లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తుర్కియేలో మృతుల సంఖ్య 16,170 కి పెరిగినట్లు ఆ దేశాధ్యక్షుడు ఎర్దవాన్ గురువారం మధ్యాహ్నం చెప్పారు. సిరియాలో మృతుల సంఖ్య 3,162కు పెరిగినట్లు ఆ దేశం వెల్లడించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
గూగుల్ సంస్థ కృత్రిమ మేధస్సు సాంకేతిక రేసులో తాము ముందున్నామని వినియోగదారులకు భరోసా కలిగించే ప్రయత్నంలో పడింది.
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్ 'బార్డ్'కి సంబంధించిన ఒక పొరపాటు కారణంగా గూగుల్ 100 బిలియన్ డాలర్లు నష్టపోయింది.
బార్డ్‌ను అడిగిన ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇచ్చింది.
గూగుల్ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్ 'బార్డ్'ను తీసుకురానున్నట్లు ఇటీవల ప్రకటించింది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆవిష్కరణల గురించి తొమ్మిదేళ్ల బాలిక చాట్‌బోట్‌ను అడుగుతున్నట్లు ఉంటుంది.
భూమి సౌర వ్యవస్థ వెలుపల నుంచి గ్రహం చిత్రాలు తీసే తొలి టెలిస్కోప్ ఇదని చాట్‌బోట్ జవాబు చెబుతుంది.
అయితే, ఇది తప్పుడు సమాచారమని ఖగోళ శాస్త్రవేత్తలు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 2004లో ఐరోపాకు చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్ తొలిసారిగా ఈ పని చేసిందని తెలిపారు.
దాంతో, మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు బుధవారం 7 శాతం పడిపోయాయి. దీని వలన కంపెనీకి 100 బిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధిపతి శిబు సోరెన్ ఆరోగ్యం క్షీణించింది.
గురువారం మధ్యాహ్నం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో రాంచీలోని మేదాంత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక దర్యాప్తులో, ఆయన ఛాతీలో న్యుమోనియా పాచ్ ఉన్నట్టు తేలింది.
శిబు సోరెన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
ఆయన అందరితో మాట్లాడుతున్నారని, ఆహారం తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు పలు రకాల పరీక్షలు జరుపుతున్నారు.
79 ఏళ్ల శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
బుధవారం ట్విట్టర్‌లో వినియోగదారులు కొన్ని సాంకేతిక లోపాలను ఎదుర్కోవలసి వచ్చింది.
ట్వీట్ చేయడానికి ప్రయత్నిస్తే, "మీ రోజువారీ ట్వీట్ పరిమితి సమాప్తం అయింది" అన్న మెసేజ్ వచ్చిందని, ట్వీట్ చేయడానికి అనుమతి లేకుండా పోయిందని కొందరు యూజర్లు చెప్పారు.
బుధవారం రాత్రి 10.00 గంటలకు ముందు ఈ అవాంతరం కనిపించిందని 'డౌన్‌డిటెక్టర్' చెప్పింది. వెబ్‌సైట్‌లలో సాంకేతిక లోపాలను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ఇది.
ఈలాన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ వచ్చినప్పటి నుంది, ఉద్యోగాల్లో కోత మొదలైంది.
ట్విట్టర్‌ను తాను కొనుగోలు చేసినప్పుడు అందులో 8,000 మంది ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు సుమారు 2,300 మంది ఉద్యోగులు ఉన్నారని గత నెలలలో ఈలాన్ మస్క్ చెప్పారు.
ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కొన్ని నెలలుగా నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు.
అయితే, బుధవారం నాటి అవాంతరాలకు సిబ్బంది కొరతే కారణమని స్పష్టంగా చెప్పలేమని అన్నారు.
ఈ సాంకేతిక లోపాన్ని వెంటనే సరిదిద్దారు. కొద్దిసేపటి తరువాత వినియోగదారులు ట్వీట్ చేయగలిగారు.
తుర్కియే, సిరియాల్లో సోమవారం నాడు సంభవించిన భూకంపాల్లో మృతుల సంఖ్య 20,000 కు చేరువవుతోంది.
తుర్కియేలో మృతుల సంఖ్య 16,170 కి పెరిగినట్లు ఆ దేశాధ్యక్షుడు ఎర్దవాన్ గురువారం మధ్యాహ్నం చెప్పారు.
మరోవైపు సిరియాలో మృతుల సంఖ్య 3,162కు పెరిగినట్లు ఆ దేశం వెల్లడించింది.
ఈ రెండు దేశాల్లో ఇంకా శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించేందుకు సహాయ బృందాలు పనిచేస్తున్నాయి.
మరోవైపు ఆశ్రయం లేక, తాగు నీరు లభించక, ఇంధనం, విద్యుత్తు అందక చాలా మంది భూకంప బాధితులు సతమతమవుతున్నారని, మరింత మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం రాగంపేట గ్రామంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ఆయిల్ ప్యాకేజింగ్ పరిశ్రమలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ అందక ఊపిరాడని పరిస్థితుల్లో వీళ్లు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రకటించారు.
ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆమె ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమలో నిర్వహణ లోపాలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 304 ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఆమె వెల్లడించారు.
నిర్వహణా లోపాలు ఉంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే పరిశ్రమను సీజ్ చేసినట్టు ఆమె వెల్లడించారు.
పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితర నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలో చాలా కాలంగా నిర్వహణా లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నా తగిన చర్యలు తీసుకోవటంలో యంత్రాంగం విఫలమైందని తప్పుపట్టారు.
ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. జీ రాగంపేట సమీపంలో పలు పరిశ్రమలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా పరిశ్రమల శాఖ, కార్మిక శాఖ, ఇతర అధికారులు ఎటువంటి తనిఖీ నిర్వహించకుండా, అశ్రద్ధ చేయటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు చెప్తున్నాయి.
ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు స్థానికంగా పొలిమేరు గ్రామస్థులుగా అధికారికంగా ధృవీకరించారు.
ఏడుగురు మృతులను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు.
రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్‌పై విమర్శల దాడి చేశారు.
‘ప్రభుత్వ పథకాల పేర్లతో కొందరికి ఇబ్బంది ఉంది. పథకాల పేర్లలో సంస్కృత పదాలున్నాయి. ఇంతకుముందు 600 ప్రభుత్వ పథకాలకు గాంధీ-నెహ్రూ కుటుంబీలకు పేర్లు ఉన్నట్లు నేను ఒక నివేదికలో చదివాను. పథకాలకు వారి పేర్లు పెట్టుకోవాలనుకుంటున్నారు కానీ నెహ్రూ పేరును ఆయన వారసులు ఎందుకు పెట్టుకోరో నాకు అర్థం కాదు. నెహ్రూ పేరు పెట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? లేదంటే సిగ్గు పడుతున్నారా?’ అని మోదీ అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ రాజ్యసభలో మోదీ ప్రసంగించారు.
సభలో మోదీ మాట్లాడుతున్నంతసేపు విపక్ష సభ్యులు ‘మోదీ-అదానీ భాయి భాయి’ అంటూ నినాదాలు చేశారు.
బుధవారం లోక్‌సభలో ప్రసంగించినప్పుడు అదానీ విషయాన్ని ఏమాత్రం ప్రస్తావించకుండా వదిలేసినట్లే గురువారం రాజ్యసభలోనూ మోదీ తన ప్రస్తంగంలో ఎక్కడా అదానీ ప్రస్తావనే తేలేదు.
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు బ్యాంకులను జాతీయరణ చేశారంటూ మోదీ తప్పుపట్టారు.
తమ ప్రభుత్వం పేదలకు ఏమేం చేస్తోందో సభకు వివరించారు మోదీ.
తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విపక్షాలనుద్దేశించిన ఆయన విమర్శలు చేశారు. ఎంత ఎక్కువ బురద చల్లితే కమలం అంత ఎక్కువగా వికసిస్తుందన్నారు మోదీ.
కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారని.. అయినా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మాత్రం కుట్రలు ఇంకా ఆపడం లేదు అన్నారు మోదీ.
ప్రజలు ఇదంతా చూస్తున్నారని, వారికి అవకాశం దొరికిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తున్నారని మోదీ అన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపైనా మోదీ విమర్శలు చేశారు. ‘మోదీ నా నియోజకవర్గంలో పదేపదే పర్యటిస్తున్నారు అని ఖర్గే నిన్న సభలో ఫిర్యాదు చేశారు. నేను రావడం చూశారు ఆయన. ఆయన నియోజవర్గం కలబురిగిలోనే 8 లక్షలకుపైగా జన్‌ధన్ ఖాతాలు తెరిచిన విషయం కూడా చూశారు. అది చూశాకే ఆయనలో బాధ పెరిగింది.’ అన్నారు మోదీ.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 13, తెలంగాణలో2 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటి భర్తీకి మార్చ్ 13న పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఖాళీ అవుతున్న స్థానాలు ఇవే:
ఆంధ్రప్రదేశ్:
స్థానిక సంస్థల నియోజకవర్గాలు
1) అనంతపురం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గునపాటి దీపక్ రెడ్డి పదవీకాలం మార్చ్ 29తో పూర్తవనుంది.
2) కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) పదవీకాలం మార్చి 29తో ముగుస్తుంది.
3) నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పదవీ కాలం మే 1తో పూర్తవనుంది.
4) పశ్చిమ గోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంగర రామమోహన్ పదవీ కాలం మే 1తో ముగుస్తుంది
5) తూర్పుగోదావరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు పదవీకాలం మే 1తో ముగియనుంది.
6) శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు పదవీకాలం మే 1తో ముగియనుంది.
7) చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు పదవీ కాలం మే 1తో ముగియనుంది.
8) కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పదవీ కాలం కూడా మే 1తో ముగియనుంది.
ఉపాధ్యాయ నియోజకవర్గాలు
1) ప్రకాశం - నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం పదవీకాలం మార్చ్ 29తో ముగియనుంది.
2) కడప-అనంతపురం-కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పదవీకాలం మార్చ్ 29తో పూర్తికానుంది.
పట్టభద్రుల నియోజకవర్గాలు
1) శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పీవీఎన్ మాధవ్ పదవీకాలం మార్చి 29తో పూర్తవుతోంది.
2) కడప-కర్నూలు-అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పదవీకాలం మార్చి 29తో పూర్తవుతోంది.
3) ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి పదవీకాలం మార్చ్ 29తో ముగుస్తోంది.
తెలంగాణ
స్థానిక సంస్థల నియోజకవర్గం
1) హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ పదవీ కాలం మే 1తో పూర్తి కానుంది.
ఉపాధ్యాయ నియోజకవర్గం
1) మహబూబ్ నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి పదవీకాలం మార్చ్ 29తో పూర్తవుతోంది.
షెడ్యూల్ ఇదీ..
నోటిఫికేషన్‌ల విడుదల: ఫిబ్రవరి 16
నామినేషన్లకు తుదిగడువు: ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24
నామినేషన్ల ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 27
పోలింగ్: మార్చ్ 13
ఓట్ల లెక్కింపు: మార్చ్ 16
కాగా ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.