ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?, (మే 4 రాత్రి 10 గంటలకు)
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం,
అస్సాంలో భారతీయ జనతా పార్టీ 126 స్థానాలకు గాను 81 స్థానాల్లో ఘనవిజయం సాధించి, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 18 స్థానాలు గెల్చుకోగా, మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. బి.ఓ.పి.ఎఫ్, ఏ.జి.పి చెరో 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి.
కేరళలో కాంగ్రెస్ 63 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. వామపక్ష పార్టీలైన సి.పి.ఐ(ఎం) 26 స్థానాల్లో, సి.పి.ఐ 8 స్థానాల్లో గెలుపొందాయి. ఐ.యు.ఎం.ఎల్ కూడా 22 స్థానాలతో తన బలాన్ని నిరూపించుకుంది. కేఈసీ పార్టీ ఏడు స్థానాల్లో గెలిచింది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన టీవీకే పార్టీ 96 స్థానాల్లో గెలిచి, మరో 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార డి.ఎం.కె 54 స్థానాల్లో గెలిచి 6 చోట్ల ఆధిక్యంలో ఉండగా, ఏ.డి.ఎం.కె 44 స్థానాల్లో విజయం సాధించి, మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో ఇప్పటికే 184స్థానాలను గెలుచుకుని, మరో 23 చోట్ల ముందంజలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి, 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాలు గెలిచింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏ.ఐ.ఎన్.ఆర్.సి 30 స్థానాలకు గాను11 స్థానాల్లో గెలిచి, మరో చోట ఆధిక్యంలో ఉంది. డీఎంకే 5, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 3 చోట్ల, టీవీకే అభ్యర్థులు 2 చోట్ల గెలిచారు.