మోదీ ప్రభుత్వం: జగన్ సర్కారు తీరు బాధాకరం - ప్రెస్‌రివ్యూ

ప్రచురణ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపేయాలని నవయుగ సంస్థకు రాష్ట్రప్రభుత్వం నోటీసులు జారీచేసిన మర్నాడే కేంద్ర సర్కారు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఒక కథనం రాసింది.

జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరమని కేంద్రం పేర్కొంది. దీనివల్ల పోలవరం ఎప్పటిలోగా పూర్తవుతుందో కూడా చెప్పలేమని విచారం వ్యక్తం చేసింది.

పోలవరం జాతీయ ప్రాజెక్టే అయినా నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా సాగిన నిర్మాణ పనులు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నెమ్మదించాయి. అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని ప్రకటించింది. ఆ దిశగానే నవయుగకు 60 సీ నోటీసులు ఇచ్చింది. పనులు ఆపేయాలని ఆ సంస్థను ఆదేశించింది.

కాగా, జలాశయాల భద్రతపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగిన సమయంలో పోలవరం అంశాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. దీనికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బదులిచ్చా రు.

''టెండర్లు రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతుందని కేంద్రమంత్రి ఆందోళన వ్య క్తం చేశారు. పోలవరం నిర్మాణ పనులను రాష్ట్రమే చూసుకుంటోందని.. నిర్మాణ పనుల్లో ఉన్న సంస్థ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పడానికి విచారిస్తున్నానని అన్నారు. ఈ నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు మరో అవరోధంగా మారుతుందని.. దీనివల్ల ప్రాజెక్టు పూర్తికి ఎంత కాలం పడుతుందో చెప్పలేమని.. ఖర్చు భారీగా పెరుగుతుందని షెకావత్‌ అన్నారు'' అని ఆ కథనంలో వివరించారు.

తెలంగాణలో నేలకొరిగిన 6.65 లక్షల వృక్షాలు

వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకోసం అవసరమైన భూములను బదలాయించి చెట్లను నరకడానికి అనుమతిస్తున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగినంత చొరవచూపడం లేదని 'ఈనాడు' కథనం వెల్లడించింది.

గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు బదలాయించిన అటవీభూముల్లో ఏకంగా 1.09 కోట్ల చెట్లను నరికేందుకు అటవీ, పర్యావరణశాఖ అనుమతులు ఇచ్చిందని, ఆ శాఖ కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో జులై 26న ఈ విషయాన్ని వెల్లడించారని.. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ సంఖ్య గణనీయంగానే ఉందని కథనంలో పేర్కొంది.

''కోల్పోయిన అటవీభూములకు కేంద్రం.. రాష్ట్రాల నుంచి పరిహారం వసూలుచేస్తోంది. ప్రత్యామ్నాయంగా అడవిని పెంచుతామంటూ ఈ పరిహారం నిధుల్ని 'కంపా' (కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ ప్లానింగ్‌ అథారిటీ)లో జమచేసింది. కేంద్రం నిబంధనల కారణంగా రాష్ట్రాలు జమచేసిన నిధుల్లోంచి ఏటా 10 శాతమే రాష్ట్రాలకు వస్తున్నాయి. తెలంగాణకు- 2016-17లో రూ.117 కోట్లు, 2017-18లో రూ.127 కోట్లు, 2018-19లో రూ.237.3 కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర నిధులు 'కంపా'లో రూ.3,500 కోట్లు ఉన్నాయి. వీటిలో 90 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని కోరుతున్నామని, అలా ఇస్తేనే ప్రత్యామ్నాయ అటవీ అభివృద్ధి వేగంగా జరుగుతుందని రాష్ట్ర అటవీ అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం గత నాలుగేళ్లలో 6,65,396 చెట్లను నరికివేసేందుకు అటవీశాఖ అనుమతించింది. సగటున ఏడాదికి లక్షన్నర చెట్లు పోతున్నాయి'' అని ఆ కథనంలో వివరాలు వెల్లడించారు.

కన్సల్టెన్సీలకు స్వస్తి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరుతో కన్సల్టెన్సీల ఇష్టారాజ్యానికి తెరపడిందని, ఏ విభాగంలోనూ కన్సల్టెన్సీలు ఇకపై కొనసాగరాదని సీఆర్‌డీఏ, ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని 'సాక్షి' పత్రిక కథనం వెల్లడించింది.

''30 కన్సల్టెన్సీల సేవలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జులై 31వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దల సూచనలకు అనుగుణంగా రాజధానిలో ప్రతి పనికి సీఆర్‌డీఏ, ఏడీసీలు ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలను నియమించుకుని కోట్ల రూపాయలు ముట్టచెప్పాయి. అవసరం లేకున్నా విదేశీ, స్వదేశీ కన్సల్టెన్సీలను ఎడాపెడా నియమించాయి. ఈ భారం రూ.460 కోట్లకుపైనే ఉండగా గతంలోనే రూ.329 కోట్లను చెల్లించారు. కన్సల్టెన్సీలు ఇప్పటికీ సీఆర్‌డీఏ, ఏడీసీ కార్యాలయాల్లో తిష్ట వేసి పని లేకపోయినా పెత్తనం చలాయిస్తున్నాయి.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దుబారా వ్యయాలపై దృష్టి సారించడంతో కన్సల్టెన్సీల లెక్కలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో నియమించిన కన్సల్టెన్సీలు, పనులు, ఖర్చుల గురించి ఉన్నతాధికారుల కమిటీ ఇటీవలే నివేదిక అందచేసింది. దీని ప్రకారం 30 కన్సల్టెన్సీలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంటున్నట్లు గత నెల 31వ తేదీన సమాచారం ఇచ్చారు. తక్షణం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి వాటిని కొనసాగించాల్సిన అవసరం ఉంటే సమాచారం ఇస్తామని తెలిపారు.

అన్ని విభాగాల డైరెక్టర్లకు నియమించిన కన్సల్టెన్సీలు, చేపట్టిన పని, చెల్లించిన సొమ్ము, ప్రస్తుతం వాటి అవసరం ఉందా? అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మొత్తం 70కిపైగా కన్సల్టెన్సీలను నియమించగా సీఆర్‌డీఏలో 50, ఏడీసీలో 20 వరకు కన్సల్టెన్సీలున్నాయి. పరిపాలనా నగరం డిజైన్ల పేరుతో హడావుడి చేసిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు సీఆర్‌డీఏ ద్వారా రూ.112 కోట్లను చెల్లించారు. హఫీజ్‌ కాంట్రాక్టర్‌ను పార్టనర్‌గా నియమించుకునేలా లండన్‌ కంపెనీ నార్మన్‌ ఫోస్టర్‌పై ఒత్తిడి తెచ్చి అదనంగా రూ.60.72 కోట్లు ముట్టచెప్పారు. ఈ రెండు సంస్థలు అందచేసిన రంగుల బొమ్మల కోసమే రూ.173.31 కోట్లు వ్యయం చేశారు.

ఒకపక్క వందల సంఖ్యలో కొత్తగా ఇంజనీర్ల నియామకం, మరోపక్క డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి పనిచేయించుకుంటూనే ప్రాజెక్టుల నిర్వహణ పేరుతో గత సర్కారు ప్రతి పనికి మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లను నియమించింది. ఈ నిర్వహణ సంస్థలకే రూ.100 కోట్లకుపైన చెల్లించింది.

రాజధాని ప్రకటనకు ముందే మాస్టర్‌ప్లాన్‌ కోసం సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్‌ను కన్సల్టెన్సీగా నియమించుకున్న టీడీపీ సర్కారు రూ.14.8 కోట్లు చెల్లించింది. బ్లూ కన్సల్టెంట్, గ్రీన్‌ కన్సల్టెంట్, రాజధాని స్ట్రాటజీ ప్రోగ్రాంను తయారు చేసేందుకు రూ.29 కోట్లు చెల్లించి మెకన్సీని నియమించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ కార్యాలయానికి సలహాలిచ్చేందుకు కూడా ఒక కన్సల్టెంట్‌ను నియమించుకున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరాం!

దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ అంశాలపై వినతిపత్రం అందజేశామని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారని 'నమస్తే తెలంగాణ' వార్తాకథనం తెలిపింది.

''ప్రపంచంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క-సారక్క జాతర. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరాం. గిరిజన కుంభమేళాగా గుర్తించి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.

సాంఘిక సంక్షేమ శాఖకు రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరాం. గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి నిధులు కోరాం.

కొత్త జిల్లాలకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఇవ్వాలని కోరాం.

రామగుండంలో ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరాం.

సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో విద్యా రంగంలో పెను మార్పులు వచ్చాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం. గురుకుల పాఠశాలల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరాం.

సీఎం కేసీఆర్‌ అనేక రంగాలలో శాశ్వత పరిష్కారాలు చూపారని మంత్రి చెప్పారు' అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)