్ని రూ.1000-2000 కు పెంచారు.

మొదటి ఏడాదిలో 60శాతం కన్నా తక్కువ హాజరు నమోదై, ప్రైవేట్ విద్యార్థిగా గుర్తింపు పొందితే, ఇక ఆ విద్యార్థికి రెండో సంవత్సరంలో ఎలాంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభించవు.

కేసీఆర్

ఫొటో సోర్స్, KALVAKUNTLACHANDRASHEKARRAO/FB

విజయగాథలు వినడం కాదు.. మనం విజయం సాధించాలి

పని చేయండి లేదంటే తప్పుకోండి అని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు కేసీఆర్ సూచించారని ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది.

"మున్సిపాలిటీ అంటే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారిందని, ఆ పేరు పోవాలంటే పారదర్శక విధానాలు, అవినీతి రహిత వ్యవస్థ ఉండాలని సీఎం కేసీఆర్ మేయర్లు, చైర్‌పర్సన్లకు సూచించారు. రాత్రికి రాత్రే అన్ని పనులూ చేసేస్తామని చెప్పొద్దు. పక్కా ప్లానింగ్, కార్యాచరణతో అందరినీ కలుపుకుని పోతూ ప్రగతి సాధించాలి. దీనికి ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి.

ఆరు నెలలు కృతనిశ్చయంతో కష్టపడితే అన్ని పట్టణాలూ బాగుపడతాయని కేసీఆర్ అన్నారు" అని ఆ కథనంలో తెలిపింది.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)