సల్మాన్ ఖాన్‌పై క్రిమినల్ కేసు కొట్టివేసిన బాంబే హైకోర్టు

ఫొటో సోర్స్, SALMANKHAN/FACEBOOK
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై నమోదైన నేరపూరిత కుట్ర కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది.
సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్‌పై 2019లో ఈ కేసు నమోదైంది. వారిద్దరూ తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ ఓ జర్నలిస్టు కేసు వేశారు.
జర్నలిస్టు దాఖలు చేసిన కేసులో సల్మాన్‌పై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోరాదని పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేసిందని ఆయన తరఫు న్యాయవాది ఆబాద్ పాండా బీబీసీకి చెప్పారు.
సల్మాన్ ఖాన్ సైక్లింగ్ చేస్తుండగా వీడియో తీసేందుకు ప్రయత్నించినందుకు ఆయన బాడీగార్డ్ తనపై దాడి చేశారని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే, పోలీసులు తన ఫిర్యాదును తీసుకోలేదని ఆరోపిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో వారిద్దరిపై కేసు నమోదైంది.
ఈ కేసులో స్థానిక కోర్టు సల్మాన్ ఖాన్‌కు, ఆయన బాడీగార్డ్‌కు సమన్లు పంపింది. దీంతో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందన్న జస్టిస్ భారతి డాంగ్రే ఈ కేసును కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.








