You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

చీఫ్ ఎన్నికల కమిషనర్, ఈసీల ప్రస్తుత నియామక విధానాన్ని రద్దు చేసిన సుప్రీం కోర్టు

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల పదవులకు నియామకాలు జరిపేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. ప్రధాని, ప్రతిపక్షనేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లతో కూడిన కమిటీ ఈ నియామకాలు జరపాలని ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. జీ20 సదస్సులో మోదీ: ‘‘విభజించడంపై కాదు, ఐక్యతపై దృష్టి సారించండి’’

    భారతీయ నాగరికత స్ఫూర్తితో విభజనపై కాకుండా ఐక్యంగా ఉండటంపై దృష్టి సారించాలని జీ20 సదస్సులో పాల్గొన్న విదేశాంగ మంత్రులను భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

    దిల్లీలో గురువారం రెండోరోజు జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు జరుగుతోంది.

    ఈ సందర్భంగా విదేశాంగ మంత్రులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘‘ఈరోజు మీరు గాంధీ, బుద్ధుడు నడయాడిన భూమిపై సమావేశం అవుతున్నారు. అందుకే మిమ్మల్ని నేను ఒకటి అభ్యర్థిస్తున్నా. భారతీయ నాగరికత స్ఫూర్తితో విభజించడంపై కాకుండా ఐక్యతపై దృష్టి సారించాలని మిమ్మల్ని కోరుతున్నా’’ అని అన్నారు.

    ‘‘ఇటీవలే మనం శతాబ్ధంలోనే అత్యంత వినాశకరమైన అంటువ్యాధిని ఎదుర్కొన్నాం. అలాగే ప్రకృతి వైపరీత్యాలు, వేలాది మంది మరణాలకు కారణం అయ్యాయి.

    ఎన్నో ఆర్థిక సవాళ్లను, సంక్షోభాలను కూడా ఎదుర్కొన్నాం.ఈ సమస్యలను పరిష్కరించడంలో జీ20దేశాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.

    ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమావేశం చాలా కీలకం.ఈ భేటీలో మెరుగైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నా.

    గత కొన్ని సంవత్సరాలలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, అంటువ్యాధి, తీవ్రవాదం, యుద్ధం వంటి వాటిని పరిశీలిస్తే, ప్రపంచ వ్యవస్థ విఫలమైందని స్పష్టంగా తెలుస్తోంది’’ అని ఆయన ప్రసంగించారు.

  2. జేఎన్‌యూలో కొత్త నిబంధనలు, ధర్నా చేస్తే రూ. 20 వేల జరిమానా

    దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

    ఈ నిబంధనలపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    కొత్త నిబంధనలు ఏంటంటే,

    • ధర్నా, నిరహార దీక్ష చేస్తే రూ. 20 వేల జరిమానా
    • హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు లేదా రూ. 30 వేల జరిమానా
    • రోడ్లపై బైటాయించడం, జూదం ఆడటం, అక్రమంగా హాస్టల్స్‌లో ఉండటం, అభ్యంతరకరమైన భాష ఉపయోగించడం వంటివి నేరాల జాబితాలో చేర్చారు.
    • విద్యార్థులపై ఏదైనా ఫిర్యాదు నమోదైతే, ఆ కాపీని తల్లిదండ్రులకు కూడా పంపిస్తారు.
    • ప్రొఫెసర్, విద్యార్థుల ప్రమేయం ఉన్న కేసులను విశ్వవిద్యాలయం గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ పరిష్కరిస్తుంది.
    • లైంగిక వేధింపులు, ర్యాగింగ్ కేసులను చీఫ్ ప్రాక్టర్ కార్యాలయం పరిష్కరిస్తుంది.
    • కొత్త నిబంధనలు ఫిబ్రవరి 3 నుంచి వర్తిస్తాయని, ఈ నిబంధనలకు యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
  3. త్రిపుర, నాగాలాండ్‌లో ఆధిక్యంలో బీజేపీ, మేఘాలయలో పరిస్థితి ఏంటి?

    మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

    ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం, బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

    ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, త్రిపురలో బీజేపీ 7 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో, సీపీఐ (ఎం) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    నాగాలాండ్‌లో బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించి, ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక సీటు గెలుచుకుంది.

    మేఘాలయలో ఎన్‌పీపీ 4, యూడీపీ 2, కాంగ్రెస్, ఏఐటీఎంసీ ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.