మంగాయమ్మ: 73 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిస్తున్న మహిళ - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళ 73 ఏళ్ల వయసులో కవలలకు తల్లి కాబోతున్నట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

పత్రిక కథనం ప్రకారం- తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న వివాహమైంది. పెళ్లయి ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వారి ఆశ తీరకుండానే ఇద్దరూ వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ మంగాయమ్మకు మాత్రం తల్లి కావాలనే కోరిక బలీయంగా ఉంది. వారికి పొరుగున ఉండే ఒక మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి కావడంతో, తానూ పిల్లల కోసం ఆ పద్ధతిని ఆశ్రయించాలని మంగాయమ్మ నిర్ణయించుకున్నారు.

నిరుడు నవంబరులో గుంటూరులోని ఒక నర్సింగ్‌ హోమ్‌కు మంగాయమ్మ దంపతులు వచ్చి ఐవీఎఫ్‌ నిపుణులైన డాక్టర్‌ ఉమాశంకర్‌ను కలిశారు. బీపీ, షుగర్‌ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మంగాయమ్మ మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని.. మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ప్రయత్నం చేశారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించింది. ఈ ఏడాది జనవరిలో మంగాయమ్మ గర్భం ధరించినట్లు తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

వయసు రీత్యా మంగాయమ్మకు సాధారణ ప్రసవం కష్టమని, నెలలు నిండినందున సెప్టెంబర్‌ 5న (గురువారం) ఉదయం 10.30 గంటలకు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేస్తున్నట్లు డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. స్కానింగ్‌లో మంగాయమ్మ గర్భంలో కవలలు ఉన్నట్లు తెలిసిందన్నారు. 73 ఏళ్ల వయసులో మంగాయమ్మ బిడ్డను కంటే ఇది ప్రపంచ రికార్డు అవుతుందని చెప్పారు.

తెలంగాణలో డ్రోన్లతో అత్యవసర ఔషధాల సరఫరా

తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర పరిస్థితిలో ఔషధాలు, రక్తం సరఫరాకు డ్రోన్లను వినియోగించనున్నామని, ఈ సేవలను పైలట్ ప్రాజెక్టుగా తర్వలో ప్రారంభించనున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారని సాక్షి తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే విస్తృతంగా వినియోగించుకొంటోందని ఆయన చెప్పారు. అక్రమ గనుల తవ్వకాలపై నిఘా, శాంతిభద్రతల పరిరక్షణ, అటవీ సంరక్షణ అవసరాలకు డ్రోన్లను వాడుతున్నామన్నారు.

యాదాద్రి ఆలయం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకూ డ్రోన్లను వినియోగించామని జయేశ్ రంజన్ ప్రస్తావించారు.

తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధికి తీసుకొంటున్న చర్యలపై ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు చెప్పారు.

ఒక్క ఉద్యోగినీ తొలగించం: జగన్

ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే నాటికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనిచేస్తున్న క్ష్రేత్రస్థాయి ఉద్యోగులంతా కొనసాగుతారని, వారిలో ఎవరినీ తొలగించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారని ఈనాడు రాసింది.

కొత్తగా గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులను నియమిస్తున్నుందన తమ ఉద్యోగాలు పోతాయేమోనని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వారికి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గోపాలమిత్రలు, విద్యుత్ స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యుగులు లాంటివారివరినీ తొలగించబోమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఈ హామీతోపాటు బుధవారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించిందని ఈనాడు తెలిపింది.

సెక్యూరిటీ సేవల్లోకి 'జియో'

ముకేశ్ అంబానీకి చెందిన టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, అపార్ట్‌మెంట్ల భద్రత నిర్వహణ సేవల విభాగంలోకి ప్రవేశిస్తోందని సాక్షి తెలిపింది. ఇందుకు సంబంధించి యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో జియో గేట్ పేరిట కొత్త యాప్ ప్రత్యక్షమవడం ఈ వార్తలకు ఊతమిస్తోందని చెప్పింది.

గేటెడ్ కమ్యూనిటీల్లో విజిటర్లు మొదలుకొని, రోజువారీ సిబ్బంది, డెలివరీ బాయ్స్, క్యాబ్స్ దాకా అన్నింటి రాకపోకల వివరాల నిర్వహణ అంతా జియోగేట్ క్రమబద్ధీకరిస్తుందని యాప్ గురించిన వివరణలో ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో తామెక్కడ ఉన్నామో కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డుకు తెలియజేసేందుకు వీలుగా పానిక్ అలర్ట్ ఫీచర్ కూడా జియోగేట్‌లో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)