సహారా ఇండియా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
సహారా ఇండియా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ చనిపోయారు. 75 ఏళ్ల సుబ్రతారాయ్ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నవంబర్ 12న ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కేడీఏహెచ్)లో చేరారు.
గుండెపోటు వల్ల పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి 10:30 గంటలకు మృతి చెందారని సహారా ఇండియా పరివార్ నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
“ఆయన స్ఫూర్తివంతమైన, దూరదృష్టి ఉన్న నాయకులు. ఆరోగ్య సమస్యలతో 12వ తేదీన కేడీఏహెచ్ ఆసుపత్రిలో చేరారు. 14వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన్ని కోల్పోవడం సహారా ఇండియా పరివార్‌కు తీరని నష్టం” అని సహారా ఇండియా పరివార్ పేర్కొంది.
