‘‘రోడ్డుపైకి వెళ్లి నిరసన తెలిపే బదులు రెజ్లర్లు మా వద్దకు రావాల్సింది’’: పీటీ ఉష
రెజ్లర్లు రోడ్లపై నిరసన తెలిపే బదులు తమ దగ్గరికి వస్తే బాగుండని, ఇది ఆటకు ఏ మాత్రం మంచిది కాదని భారత ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రెసిడెంట్, రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పీటీ ఉష అన్నారు. కాస్త క్రమశిక్షణతో మెలగాల్సి ఉందన్నారు.
రెజ్లర్లు ఇలా ధర్నా చేయడం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు.
భారత ఒలంపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పీటీ ఉష సమావేశం నిర్వహించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.
ఈ ప్యానల్‌లో మాజీ షూటర్ సుమా షిరూర్, ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ భూపేంద్ర సింగ్ బజ్వా, హైకోర్టు మాజీ జడ్జి సభ్యులు. అయితే జడ్జి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.
పీటీ ఉష ప్రకటనపై స్పందించిన రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా, ‘ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన ప్రకటన వస్తుందని మేం అసలు ఊహించలేదు’ అని చెప్పారు.
‘ఆమె ఒక మహిళ. ఇది వినడం చాలా బాధాకరంగా ఉంది. మూడు నెలల పాటు మేం వేచిచూశాం. ఆమె వద్దకు మేం వెళ్లాం. కానీ, మాకు న్యాయం దొరకలేదు. అందుకే మేం ఇక్కడకు రావాల్సి వచ్చింది’’ అని తెలిపారు.