తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు.. మళ్లీ శేఖర్ రెడ్డికి చోటు - ప్రెస్ రివ్యూ

తిరుమల

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది సభ్యులతో బుధవారమే పాలకమండలిని నియమించగా తాజాగా ప్రత్యేక ఆహ్వానితులను నియమించారని 'ఈనాడు' కథనం తెలిపింది.

'వీరిలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు వివిధ నగరాల్లో స్థానిక సలహా మండలి అధ్యక్షులు (ఎల్ఏసీ)కు చోటు కల్పించారు. దిల్లీ ఎల్ఏసీ అధ్యక్షుడు కుపేందర్ రెడ్డి(బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుశ్యంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబయి)తో పాటు చెన్నైకి చెందిన శేఖర్ ఏజే (శేఖర్ రెడ్డి)ని నియమించారు.

చెన్నైకి చెందిన శేఖర్ రెడ్డి గతంలో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత 2016 డిసెంబరు 8న ఆయన వ్యాపారసంస్థలు, ఇంటిపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేసి రూ.33.89 కోట్ల కొత్త 2 వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ సొమ్మంతా శేఖర్ రెడ్డి, ఆయన భాగస్వాముల వ్యాపారాలకు సంబంధించిందని తేలడంతో కేసులు కొట్టేశారు. ఈ నేపథ్యంలో తితిదే పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం కల్పించారు' అని ఆ కథనంలో తెలిపారు.

సింగరేణి కార్మికుడు

ఫొటో సోర్స్, Getty Images

సింగరేణి బోనస్‌ రూ.1,00,899

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి ఆర్జిస్తున్న లాభాల్లో కార్మి కులకు 28% వాటా ఇస్తున్నట్లు ప్రకటించారని 'సాక్షి' పత్రిక తెలిపింది.

'లాభాల్లో వాటా పెంచడంతో ఒక్కో కార్మికుడికి రూ.1,00,899 బోనస్‌గా అందనున్నట్లు వెల్లడించారు.

గతేడాది అందించిన బోనస్‌ కన్నా ఈ ఏడాది రూ.40,530 అదనంగా ప్రభుత్వం చెల్లించనుందని పేర్కొన్నారు.

గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సింగరేణి కాలరీస్‌ అంశంపై సీఎం కీలక ప్రకటన చేశారు.

సింగరేణి సంస్థ తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అందిస్తున్న సహకారం, కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ఫలితంగా సింగరేణి సంస్థాగతంగా బలోపేతమైందని సీఎం అన్నారు' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

వరుణ్ తేజ్

ఫొటో సోర్స్, facebook/varuntej

'వాల్మీకి' టైటిల్ మారింది.. కొత్త టైటిల్ 'గద్దలకొండ గణేష్'

వరుణ్‌ తేజ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం 'వాల్మీకి' పేరు మారిందని 'ఆంధ్రజ్యోతి' పత్రిక తెలిపింది.

''పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతోంది. అయితే టైటిల్ 'వాల్మీకి' అని ప్రకటించినప్పటి నుంచి ఈ టైటిల్‌పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

'వాల్మీకి' టైటిల్ మార్చాలని బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌పై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు వివరణ ఇస్తూ చిత్ర యూనిట్ చివరి నిమిషంలో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు టైటిల్ మార్చేది లేదని తెలిపిన చిత్ర యూనిట్.. కోర్టుకు వివరణ ఇస్తూ చిత్ర టైటిల్‌ను మారుస్తున్నట్లుగా తెలిపారు.

కొత్త టైటిల్‌గా 'గద్దలకొండ గణేష్' అని పెడుతున్నట్లుగా చిత్ర నిర్మాతలు, దర్శకుడు హైకోర్టుకు తెలిపారు.

సెప్టెంబర్ 20న ఈ చిత్రం 'గద్దలకొండ గణేష్' టైటిల్‌తోనే విడుదల కాబోతోంది' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

కుంగిన పిల్లర్లు

ఫొటో సోర్స్, facebook

కాకినాడలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం

ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజధాని కాకినాడలోని సినిమా రోడ్డులో ఓ ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగిందని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం తెలిపింది.

''భాస్కర్ ఎస్టేట్స్ భవనం మధ్యలో నాలుగు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. కాంక్రీట్ పగలడంతో ఇనుపరాడ్లు విరిగిపోయాయి.

ఈ అపార్ట్‌మెంట్‌ను 40 ఫ్లాట్లతో 15 ఏళ్ల క్రితం నిర్మించారు. పిల్లర్లకు పగుళ్లు రావడంతో ముందు జాగ్రత్తగా ఆ భవనంలో నివాసముండే వారిని ఖాళీ చేయిస్తున్నారు పోలీసులు.

కాకినాడ నగర పాలక సంస్థ అధికారులు భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని తొలగించాలంటూ నగర పాలక సంస్థ కమిషనర్ నోటీసులు జారీ చేశారు' అని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)