You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నందమూరి తారకరత్న కన్నుమూత, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
లైవ్ కవరేజీ
బీబీసీ తెలుగు లైవ్ పేజీని ముగిస్తున్నాం
ఇంతటితో నేటి లైవ్ పేజీని ముగిస్తున్నాం. న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీలో రేపు ఉదయం కలుసుకుందాం.
ధన్యవాదాలు.
బ్రేకింగ్ న్యూస్, నందమూరి తారకరత్న కన్నుమూత, సోమవారం సాయంత్రం అంత్యక్రియలు
గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న నందమూరి తారకరత్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిల లోని తన నివాసానికి తరలిస్తారు..ఎల్లుండి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.
సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు.
నందమూరి తారకరత్న మరణ వార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, చివరికి తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చాడని ట్వీట్ చేశారు.
‘‘నందమూరి తారకరత్న అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలివైన, ప్రతిభావంతుడైన, ఎంతో ఆప్యాయత చూపించే యువకుడు, చాలా చిన్న వయసులోనే కాలం చేశారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తూ! శివైక్యం’’ అంటూ నటుడు చిరంజీవి కొణిదెల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
‘‘నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న కోలుకుంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకున్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుది శ్వాస విడవటం దురదృష్టకరం. తారకరత్న భార్యా పిల్లలకి, తండ్రి మోహనకృష్ణకి, బాబాయి బాలకృష్ణకి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులు’’ అంటూ టీడీటీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.
యాంటీ బయాటిక్స్: ప్రాణాలు కాపాడడమే కాదు, ప్రాణాలు తీస్తాయి కూడా...
ఉత్తర భారతంలో తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, హర్యానాలో ఏర్పాటు
ఉత్తర భారతంలో తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా గోరఖ్‌పూర్‌లో నెలకొల్పనున్నట్లు శాస్త్ర, సాంకేతిక, భూశాస్త్రాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఇది దేశ రాజధాని దిల్లీకి 150 కి.మీల దూరంలో ఏర్పాటు కానుంది.
ఈ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్టు కూడా మంత్రి శనివారం చెప్పారు.
దేశంలో చాలా వరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు దక్షిణ, పశ్చిమ భారతంలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
దేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వపు కీలక విజయాల్లో ఒకటిగా జితేంద్ర సింగ్ అభివర్ణించారు.
భారత్‌లో న్యూక్లియర్ సామర్థ్యాన్ని పెంచేందుకు గత ఎనిమిదేళ్లలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు తెలిపారు.
10 న్యూక్లియర్ రియాక్టర్లను ఇన్‌స్టాల్ చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
వినరో భాగ్యము విష్ణుకథ సినిమా రివ్యూ: చూడడం నిజంగా భాగ్యమేనా?
నందమూరి తారకరత్నను చూసేందుకు ఆస్పత్రికి వెళ్ళిన హీరో బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు
నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. ఆయనను చూసేందుకు నటుడు నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఈరోజు ఆస్పత్రికి వెళ్ళారు.
దాంతో, తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగు చూశాయి.
జనవరి 27న గుండెపోటుకు గురైన తారకరత్నను తొలుత కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తుండడంతో విదేశాల నుంచి వైద్యులను కూడా పిలిపించి చికిత్స అందించారు.
తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈరోజు సాయంత్రం తారకరత్నను సందర్శించారు. తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు, "ఇంకా అలాగే ఉంది. హైదరాబాద్‌కు షిఫ్ట్ చేసే విషయం గురించి నాకు తెలియదు. డాక్టర్లు మాట్లాడుతున్నారు" అని బదులిచ్చారు.
జార్జ్ సోరోస్: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి?
జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్: ముడి బెల్లం, పెన్సిల్ షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గింపు
రాష్ట్రాలకు బాకీ ఉన్న జీఎస్టీ పరిహారాలను నేటి నుంచి పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
మొత్తం జీఎస్టీ పరిహారాల బకాయిలు రూ.16,982 కోట్లను క్లియర్ చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసినట్టు తెలిపారు.
ప్రస్తుతం ఈ మొత్తం చెల్లింపు కోసం పరిహారాల ఫండ్ అందుబాటులో లేదని, తమ సొంత వనరుల నుంచే ఈ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశ అనంతరం నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఈ పరిహారాల చెల్లింపుతో పాటు మరికొన్ని ఉత్పత్తులపై కూడా జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్లను తగ్గించింది.
ముడి బెల్లం, పెన్సిల్ షార్ప్‌నర్లపై జీఎస్టీ తగ్గింపును చేపట్టింది కౌన్సిల్.
ముడి బెల్లంపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి జీరో శాతానికి లేదా 5 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు.
అంటే ముడి బెల్లాన్ని ప్యాక్ చేసి, లేబుల్ వేసి అమ్మితే 5 శాతం జీఎస్టీ పడనుంది. ఒకవేళ లూజ్‌గా అమ్మితే ఎలాంటి జీఎస్టీ విధింపు ఉండదు.
అలాగే పెన్సిల్ షార్ప్‌నర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ట్యాగ్స్ ట్రాకింగ్ డివైజ్‌లు లేదా డ్యూరబుల్ కంటైనర్లకు అమర్చే డేటా లాగర్లపై కూడా జీఎస్టీని కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి 18 శాతం నుంచి జీరోకి తగ్గిస్తున్నట్లు తెలిపారు.
లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్
వినరో భాగ్యము విష్ణుకథ రివ్యూ : పేరులో ఉన్న భాగ్యము సినిమాలో ఉందా లేదా?
రష్యా నుంచి వస్తున్న ముడి చమురుతో భారత్‌కు లాభమేనా?
నిక్కీ యాదవ్ హత్య కేసు: మూడేళ్ల కిందటే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న నిక్కీ, సాహిల్
దిల్లీలో నిక్కీ యాదవ్ (25) హత్య కేసు మరో మలుపు తిరిగింది.
నిందితుడు సాహిల్ గహ్లోత్, నిక్కీ యాదవ్‌లు సహజీవనం మాత్రమే చేయడం లేదని, వారికి మూడేళ్ల క్రితమే ఆర్య సమాజ్‌లో వివాహం అయినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ మేరకు స్పెషల్ సీపీ రవీందర్ యాదవ్ శనివారం వివరాలు వెల్లడించారు.
పోలీసులు కథనం ప్రకారం కొన్నేళ్లుగా దిల్లీలో హరియాణాకు చెందిన నిక్కీ యాదవ్, సాహిల్ గహ్లోత్ కలిసుంటున్నారు.
సాహిల్ తల్లిదండ్రులు అతనికి ఫిబ్రవరి 10న పెళ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన నిక్కీ యాదవ్ మరో పెళ్లి చేసుకోవద్దని కోరింది.
అయితే, అడ్డుగా ఉందని నిక్కీ యాదవ్‌ను మొబైల్ కేబుల్‌తో ఫిబ్రవరి 10న సాహిల్ హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. అనంతరం డెడ్ బాడీని రిఫ్రిజిరేటర్‌లో పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసులో సాహిల్ తండ్రితో సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, నిందితులందరికీ కోర్టు రెండు రోజుల రిమాండ్ విధించింది.
అలాగే నిక్కీ యాదవ్, సాహిల్ గహ్లోత్‌లు పెళ్లి చేసుకున్న ఆర్య సమాజ్ పూజారిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అయితే,నిక్కీ-సాహిల్ పెళ్లి చేసుకున్న విషయం తమ కుటుంబంలో ఎవరికీ తెలియదని నిక్కీ యాదవ్ తండ్రి సునిల్ యాదవ్ అన్నారు. దీన్ని తాము నమ్మడం లేదన్నారు. తమ కూతురి హత్య కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలన్నారు.
పాకిస్తాన్‌లో 27 శాతం దాటిన వార్షిక ద్రవ్యోల్బణం
దిల్లీ లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం విచారణకు రావాలని కోరింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసి మూడు నెలల దాటింది.
పీటీఐ కథనం ప్రకారం సీబీఐ మనీష్ సిసోడియాను ఈ కేసు చార్జ్‌షీట్‌లో నిందితుడిగా చేర్చలేదు. మనీష్, ఇతర అనుమానితుల పాత్రపై ఇంకా దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో చివరిసారిగా అక్టోబర్ 17న ఆయనను ప్రశ్నించింది సీబీఐ. మనీష్ సిసోడియా ఇల్లు, బ్యాంక్ లాకర్‌లో కూడా సోదాలు నిర్వహించింది.
కాగా, దీనిపై సిసోడియా ట్విట్టర్‌లో స్పందిస్తూ '' సీబీఐ నిన్న మరోసారి పిలిచింది. నాకు వ్యతిరేకంగా వారు సీబీఐ, ఈడీ పూర్తి అధికారాలను ఉపయోగించారు. నా ఇంటిపై దాడి చేశారు. బ్యాంక్ లాకర్‌లో సోదాలు చేశారు.
నాకు వ్యతిరేకంగా ఏం దొరకలేదు. దిల్లీలోని పిల్లలకు మంచి చదువు చెప్పే ఏర్పాట్లు చేశాను. వారు వాటిని ఆపాలనుకుంటున్నారు. నేను ఎల్లప్పుడూ విచారణకు సహకరిస్తున్నా, అలాగే చేస్తా'' అని స్పష్టంచేశారు.
చీతాలు వచ్చేశాయ్.. దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్న మరో 12 చీతాలు
తుర్కియే భూకంపం: 11 రోజుల తర్వాత శిథిలాల నుంచి ముగ్గురి వెలికితీత
తుర్కియేలో భూకంపం సంభవించిన 11 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు శిథిలాల నుంచి మరో ముగ్గురిని సజీవంగా బయటకు తీశాయి.
హకన్ యాసినోగ్లు అనే వ్యక్తి హటే ప్రావిన్స్‌లో నేలకూలిన ఓ భవనం కింద 278 గంటలపాటు చిక్కుకుపోయారు. రెస్క్యూ బృందం శుక్రవారం ఆయన్ని చేరుకుంది.
అంతేకాదు టీనేజర్ ఉస్మాన్ హలేబియే, ముస్తఫా అవ్సీ (34)లను కూడా రెస్క్యూ బృందం రక్షించింది.
"నేను పూర్తిగా ఆశలు వదులుకున్నా. ఇది నిజంగా అద్భుతం. అక్కడి నుంచి ఎవరూ సజీవంగా రారని అనుకున్నా" అని అవ్సీ తండ్రి రాయిటర్స్ వార్తా సంస్థతో తన సంతోషం పంచుకున్నారు.
భూకంపం సంభవించినప్పుడు అవ్సీ కుమార్తె వయస్సు కేవలం కొన్ని గంటలే. అవ్సీని స్ట్రెచర్‌పైకి ఎక్కించినప్పుడు వీడియో కాల్ ద్వారా తన బిడ్డను చూసుకున్నారు.
స్థానిక మీడియా కథనం ప్రకారం ఆయన భార్య బిల్గి అవ్సీ భూకంపం విధ్వంసం నుంచి తప్పించుకోగలిగారని, బిడ్డతో బయటపడ్డారని వెల్లడించింది. అయితే, అవ్సీ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపింది.
ఇపుడు మిస్టర్ అండ్ మిసెస్ అవ్సీ, బేబీ ఆల్మైల్ మెర్సిన్‌లోని ఆసుపత్రిలో శుక్రవారం ఆలస్యంగా కలుసుకున్నారు
తుర్కియే, సిరియాలలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 41,000 దాటింది. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
సమయం గడిచేకొద్దీ శిథిలాల కింద ఉన్న వ్యక్తులు బతికుండటం కష్టమని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
యాసినోగ్లు (40) ను శిథిలాల నుంచి బయటకి తీసి, హుటాహుటిన అంబులెన్సు వద్దకు తీసుకెళ్లిన దృశ్యం వాస్తవికతను ప్రతిబింబిస్తోంది.
అంతకుముందు ఎవరినైనా బయటికి తీస్తే రెస్క్యూ టీమ్‌లు సంబురాలు చేసుకునేవని, ఇపుడు అంతా నిశ్శబ్ధం అలుముకుందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.
రాజస్థాన్‌లో ముస్లిం యువకుల కిడ్నాప్, హరియాణాలో అన్నదమ్ములను కారుతో పాటు తగులబెట్టారు... అసలేం జరిగింది?
బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
పాంగొలిన్: ప్రపంచంలో అత్యధికంగా వేటకు బలయ్యే జంతువు ఇది.. దీని పొలుసులకు ఎందుకంత డిమాండ్?