తెలంగాణ; ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులపై హైకోర్టు పరిధికి మించి వ్యవహరించిందన్న సుప్రీం కోర్టు -ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరట లభించిందని, రుసుముల నిర్ణయాధికారం తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ)దేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఈనాడు తెలిపింది.

వాసవి, శ్రీనిధి కళాశాలల ఫీజుల పెంపు విషయంలో హైకోర్టు పరిధికి మించి వ్యవహరించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇంజినీరింగ్‌, ఫార్మసీ, బీఈడీ, న్యాయవిద్య, ఎంబీఏ తదితర కళాశాలలకు ప్రతి మూడేళ్లకు ఒకసారి టీఏఎఫ్‌ఆర్‌సీ వార్షిక రుసుములను నిర్ణయిస్తుంది.

ఆ కమిటీ 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు 2016 జులైలో రుసుములను ఖరారు చేసింది. అయితే అవి తమకు సమ్మతం కాదని, వాటిని పెంచాలని శ్రీనిధి, వాసవి, సీబీఐటీ, ఎంజీఐటీ కళాశాలలు 2016లో హైకోర్టును ఆశ్రయించాయి.

కళాశాలలు ప్రతిపాదించుకున్న రుసుములను వసూలు చేసుకోవచ్చని, అయితే అది కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం 2018లో తీర్పునిచ్చింది.

ఆ కళాశాలల్లో భారీగా రుసుములు చెల్లించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీనిధి, వాసవి కళాశాలల్లో తల్లిదండ్రుల సంఘాలు ఏర్పడ్డాయి.

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, తల్లిదండ్రుల సంఘాలు రుసుములపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.

"రుసుముల విషయంలో నియంత్రణ కమిటీ సిఫార్సుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. నిర్ణయం తీసుకొనే అంశంపైనే సమీక్ష ఉంటుంది కానీ తీసుకొన్న నిర్ణయంలో మెరిట్‌పైన కాదు. న్యాయ సమీక్ష పేరుతో రుసుముల నియంత్రణ కమిటీ పరిధిలోకి వెళ్లి కోర్టులు నిర్ణయం తీసుకోకూడదు. నిపుణుల కమిటీ సిఫార్సుల్లో జోక్యం చేసుకోకూడదు'' అని సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పులో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెడుతూ ఆదేశాలిచ్చింది.

ఇంజినీరింగ్‌ ఫీజుల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని తల్లిదండ్రుల కమిటీ సోమవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డిని కలిసి విన్నవించింది.

టీఏఎఫ్‌ఆర్‌సీ మాత్రమే రుసుములను నిర్ణయిస్తుందని, తుది నిర్ణయం కమిటీదేనిని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో తమకు స్పష్టత వచ్చిందని పాపిరెడ్డి చెప్పారు.

ఇంజినీరింగ్‌ కళాశాలలకే కాకుండా అన్ని వృత్తి విద్యా కళాశాలలకు ఈ తీర్పు వర్తిస్తుందని ఓ ఉన్నతాధికారి చెప్పారని ఈనాడు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ జులై 12న

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్‌ను ఈ నెల 12న శాసనసభలో ప్రవేశపెట్టనుందని సాక్షి తెలిపింది.

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ఈ నెల 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి.

ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న నవరత్నాల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

పవన్ కల్యాణ్: రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో విత్తనాల కొరత

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తనాల కొరతతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారని ఈనాడు తెలిపింది.

అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో నిలుచుంటున్నా విత్తనాలు లభిస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని పవన్ చెప్పారు.

అనంతపురం జిల్లాలో 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేసేందుకు గాను మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా, 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే కేంద్రాల్లో కంటే వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశనగ విత్తనం లభిస్తోందని రైతులు చెబుతున్నారంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వమే సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు.

ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని పవన్ చెప్పారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే సమీక్షించాలని కోరారు.

''ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన రూ.610.86 కోట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఖరీఫ్‌ పనులు మొదలైన తరుణంలో ధాన్యం అమ్మిన సొమ్ము రాకపోవటం రైతులకు ఇబ్బందిగా మారింది. బకాయిలు చెల్లించకుండా, రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రైతులకు బకాయిల చెల్లింపు, విత్తనాల కొరత తీర్చటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి" అని పవన్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు.

హైదరాబాద్‌లో సరికొత్త సిగ్నల్ వ్యవస్థ

టెక్నాలజీ ద్వారా ట్రాఫిక్ నియంత్రణలో నూతన పద్ధతులు అనుసరిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

ఇప్పటిదాకా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద స్తంభాలపై ఉన్న లైట్లతోనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న పోలీసులు, రాత్రిపూట ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు స్టాప్‌లైన్‌పై లైట్లు కనబడేలా డిజిటల్, అనలాగ్ సిగ్నళ్లను ఏర్పాటుచేస్తున్నారు.

ఈ విధానాన్ని బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ కూడలి వద్ద ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.

దూరంనుంచి వచ్చేవారికి కూడా కనబడేలా డిజిటల్ లైటింగ్‌ను రోడ్డుకు అడ్డంగా పడేలా ఏర్పాటుచేశారు.

రాత్రిపూట సిగ్నళ్లు సరిగా కనిపించక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ముప్పును తగ్గించడంతోపాటు ఎదురుగా రోడ్డుకు అడ్డంగా లైటింగ్‌తో స్టాప్‌లైన్ దాటి వాహనాలు నిలిపితే సీసీ కెమెరా ద్వారా ఫొటోలు తీసి చలానా విధించే అవకాశాలు ఉన్నాయి.

కేబీఆర్ పార్కు సిగ్నల్ వద్ద ఏర్పాటుచేసిన వ్యవస్థ పనితీరు ఆధారంగా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సిగ్నళ్లను ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)