లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబాన్ గవర్నర్ బాంబు పేలుడులో మరణించారు. ఆయన కార్యాలయంలోనే ఈ బాంబు పేలుడు సంభవించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
అఫ్గానిస్తాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబాన్ గవర్నర్ బాంబు పేలుడులో మరణించారు. ఆయన కార్యాలయంలోనే ఈ బాంబు పేలుడు సంభవించింది.
2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయిన తాలిబాన్ నేతల్లో అత్యంత సీనియర్ నేత మహ్మద్ దావూద్ ముజమ్మిల్.
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన వచ్చిన తర్వాత హింస క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే తాలిబాన్ అనుకూల నాయకులు దాడులకు గురవుతున్నారు. చాలా దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
తాజాగా జరిగిన దాడికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదని స్థానిక పోలీసులు చెప్పారు. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.
అయితే, 'ఇస్లాం శత్రువులు జరిపిన పేలుడులో గవర్నర్ మరణించారు' అని తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ ట్విట్టర్‌లో తెలిపారు.
ముజమ్మిల్ గతంలో నంగర్‌హర్ ప్రావిన్సులో ఇస్లామిక్ స్టేట్ ఫైటర్స్‌పై జరిగిన పోరాటానికి గవర్నర్‌గా నాయకత్వం వహించారని చెబుతారు. ఆయన గతేడాది అక్టోబర్‌లో బాల్ఖ్‌కు వచ్చారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో గవర్నర్ కార్యాలయంలోని రెండో అంతస్తులో పేలుడు సంభవించిందని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు. ఆ పేలుడులో గవర్నర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. గురువారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కంగారూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్, భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ మొదటి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం అందించారు. రవిచంద్రన్ అశ్విన్ ట్రావిస్ హెడ్ (32)ను ఔట్ చేసి భారత్‌కు మొదటి వికెట్ అందించాడు.
అయితే మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజా భారత బౌలర్లకు అడ్డుగోడగా నిలిచి,సెంచరీ సాధించాడు.
మిగతా బ్యాట్స్‌మన్లలో లబుషేన్ 3 పరుగులు, స్టీవ్ స్మిత్ 38, పీటర్ హ్యాండ్స్ కోబ్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆట ముగిసే సమయానికి ఉస్మాన్ ఖవాజా 104 పరుగులు, కామెరూన్ గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.
దిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంలో రాజకీయ కుట్ర ఉందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, కవితలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
అన్నాచెల్లెల్లు ఇద్దరూ అబద్దాలు మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. 'తెలంగాణ ప్రజలెవరైనా మీరు దిల్లీకి వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారం చేయాలని కోరారా?' అంటూ ఆయన ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ '' మీ అక్రమ వ్యాపారానికి తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నరు? మీ అక్రమ వ్యాపారానికి మహిళా సమాజానికి ఏ రకంగా లింక్ పెడుతున్నరు?
మీరు వ్యాపారం తెలంగాణ ప్రజల కోసం, మహిళల కోసం చేశారా? మీరు నీతిమంతులైతే, అక్రమ మద్యం వ్యాపారం చేయనట్లయితే, అక్రమంగా డబ్బులు సంపాదించనట్లయితే ఎందుకు భుజాలు తడుముకుంటున్నరు? ఎందుకు భయపడుతున్నరు?
లక్షల రూపాయల విలువజేసే మొబైల్ ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? ప్రధానికి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన గొప్పవాళ్లేం కాదు మీరు. వ్యాపారం చేసింది మీరు, ఇరుక్కున్నది మీరు, దర్యాప్తు చేయడం నరేంద్ర మోదీ తప్పా?'' అని ప్రశ్నించారు.
మద్యం వ్యాపారాన్ని పెంచి పోషిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వమంటూ విమర్శించారు కిషన్ రెడ్డి.
''మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి ఐదు సంవత్సరాలు ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసిన మీకు రిజర్వేషన్ గురించి అడిగే హక్కు ఉందా?'' అంటూ ఆయన ప్రశ్నించారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత్ పర్యటనపై ఆస్ట్రేలియా మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంకు భారత ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వెళ్లారని, వేలాది మంది అభిమానులు హాజరయ్యారంటూ 'ది ఆస్ట్రేలియన్' వార్తాసంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది.
"ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు రావడం చరిత్రాత్మకం. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో ఇదే చివరి మ్యాచ్'' అని తన కథనంలో పేర్కొంది.
పీఎం నరేంద్ర మోదీ స్టేడియం చిత్రాలను ట్వీట్ చేస్తూ “ఆస్ట్రేలియా, ఇండియాలలో క్రికెట్ పట్ల మక్కువ ఒకటే. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా- భారత్‌ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌కు నా స్నేహితుడు ఆంథోనీ అల్బనీస్ కూడా సాక్షిగా నిలవడం విశేషం. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని అనుకుంటున్నాను'' అని పోస్టు చేశారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రధాని మోదీతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేస్తూ “భారత్‌తో 75 ఏళ్ల స్నేహబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. క్రికెట్‌ను ప్రేమించే రెండు దేశాలైన ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇది స్నేహపూర్వక పోటీ'' అని తెలిపారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ చిత్రాలు
తెలంగాణలో ఎన్నికలు దగ్గరకు వచ్చినందునే ఈడీ కేసులు పెడుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు.
ప్రస్తుతం దిల్లీలో ఉన్న కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.
‘‘ఎన్నికలు వచ్చే రాష్ట్రాలకు మోదీ కంటే ముందు ఈడీ పోతుంది. అది వారి మోడస్ ఆపరెండి.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పుడు నేరుగా హాజరు కావాలని ఎందుకు అడుగుతున్నారు? దేశంలో మహిళలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే విచారించేలా నిబంధనలు తీసుకురావాలని మేం డిమాండ్ చేస్తున్నాం.
ఈడీ కేసులను మేం ఎదుర్కొంటున్నాం. మేం తప్పు చేయలేదు కాబట్టి మాకు భయం లేదు. గాంధీ పుట్టిన ఈ దేశంలో అబద్ధాల రాజ్యం నడుస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలంటూ మేం 10న దీక్ష చేపడుతున్నాం. సుమారు ఇతర రాజకీయ పార్టీలు పాల్గొననున్నాయి.
ఈ బిల్లును తీసుకొచ్చే మంచి అవకాశం బీజేపీ ముందు. వారికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా తమకు నచ్చిన బిల్లులను ఆమోదింపజేసుకున్నారు’’ అని కవిత అన్నారు.
తాము బీజేపీ పార్టీ బీ టీం అయితే ఈడీ ఆఫీసుకు నేను ఎందుకు వెళ్తానని కవిత ప్రశ్నించారు.
‘‘దిల్లీ లిక్కర్ పాలసీలో స్కాం జరిగిందని చెబుతున్నారు. కానీ అదానీకి అనుకూలంగా పాలసీలు చేయడం ఒక స్కాం.
ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులు ఉండాలనే నిబంధనను పక్కన పెట్టి అదానీకి ఆరు ఎయిర్‌పోర్టులు ఇవ్వడం కుంభకోణం.
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు లాక్కోవడం... జీవీకే నుంచి ఎయిర్‌పోర్ట్ లాక్కోవడం స్కామ్‌లు కాదంట.
గౌతమ్ అదానీ, నరేంద్ర మోదీ సంబంధాల మీద దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ప్రధాని మాట్లాడరు.
మేం కేసులకు, విచారణలకు భయపడం. మా ఎమ్మెల్సీ(కవిత) ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటారు. మాకు న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉంది’’ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్, బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
ప్రతిపక్షాలను వేధించేందుకు ఈడీ, సీబీఐలను ప్రధాని నరేంద్ర మోదీ వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అందులో భాగంగానే కవితతోపాటు బీఆర్‌ఎస్ నేతల మీద కేసులు పెట్టారని అన్నారు.
‘‘నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష నాయకుల మీద 5,422 కేసులు పెట్టారు. 23 కేసులు మాత్రమే రుజువయ్యాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసేందుకే ఈడీ పని చేస్తోంది.
కర్నాటకలో విరూపక్షయ్య అనే బీజేపీ ఎమ్మెల్యే కొడుకు రూ.45 లక్షలు లంచం తీసుకుంటూ దొరికాడు. కానీ ఎటువంటి కేసులు లేవు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులు పొందుతున్న అదానీ మీద ఎటువంటి కేసులు ఉండవు. ముంద్రా పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన హెరాయిన్ దొరికింది ఆయనా చర్యలు లేవు.
ఒక సంస్థకు రెండు ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండాలనే నిబంధనలను తుంగలో తొక్కి ఆరు ఎయిర్‌పోర్టులు ఇచ్చారు.
మోదీ, అదానీ చీకటి స్నేహాన్ని ఎంత కాలం దాస్తారు.
బీజేపీ అనేది వాషింగ్ పౌడర్ నిర్మా వంటిది. ఆ పార్టీలో చేరితే ఎటువంటి కేసులు ఉండవు. సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ల సంగతి ఏమైంది?’’ అని కేటీఆర్ అన్నారు.
దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో విచారణకు రావాలంటూ నిన్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
భారతదేశ ఐక్యతకు రాహుల్ గాంధీ ‘ప్రమాదకరమని’ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు.
లండన్‌లో భారత సంతతి జర్నలిస్టులతో జరిగిన రాహుల్ గాంధీ సమావేశం మీద ఆయన స్పందించారు.
‘‘తనను తాను కాంగ్రెస్ రాకుమారునిగా చెప్పుకునే వ్యక్తి అన్ని హద్దులు దాటారు. ఆయన దేశ ఐక్యతను అత్యంత ప్రమాదకరంగా మారారు. దేశాన్ని విడకొట్టాలంటూ ప్రజలకు చెబుతున్నారు.
ఏక్ భారత్... శ్రేష్ఠ భారత్ అన్నది ప్రధాని నరేంద్ర మోదీ నినాదం’’ అంటూ ఆయన ట్వీట్లు చేశారు.
లండన్‌లో జర్నలిస్టుల సమావేశంలో బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ అనేక విమర్శలు చేశారు.
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 61 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్‌లు క్రీజులో ఉన్నారు.
తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.
నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులను భారత్ గెలవగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది.
మొతేరా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరయ్యారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.