You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనాల్డ్ ట్రంప్: ఏప్రిల్ 4న కోర్టుకు హాజరుకానున్న అమెరికా మాజీ అధ్యక్షుడు
తన లాయర్‌కు ఇచ్చిన డబ్బును లీగల్ ఫీజులుగా చూపించడం, అందుకోసం నకిలీ పత్రాలు సృష్టించారనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు.
లైవ్ కవరేజీ
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో ఏడు మెడికో ఆత్మహత్య
ప్రవీణ్ శుభం, బీబీసీ కోసం
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సనత్ (21) అనే మూడో సంవత్సరం మెడికో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
సనత్ సొంతూరు పెద్దపల్లి జిల్లా. ఇటీవలె రెండో సంవత్సరం పరీక్షలు రాసి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం, సనత్ ఈ రోజు తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో తన మొబైల్ నుంచి తల్లిదండ్రులకు ‘మమ్మీ, డాడీ సారీ’ అని టెక్ట్స్ మెసేజ్ పంపిన తర్వాత, హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియలేదని, తల్లిదండ్రులకు సమాచారం అందించామని నిజామాబాద్ వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ విజయ్ తెలిపారు.
గత రెండు నెలల కాలంలో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇది రెండవ ఆత్మహత్య.
జనవరిలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్ష ఇదే తరహాలో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇందిర మాట్లాడారు.
"సనత్ చదువుల్లో మెరిట్ స్టూడెంట్. రాత్రి 2.00 గంటల వరకు ఫ్రెండ్స్‌తోనే ఉన్నాడు. అన్ని పరీక్షలు రెగ్యులర్‌గా పాస్ అయ్యాడు. ఇది దురదృష్టకరం. అతనికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పోలీసులు కేసు దర్యాప్థు చేస్తున్నారు" అని ప్రిన్సిపల్ ఇందిర తెలిపారు.
వరుస సూసైడ్‌లపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఏప్రిల్ 1: ఈ 3 పనులు చేస్తే కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బు ఆదా
ఇండోర్: గుడిలో మెట్లబావి కూలిన ప్రమాదంలో 35 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రామనవమి రోజున జరిగిన ప్రమాదంలో 35 మంది మరణించారు.
ఇండోర్‌లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో మెట్లబావి కూలిపోవడంతో చాలామంది బావిలో పడిపోయారు.
గురువారం బావి నుంచి 14 మంది మృతదేహాలను బయటకు తీశారు. శుక్రవారం ఉదయానికి మరో 20 మంది మృతదేహాలను వెలికితీశారు. సునీల్ సోలంకి అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 140 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సైన్యం కూడా అక్కడికక్కడే ఉండి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తోంది.
గురువారం 18 మందిని సురక్షితంగా బావి నుంచి బయటకు తీసుకొచ్చారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బావి పైకప్పు కూలిపోవడంతో అక్కడ ఉన్న జనం అందులో పడిపోయారు. బావిలోని నీటిని తొలగిస్తే తప్ప మనుషులను కాపాడే పరిస్థితి లేదు. నీరు తొలగిస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఊరుతూ ఉండడంతో సహాయక చర్యలు కూడా కష్టమయ్యాయి.
క్షణాల్లో ప్రమాదం జరిగిపోయిందని, తప్పించుకునే అవకాశం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది?
గురువారం రామనవమి కారణంగా ఆలయంలో రద్దీ నెలకొంది. బావి సిమెంట్ స్లాబ్‌తో కప్పి ఉంది. దానిపై హోమం ఏర్పాటుచేశారు. చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు. అకస్మాత్తుగా సిమెంట్ స్లాబ్ విరిగిపడిపోయింది. అక్కడ కూర్చున్నవారంతా బావిలో పడిపోయారు.
ఆలయంలో నిర్మాణ పనులపై స్థానిక ప్రజలు ఏడాది క్రితమే ఫిర్యాదు చేయగా, మున్సిపల్ కార్పొరేషన్ ఆలయ ట్రస్టుకు నోటీసు జారీ చేసిందని స్థానిక జర్నలిస్ట్ సమీర్ ఖాన్ తెలిపారు.
అయితే, ఇలాంటి ఆరోపణల ద్వారా మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆలయ ట్రస్టు ఆరోపించింది.
ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, దర్యాప్తుకు ఆదేశించామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
గాయపడినవారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. బాధితులకు పరిహారాన్ని ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా మెట్లబావులు, బోరుబావులపై దర్యాప్తు జరపాలని ఆదేశించినట్టు సీఎం తెలిపారు.
ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి? ఒక బ్యాట్స్‌మన్ ఔటైతే, ఈ ఆటగాడితో బ్యాటింగ్ చేయించొచ్చా?
బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు మన్యం బంద్
లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం
బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఇవాళ మన్యం బంద్‌కు గిరిజన సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ బంద్‌కు సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు మద్దతు తెలిపాయి.
బంద్ ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, బోయ వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేరిస్తే ఊరుకోమని, 'గిరిజన ద్రోహి జగన్' అని అరకులోయ పట్టణం ప్రధాని కూడలి వద్ద బైటాయించి నినాదాలు చేశారు.
మన్యం బంద్‌తో వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. మన్యం ప్రధాన కేంద్రమైన అరకులోయలో బంద్ కారణంగా పర్యాటకులు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరకు ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.
ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తమ హక్కులను హరించే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఆదివాసీలు రోడ్లపైకి రావడంతో.. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మార్చి 24వ తేదీన ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ... బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చూతూ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
"ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం చేశామని" సీఎం జగన్ తెలిపారు.
'పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు'
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
పసుపు బోర్డు ఏర్పాటు కాలేదంటూ ఫ్లెక్సీలతో కొందరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆ పసుపు రంగు ఫ్లెక్సీలపై "పసుపు బోర్డు.. ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు" అని రాసి ఉంది.
అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై స్పష్టత లేదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతులే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు వ్యవహారం టీఆర్ఎస్, బీజెపీ కీలక ప్రచార అస్త్రంగా నిలిచింది.
అప్పట్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎన్నికల వాగ్దానంగా బాండ్ పేపర్ సైతం రాసిచ్చారు.
కానీ, ఇప్పటివరకు పసుపు బోర్డు ఏర్పాటు కాలేదని నిరసన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం నిజామాబాద్ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
'ఆమ్వే లాంటి మోసపూరిత కంపెనీలకు అమితాబ్ వంటి సూపర్‌స్టార్లు సహకరించకూడదు' - వీసీ సజ్జనార్
అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు మోసపూరితమైన ఆమ్వే లాంటి కంపెనీలకు సహకరించకూడదని తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. ఇలాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాజిక వ్యవస్థకు చేటు చేస్తాయని ఆయన అన్నారు.
కాన్పూర్: టెక్స్‌టైల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం, సైన్యం సాయం కోరిన యూపీ ప్రభుత్వం
అరుణ్ అగర్వాల్, బీబీసీ కోసం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బన్స్‌మండి టెక్స్‌టైల్ మార్కెట్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటాక ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగింది.
మార్కెట్‌లో ఉన్న ఏఆర్ టవర్‌లో మంటలు చెలరేగడంతో మొత్తం మార్కెట్ అంతా కాలిపోయింది. ఏఆర్ టవర్, మసూద్ కాంప్లెక్స్, నఫీస్ టవర్‌లో దాదాపు అన్ని దుకాణాలు కాలి బూడిదయ్యాయి.
కాన్పూర్, ఉన్నావ్, లక్నో సహా పలు జిల్లాల నుంచి 50కి పైగా అగ్నిమాపక దళాలను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు యూపీ ప్రభుత్వం సైన్యం సహాయం కోరింది.
“మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బలమైన గాలి కారణంగా మంటలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీలైనంత త్వరగా మంటలను అదుపు చేయాలన్నదే మా ప్రయత్నం" అని కాన్పూర్ పోలీస్ కమీషనర్ బీపీ జోగ్దండ్ చెప్పారు.
నిప్పు ఎలా అంటుకుంది?
"గురువారం అర్థరాత్రి దాటాక ఒంటిగంట అవుతుండగా, ఏఆర్ టవర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దుకాణాల వెలువల ఉంచిన సామాన్లకు నిప్పంటుకుంది. ఈదురు గాలులు వీచడంతో మంటలు చెలరేగాయి. క్షణాలలో అన్ని దుకాణాలూ దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మసూద్ టవర్, మసూద్ కాంప్లెక్స్-2, హమ్‌రాజ్ కాంప్లెక్స్‌లకూ మంటలు వ్యాపించాయి" అని కాన్పూర్ వ్యాపార్ మండల్ టెక్స్‌టైల్ మార్కెట్ ప్రెసిడెంట్ గుర్వీందర్ సింగ్ చెప్పారు.
మంటలు అదుపులోకి వచ్చాయని, భవనాల్లో ఎవరూ చిక్కుకోలేదని యూపీ ఫైర్ సర్వీస్ డిప్యుటీ డైరెక్టర్ అజయ్ కుమార్ ఏఎన్ఐతో చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తుండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.