ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార, విపక్ష ఎమ్మెల్యేల కొట్లాట, టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఫొటో సోర్స్, aplegislature.org
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొట్లాట జరిగింది.
అధికార, విపక్ష నేతల మధ్య వివాదం ముదిరి, ప్రత్యక్షంగా తలపడే వరకూ వెళ్లింది. జీవో 1ని రద్దు చేయాలని టీడీపీ పట్టుపట్టడంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా ఈ ఘటన జరిగింది.
స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు జీవో కాపీలు చించి, స్పీకర్‌పై విసిరారు. ఆ సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జోక్యం చేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలను సస్ఫెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఆసమయంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య వాగ్వాదం శృతిమించి కొట్లాట వరకూ వెళ్లింది. దాంతో ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు. స్పీకర్ సభను వాయిదా వేశారు.
వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.


