లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారతదేశంలో మొదటిసారి జరిగిన ఈ రేస్‌లో ఫ్రాన్స్ దేశానికి జీన్ ఎరిక్ వెర్నె మొదటి స్థానంలో నిలిచారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన మాగుంట రాఘవ రెడ్డిని దిల్లీ కోర్టు 10 రోజుల రిమాండ్‌కి పంపింది.
వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డిని శనివారం ఉదయం ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఎల్1 హోల్‌సేల్ లైసెన్స్‌తో నడుస్తోన్న ఇండో స్పిరిట్స్‌లో 32.5 శాతం వాటాలు ప్రేమ్ రాహుల్ మండూరి పేరుపై ఉన్నట్లు ఈడీ చెబుతోంది. ఈయన రాఘవ రెడ్డి ఏజెంట్‌గా ఆరోపిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల్లో రాఘవ కూడా భాగస్వామ్యమైనట్లు ఈడీ పేర్కొంటోంది.
ఈ నేరంలో మాగుంట రాఘవ కీలకమైన వ్యక్తిగా ఈడీ చెబుతోంది.
వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట కుటుంబం సుదీర్ఘకాలంగా మద్యం వ్యాపారంలో ఉంది.
చెన్నై కేంద్రంగా ఆ కుటుంబానికి మద్యం తయారీ డిస్టిలరీస్ ఉన్నాయి.
దిల్లీలోనూ మాగుంట సంస్థలకు కొన్ని మద్యం దుకాణాలు ఉన్నాయి.
అయితే దిల్లీలో మద్యం విధానం, దుకాణల కేటాయింపు, నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది.
శనివారం మధ్యాహ్నం రాఘవ రెడ్డిని దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచింది ఈడీ. ఆ తర్వాత ఆయనకు దిల్లీ కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది.
తుర్కియేలో సోమవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపంలో ఒక భారతీయ పౌరుడు కూడా మరణించినట్టు ధ్రువీకరణ అయింది.
తుర్కియేలోని భారత రాయబార కార్యాలయం దీన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేసింది.
ఫిబ్రవరి 6న తుర్కియేలో భూకంపం వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయిన భారతీయ పౌరుడు విజయ్ కుమార్ మృతదేహాన్ని వెలికితీసినట్టు తెలిపింది.
బిజినెస్ ట్రిప్ కోసం విజయ్ కుమార్ తుర్కియే వెళ్లినట్టు రాయబార కార్యాలయం తెలిపింది. మలత్యాలోని ఒక హోటల్ శిథిలాల కింద ఆయన మృతదేహాన్ని కనుగొన్నట్టు పేర్కొంది.
బాధిత కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసింది. వీలైనంత త్వరగా మృతదేహాన్ని కుటుంబానికి చేరవేరుస్తామని తెలిపింది.
తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపాలలో మరణించిన వారి సంఖ్య 24 వేలు దాటింది.
సిరియాలో 3,553 మంది మరణించారని, దీంతో ఇరు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 24,596కి పెరిగినట్టు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
హైదరాబాద్ గ్రాండ్ ఈ ప్రిక్స్ ఫార్ములా-ఈ విజయవంతంగా ముగిసింది.
భారతదేశంలో మొదటిసారి జరిగిన ఈ రేస్‌లో ఫ్రాన్స్ దేశానికి జీన్ ఎరిక్ వెర్నె (JEAN-ERIC VERGNE) మొదటి స్థానంలో నిలిచారు.
డీఎస్ ఆటోమొబైల్స్ టీం తరఫున ఆయన ఈ పోటీలో పాల్గొన్నారు.
రెండవ స్థానంలో న్యూజీలాండ్ దేశానికి చెందిన ఎన్విజన్ రేసింగ్ టీమ్ తరపున పాల్గొన్న నిక్ కాసిడీ(NICK CASSIDY) నిలిచారు.
ఇక, మూడవ స్థానంలో పోర్చుగీసు దేశానికి చెందిన ట్యాగ్ హయె పోషె టీమ్ తరపున బరిలో నిలిచిన యాంటోనియో ఫెలిక్స్ ద కోస్టా (ANTONIO FELIX DA COSTA) ఉన్నారు.
అలస్కాలో అత్యధిక ఎత్తులో ఎగురుతుతున్న ఒక గుర్తు తెలియని వస్తువును పేల్చి వేయాలని ఫైటర్ జెట్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశించినట్టు వైట్‌హౌస్ ధ్రువీకరించింది.
ఈ గుర్తు తెలియని వస్తువు చిన్న కారు పరిమాణంలో ఉందని, తమ పౌర విమానయానానికి ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు.
ఈ వస్తువు ఉద్దేశ్యం, ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చిందో స్పష్టంగా తెలియరాలేదని కిర్బీ అన్నారు.
తమ ప్రాంతంలో ఎగురుతున్న చైనీస్ బెలూన్‌ను అమెరికా మిలటరీ కూల్చేసిన వారంలోనే మరో గుర్తు తెలియని వస్తువును కూడా పేల్చేసినట్టు వైట్‌హౌస్ ప్రకటించింది.
దక్షిణ కాలిఫోర్నియా తీరంలో శనివారం కూల్చేసిన బెలూన్ కంటే చాలా అంటే చాలా తక్కువ పరిమాణంలో ఈ వస్తువు ఉన్నట్లు కిర్బీ తెలిపారు.
అలస్కాలోని ఉత్తర తీర ప్రాంతంలో 40,000 అడుగుల ఎత్తులో ఈ వస్తువు ఎగురుతున్నట్టు తాము గుర్తించినట్లు చెప్పారు.
గంటకు 64 కి.మీల వేగంతో అలస్కాను దాటుకుని ఇది వెళ్లిపోయిందని, నార్త్ పోల్ దిశగా ఇది ప్రయాణిస్తున్న సమయంలో దీన్ని కూల్చేసినట్లు తెలిపారు.
కాలిఫోర్నియా విమానాలు అత్యధికంగా 45 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలవు.
‘‘ఇది ఎవరిదన్నది మాకు తెలియదు. ప్రభుత్వానిదా లేదా కార్పొరేట్ కంపెనీకి చెందినదా లేదా ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకు చెందినదా అనే దానిపై స్పష్టత లేదు’’ అని కిర్బీ చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్ఎంఎస్-2 యూనిట్ వద్ద పని చేస్తున్న 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఆరుగురు కాంట్రాక్టు ఉద్యోగులు, ముగ్గురు పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఒకరు డీజీఎం స్థాయి అధికారి.
ఎస్ఎంఎస్-2 లాడెల్ వద్ద ఫ్లాగ్ యాష్‌ను తొలగించే క్రమంలో, నీళ్లు పడటంతో లాడెల్ పేలింది.
పేలుడు కారణంగా లాడెల్‌లోని ఉక్కు ద్రవం అక్కడ పని చేస్తున్న వారిపై పడింది. ఈ ద్రవం 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
గాయాలు పాలైన వారందరిని తొలుత ప్రాథమిక చికిత్స కోసం స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి, అనంతరం విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఒకరు మినహా మిగతా వారందరి పరిస్థితి సాధారణంగానే ఉందని సెవెన్ హిల్స్ వైద్యులు తెలిపారు.
టెక్ కంపెనీ యాహూ భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించింది. తన మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందికి పైగా తీసేస్తున్నట్టు తెలిపింది.
ఈ కంపెనీలో 8,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
యాహూ కంపెనీ తన ప్రకటనల వ్యాపార విభాగాన్ని పునర్ వ్యవస్థీకరిస్తోంది. ఈ కారణంతో ఈ ఏడాది చివరి నాటికి ఈ విభాగంలోని సగానికి పైగా ఉద్యోగులు తమ జాబ్స్‌ను కోల్పోనున్నారు.
కంపెనీ పునర్వ్యవస్థీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వారం చివరి నాటికి సుమారు 1000 మంది ఉద్యోగులు ఈ కోతకు ప్రభావం కానున్నారు.
డిమాండ్ పడిపోవడం, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుండటం, వడ్డీ రేట్లు బాగా పెరుగుతుండటంతో కంపెనీలు తీవ్ర సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాహూ సైతం తాజాగా ఈ ప్రకటన చేసింది.
‘‘ఈ నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోలేదు. కానీ, దీర్ఘకాలికంగా ఈ నిర్ణయం మంచి చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ మార్పులు మా ప్రకటనల వ్యాపారాన్ని బలోపేతం చేయనున్నాయి. మా కస్టమర్లకు, భాగస్వాములకు మెరుగైన వాల్యూను అందించేందుకు సహకరించనున్నాయి’’ అని యాహూ అధికార ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగపూర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలిచింది.
మొదటి ఇన్నింగ్స్‌లో అసీస్ జట్టును 177 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగారు. ఆస్ట్రేలియా 91 పరుగలకే కుప్పకూలింది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు.. ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
దేశంలోని నియంత్రణ సంస్థలు చాలా అనుభవం ఉన్నవని, అవి నిత్యం అప్రమత్తంగా ఉంటాయని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొనడం, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబయిలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
క్రిప్టో కరెన్సీల విషయాన్నీ ఆమె ప్రస్తావించారు. క్రిప్టోలు చాలా 99 శాతం సాంకేతికతో ముడిపడినవని.. వీటిపై నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి, ప్రామాణిక పద్ధుతులు నిర్దేశించడానికి వీలుగా ప్రస్తుతం జీ20 దేశాలతో మాట్లాడుతున్నామన్నారు.
తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభం వాయిదా పడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈ కార్యక్రమం వాయిదాా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఫిబ్రవరి 17న సచివాలయాన్ని సీఎం కేసీఆర్ర ప్రారంభించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాయిదా పడింది.
సచివాలయ ప్రారంభానికి కొత్త తేదీని ప్రభుత్వం తరువాత వెల్లడించనుంది.
తెలంగాణలో ఖాళీ అవుతున్న ఒక ఉపాధ్యయ ఎమ్మెల్సీ స్థానం, మరో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడడంతో కోడ్ అమలులోకి వచ్చింది.
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు రాఘవ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ మద్యం కుంభకోణం విచారణలో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
దిల్లీలో మద్యం విధానం, దుకాణల కేటాయింపు, నిర్వహణలో జరిగిన అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.
అందులో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమీప బంధువు, అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డి వంటి వారున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు సహా పలువురు అనుచరులు అరెస్ట్ అయ్యారు.
వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా గెలిచిన మాగుంట కుటుంబం సుదీర్ఘకాలంగా మద్యం వ్యాపారంలో ఉంది.
చెన్నై కేంద్రంగా ఆ కుటుంబానికి మద్యం తయారీ డిస్టిలరీస్ ఉన్నాయి.
దిల్లీలోనూ మాగుంట సంస్థలకు కొన్ని మద్యం దుకాణాలు నిర్వహించాయి.
అయితే టెండర్లు, రేట్లు విషయంలో అవకతవకలు జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది.
అందుకు బాధ్యులుగా చెబుతూ ఛార్జిషీట్లు కూడా దాఖలు చేసింది.
ఆ క్రమంలోనే మాగుంట రాఘవరెడ్డి కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది.
మాగుంట రాఘవరెడ్డి కొంతకాలంగా ఒంగోలు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నారు.
ఓవైపు వ్యాపార వ్యవహారాలు చూస్తూనే మరోవైపు రాజకీయంగానూ చురుగ్గా తిరుగుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంగోలు ఎంపీ గా పోటీ చేయొచ్చనే ప్రచారం కూడా సాగింది.
ప్రస్తుతం ఆయన ఈడీ కేసుల్లో అరెస్ట్ కావడం రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది.
ఎంపీ శ్రీనివాసులరెడ్డి, రాఘవ రెడ్డికి చెందిన సంస్థల్లో ఇప్పటికే ఈడీ సోదాలు నిర్వహించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.