తీరం దాటిన పెనుతుపాను మోఖా, మియన్మార్‌లో ఐదుగురు మృతి
పెనుతుపాను మోఖా బంగ్లాదేశ్, మియన్మార్ మధ్య తీరం దాటింది.
బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో ఉన్న అతి పెద్ద పునరావాస కేంద్రంపై మోఖా తుపాను ప్రభావం తక్కువగానే ఉంది. అయితే, వందలాది తాత్కాలిక పునరావాస కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
తుపాను కారణంగా మియన్మార్‌లో ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందారు.
బంగ్లాదేశ్‌లో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు.
ఆదివారం రాత్రి తుపాను తీరం దాటింది. దీనివల్ల భారీ నష్టం ఏమీ జరగలేదని బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ అధికారి కమ్రుల్ హసన్ తెలిపారు. కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడడం, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన చెప్పారు.
మోఖా తుపాను మియన్మార్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి పశ్చిమ మియన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చెట్టు కూలి 14 ఏళ్ల బాలుడు మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. దేశంలో చాలా చోట్ల ఇల్లు ధ్వంసమైనట్లు సమాచారం వస్తోంది.
అత్యవసర సేవలకు సిద్ధమవుతున్నట్టు మియన్మార్ రెడ్ క్రాస్ సొసైటీ తెలిపింది.
బంగ్లాదేశ్‌లో 7 లక్షల 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి అధికారులు చెప్పారు.