తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ ప్రక్రియకు ముందు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 2,290 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు కాగా, 222 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు థర్డ్ జెండర్లు పోటీలో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో 3,26,18,205 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,63,13,268 మంది పురుషులు కాగా, 1,63,02,261మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పీడబ్ల్యూడీ (దివ్యాంగులు) ఓటర్లు 5,06,921, థర్డ్ జెండర్లు 2,676 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నారై ఓటర్లు 2,944 మంది నమోదు చేసుకున్నారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ సమయంలోపు పోలింగ్ కేంద్రంలో లైనులో ఉన్న వారికే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
మిగిలిన 106 నియోజకవర్గాలో పోలింగ్ సాయంత్రం ఐదు వరకూ పోలింగ్ కొనసాగుతుంది.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది.)