You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

మధ్యప్రదేశ్: గుడిలో కూలిన మెట్లబావి.. 13 మంది మృతి

ఇండోర్‌లోని పటేల్ నగర్‌లో ఉన్న ఒక గుడిలో మెట్లబావి కూలిపోయింది. చాలామంది బావిలో పడిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

లైవ్ కవరేజీ

  1. సల్మాన్ ఖాన్‌పై క్రిమినల్ కేసు కొట్టివేసిన బాంబే హైకోర్టు

    ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై నమోదైన నేరపూరిత కుట్ర కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది.

    సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్‌పై 2019లో ఈ కేసు నమోదైంది. వారిద్దరూ తనపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ ఓ జర్నలిస్టు కేసు వేశారు.

    జర్నలిస్టు దాఖలు చేసిన కేసులో సల్మాన్‌పై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోరాదని పేర్కొంటూ బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేసిందని ఆయన తరఫు న్యాయవాది ఆబాద్ పాండా బీబీసీకి చెప్పారు.

    సల్మాన్ ఖాన్ సైక్లింగ్ చేస్తుండగా వీడియో తీసేందుకు ప్రయత్నించినందుకు ఆయన బాడీగార్డ్ తనపై దాడి చేశారని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సల్మాన్ ఖాన్, ఆయన బాడీగార్డ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

    అయితే, పోలీసులు తన ఫిర్యాదును తీసుకోలేదని ఆరోపిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. కోర్టు ఆదేశాలతో డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో వారిద్దరిపై కేసు నమోదైంది.

    ఈ కేసులో స్థానిక కోర్టు సల్మాన్ ఖాన్‌కు, ఆయన బాడీగార్డ్‌కు సమన్లు పంపింది. దీంతో సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

    ఈ కేసులో బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందన్న జస్టిస్ భారతి డాంగ్రే ఈ కేసును కొట్టివేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

  2. అమెరికాలో ఆర్మీ విమానం కుప్పకూలింది.. మృతుల సంఖ్యపై ఆందోళన

    అమెరికాలోని కెంటకీ ప్రావిన్స్‌లోని ట్రిగ్ కౌంటీలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందనే భయాందోళనలు వినిపిస్తున్నాయి.

    హెలికాప్టర్ కూలిన విషయాన్ని కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ ధృవీకరించారు. ఇది "చెడ్డ వార్త" అని "మృతుల సంఖ్య పెద్దదే కావచ్చని" అన్నారు.

    ఈ ఘటన స్థానిక కాలమానం 21:35 గంటలకు జరిగిందని, కనీసం తొమ్మిది మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నట్టు స్థానిక మీడియా రిపోర్టులు తెలిపాయి.

    రొటీన్ శిక్షణలో భాగంగా ఆకాశంలో ఎగురుతున్న రెండు HH60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు కూలిపోయాయని ఫోర్ట్ క్యాంప్‌బెల్ మిలిటరీ బేస్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

    సిబ్బంది గురించి ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

  3. 'గూగుల్ భారత్‌లో ఫైన్ కట్టాల్సిందే' - నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్

    సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 160 మిలియన్ డాలర్ల జరిమానా విధించడాన్ని నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ) సమర్థించింది.

    గత ఏడాది అక్టోబర్‌లో సీసీఐ గూగుల్‌కు యాంటీ ట్రస్ట్ నోటీసులు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మార్కెట్‌లో టాప్ పొజిషన్ కోసం గూగుల్ అన్యాయమైన వ్యాపార విధానాలను అవలంబింస్తోందని ఆరోపిస్తూ 161 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,323 కోట్లు) జరిమానా విధించింది.

    భారత్‌లో సుమారు 95 శాతం మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. ఈ ఫోన్లలో గూగుల్ యాప్స్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్‌ను సూచిస్తున్నాయని ఆరోపించింది. ఈ విధానం మార్కెట్‌లో పోటీతత్వాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది. సీసీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గూగుల్‌కి జరిమానా విధించింది.

    సీసీఐ ఆరోపణలు సరైనవేనని, గూగుల్ జరిమానా చెల్లించాల్సిందేనని తాజాగా ఎన్‌సీఎల్ఏటీ స్పష్టంచేసింది.

    ఇదే కేసులో గతంలో సుప్రీంకోర్టులోనూ గూగుల్‌కి ప్రతికూల తీర్పు వచ్చింది. సీసీఐ మార్గదర్శకాలను రద్దు చేసేందుకు కోర్టు నిరాకరించింది.

    దీంతో, గూగుల్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అక్కడ కూడా గూగుల్‌కు చుక్కెదురైంది.

  4. శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్

    పోప్ ఫ్రాన్సిస్ శ్వాస సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.

    86 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ గత కొన్ని రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వాటికన్ తెలిపింది. అయితే, ఆయనకు కోవిడ్ సోకలేదని స్పష్టం చేసింది.

    "పోప్ కొన్ని రోజులు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని" వెల్లడించింది.

    సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో పోప్ చాలా బిజీగా ఉంటారు. ఈస్టర్ ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    బుధవారం ఉదయం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన బాగానే ఉన్నట్టు కనిపించారు. కానీ, కారు ఎక్కేటప్పుడు కాస్త అసౌక్యంగా ఉండి, ఇతరుల సహాయం తీసుకున్నారు.

    మొదట, పోప్ సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని వాటికన్ తెలిపింది. తరువాత, శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరారని ఒక ప్రకటనలో వెల్లడించింది.

    పోప్ కోసం ప్రార్థనలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలను కోరారు.

  5. పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ విడుదల చేసిన వీడియోలో ఏముందంటే?

  6. శ్రీరామనవమికి ముస్తాబైన ఒంటిమిట్ట రామాలయం

    వైయెస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయాన్ని శ్రీరామనవమి సందర్భంగా పూలు, లైట్లతో అలంకరించారు.

    ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామనవమి రోజున ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

  7. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తుండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.