పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ ముందంజ

ఫొటో సోర్స్, Getty Images
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ సాయంత్రం 4.30 గంటలకు 8 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
మరోవైపు, విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పెరంబూర్‌లో 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి విజయ్ 31,766 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 15,707 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
ఇదే సమయంలో ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 7,731 ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. విజయ్ పార్టీ ముందంజలో ఉండటంపై నాని, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.
