You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నయీం కేసులో వెలుగులోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకుల పేర్లు :ప్రెస్ రివ్యూ
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు విచారణకు సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''నయీం కేసులో ఇప్పటివరకు బయటకు రాని రాజకీయ నాయకుల పేర్లు ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో పాటు, పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్‌తో అంటకాగిన వారి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చింది. 2016 ఆగస్టులో నయీం ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, పోలీస్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో నయీంతో పాటు, గ్యాంగ్ సభ్యులపై 250 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 107 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. మరో ఎనిమిది కేసుల్లో విచారణ పూర్తయింది. పది కేసుల్ని మూసేశారు. 17 కేసుల్లో విచారణ పూర్తిచేసి తుది నివేదికను సిద్ధం చేశారు. మూడు కేసుల్లో న్యాయసలహా మేరకు చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
మరో తొమ్మిది కేసులకు సంబంధించి దర్యాప్తు కీలక దశలో ఉంది. మిగతా కేసుల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రాజకీయ నాయకుల ప్రమేయంపై 8 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా కోర్టు పరిశీలనలో ఉన్నాయి. మరో 35 కేసుల్లో సిట్ విచారణ కొనసాగుతోంది. నయీం కేసుల్లో సిట్ ఇప్పటివరకు రూ. 2.08 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. కిలోల కొద్ది బంగారం, వెండి ఆభరణాలు, 1015 ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకొని, కోర్టులో సమర్పించింది. సరూర్‌నగర్, శంషాబాద్, సిద్దిపేట్ వన్ టౌన్, అచ్చంపేట్, వెల్డండ, మునుగోడు, చందంపేట్, తూప్రాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2003 నుంచి 2005 మధ్యకాలంలో నయీంపై నమోదైన ఎనిమిది కేసుల్ని పోలీసులు మూసివేశారు.
రాజకీయ నాయకులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించిన సమాచారం ప్రకారం భువనగిరి జడ్‌పీటీసీ సభ్యుడు సుధాకర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, వలిగొండ ఎంపీపీ నాగరాజు, భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, బీబీనగర్ మాజీ సర్పంచ్ జి.పింగళరెడ్డి, వెల్దండ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లి ఈశ్వరయ్య, వెల్దండ మాజీ ఎంపీటీసీ వి.సంజీవలకు నయీంతో సంబంధాలు ఉన్నాయి. వీరంత గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. భువనగిరి ఎంపీపీ వెంకటేష్ గతంలో కాంగ్రె్‌సలో ఉండి ప్రస్తుతం టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే(ఎల్బీనగర్, టీడీపీ) ఆర్.కృష్ణయ్య పేరు కూడా జాబితాలో ఉంది. వీరిలో కొందరి పేర్లు గతంలోనే బయటకు వచ్చినా నయీం కేసుల్లో ప్రమేయం ఉన్న అందరి పేర్లు బయటకు రావడం ఇదే మొదటిసారి.
పోలీస్ అధికారులు
నయీంతో సంబంధాలున్న పోలీసుల జాబితాలో అడిషనల్ ఎస్పీలు ఎం.శ్రీనివా్‌సరావు, ఎం.చంద్రశేఖర్, డీఎస్పీలు సీహెచ్ శ్రీనివాస్, ఎం.శ్రీనివా్‌సరావు, టి.సాయిమనోహర్, జి.ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య, జి.అమరేందర్‌రెడ్డి, తిరుపతన్న, ఇన్‌స్పెక్లర్లు మస్తాన్, బి.రాజగోపాల్, జి.వెంకటయ్య, శ్రీనివాస నాయుడు, కిషన్, ఎస్. శ్రీనివాసరావు, కె.వెంకట్‌రెడ్డి, మహ్మద్ మాజిద్, వెంకట సూర్యప్రకాష్, రవి కిరణ్ రెడ్డి, బలవంతయ్య, నరేందర్‌గౌడ్, ఈ.రవీందర్ ఉన్నారు. హెడ్‌కానిస్టేబుళ్లు దినేష్ ఆనంద్, సాదత్ మియా, కానిస్టేబుల్ బాలయ్య నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు వీరందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు’’
గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత సిట్ విచారణ ప్రారంభించి మూడేళ్లు అయిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యుడు పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ కేసులో రాజకీయ, పోలీస్, రెవెన్యూ విభాగాలు చట్ట వ్యతిరేక శక్తితో చేతులు కలిపాయని చెప్పారని ఆంధ్రజ్యోతి కథనంలో వివరించారు.
కేంద్రం వైఖరిపై కేసీఆర్, జగన్ అసంతృప్తి
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.
'కేంద్రం వైఖరిపై సీఎంలు విస్తృతంగా చర్చించారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.. ఈ ఏడాది పన్నుల వాటా తగ్గిందని, కేంద్రం నుంచి ప్రాయోజిత పథకాలకు వచ్చే నిధులు తగ్గాయని, ఇది రాష్ట్ర ఖజానా మీద ప్రభావం చూపుతుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగిస్తుందని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి నిరాశాజనకంగా ఉందని అన్నారు. పీపీఏల సమీక్షకు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం తమను నివ్వెరపరిచిందని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రాలకు సంబంధించిన కేంద్ర నిర్ణయాలపై అనుసరించాల్సిన వైఖరిపై ఉమ్మడిగా వ్యవహరించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు తెలిసింద'ని ఆ కథనం తెలిపారు.
ఇదేనా మీ చిత్తశుద్ధి? ట్విటర్‌లో చంద్రబాబు ధ్వజం
పోలవరం విషయంలో చంద్రబాబు, అన్న క్యాంటీన్ల విషయంలో నారా లోకేశ్ ట్వీట్ చేశారంటూ 'ఈనాడు' కథనం ప్రచురించింది.
''పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదన్నవాళ్లు, ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు మళ్లించారు. అవహేళనల్ని, ఆరోపణల్ని ఎదుర్కొంటూనే ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తి చేశాం. ఇంతా చేసినా మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుంది'' అని ప్రతిపక్ష నేత చంద్రబాబు గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారని ఆ కథనంలో తెలిపారు. ః
''వరద సమయంలో ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు వెనక్కు వెళ్లిపోమంటూ నోటీసులు ఇచ్చారంటే, ప్రాజెక్టు నిర్మాణం పట్ల మీకున్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్ధమవుతోంది. కృష్ణా నది ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీళ్లు లేకపోయినా పట్టిసీమ పుణ్యమా అని గోదావరి వరద జలాలతో ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోంది. నదుల అనుసంధాన ప్రయోజనం ఇదే. పట్టిసీమ వృథా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్ధం కాదు'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఆకలికి రాజకీయం తెలీదు
''ఆకలికి రాజకీయం తెలియదు సీఎం గారూ! మా మీద కక్ష సాధించడానికి పేదవాళ్ల కడుపు కొట్టాలా?'' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల మూసివేతపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్న క్యాంటీన్‌కు తాళం వేసి ఉన్న చిత్రాన్ని కూడా ఆయన తన ట్విటర్ ఖాతాలో ఉంచారని 'ఈనాడు' కథనం వెల్లడించింది.
తెలంగాణలో ఒకటి, ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు జారీ చేసిందని 'సాక్షి' వార్తాకథనం వెల్లడించింది.
'తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలోని ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి పదవీకాలం జూన్ 3, 2021 వరకు ఉండగా.. ఆయన సభ్యత్వం జనవరి 16, 2019న అనర్హతకు గురైనందున ఖాళీ ఏర్పడింది.
ఈ స్థానానికి ఆగస్టు 26న ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తాజా షెడ్యూలులో పేర్కొంది. ఆగస్టు 7న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీకానుంది. నామినేషన్లకు 14వ తేదీ వరకు గడువుంది.
అలాగే ఆగస్టు 16 వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 19వ తేదీ గడువుగా నిర్దేశించారు. ఆగస్టు 26న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏపీ శాసన మండలిలో ముగ్గురు సభ్యుల రాజీనామా నేపథ్యంలో ఎమ్మెల్యో కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), కోలగట్ల వీరభద్రస్వామిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో జూన్ 6, 2019న రాజీనామా చేశారు. వీరి పదవీకాలం మార్చి 29, 2023 వరకు ఉండగా మధ్యలోనే రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్ప డ్డాయి. ఈ ఎన్నిక ఆగస్టు 26న నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీచేసింద'ని ఆ కథనంలో వివరించారు.
జార్జిరెడ్డి జీవితంపై సినిమా
విప్లవమే శ్వాసగా, సమసమాజస్థాపన కోసం స్వప్నించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవిత చరిత్ర వెండితెరపై దృశ్యమానమవుతున్నదంటూ 'నమస్తే తెలంగాణ' తన వార్తాకథనంలో తెలిపింది.
'జీవన్‌రెడ్డి (దళం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌మాధవ్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 1965 నుంచి 75 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి జార్జిరెడ్డి గురించి తెలుసు. విప్లవోద్యమ నాయకుడిగా అసాంఘిక శక్తులపై అలుపెరుగని పోరాటం చేసిన ఆయన చిన్న వయసులోనే ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ తరానికి జార్జిరెడ్డి ధైర్యసాహసాల్ని తెలియజెప్పే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. 60, 70దశకం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దంపట్టేలా ఈ సినిమా ఉంటుంద'ని తెలిపారని ఆ కథనంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- కార్గిల్ యుద్ధం: "శరీరంలో 15 బుల్లెట్లు దిగాయి, శక్తిని కూడదీసుకుని పాక్ సైన్యంపై గ్రెనేడ్ విసిరా"
- ఫేస్ యాప్ ఉపయోగిస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త
- ఇంట్లో ప్రవేశించి మంచమెక్కి పడుకున్న పులి
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి
- ‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్లో రాజకీయ జోక్యంతో జాతీయ జట్టుపై నిషేధం
- రెండు వందల రూపాయల అప్పు తీర్చడానికి 30 ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చిన కెన్యా ఎంపీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)