ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు సోమవారం నాడు భారత రాష్ట్ర సమితిలో చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, UGC
ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ నాయకులు కూడా తమతో మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రేశేఖరరావు పేర్కొన్నారు.
‘‘మీరు సిట్టింగులు కదా, మీరెందుకయ్యా పార్టీ మారడం అంటే.. ‘మేము ఫిట్టింగ్ అవడం లేదు సర్’ అంటున్నారు వాళ్లు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నాయకులు సోమవారం నాడు భారత రాష్ట్ర సమితిలో చేరారు. కేసీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తోట చంద్రశేఖర్, రావెల కిషోర్‌బాబు సహా పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రిటైర్డ్ ఐఏఎస్, వ్యాపారవేత్త తోట చంద్రశేఖర్ ఆ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన గతంలో వైయస్సార్ కాంగ్రెస్, ప్రజారాజ్యం, జనసేన పార్టీల్లో పనిచేశారు.
కాపునాడు నాయకుడు తాడిపాక రమేశ్, రిటైర్డ్ ఐఏఎస్ పార్థసారథి, కాపునాడు శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకుడు జె.టి.రామారావు, టి.జె.ప్రకాశ్‌లు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్ర నుంచి పెద్ద పెద్ద వాళ్లు తమతో మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖ ఉక్కు అమ్మకాన్ని అడ్డుకుంటామని, ఒకవేళ అమ్మకం జరిగిపోయినా, వెనక్కు ప్రభుత్వంలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పర్యటక రంగానికి ఊతమిచ్చేలా దుబయి కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్కహాల్‌పై అక్కడ విధించే 30 శాతం పన్నును రద్దు చేసింది.
అంతేకాదు.. దుబయిలో నివసించేవారు ఇంట్లోనే మద్యం సేవించడానికి కావాల్సిన లైసెన్సుల కోసం చార్జీలు వసూలు చేయడం ఆపేయనున్నారు.
దుబయిలో కొద్దిరోజులుగా ఆల్కహాల్‌కు సంబంధించిన చట్టాలకు సడలింపులు ఇస్తున్నారు. రంజాన్ సమయంలో పగటిపూట కూడా విక్రయించుకునేందుకు అనుమతులు ఇవ్వడం, కరోనా మహమ్మారి సమయంలో హోం డెలివరీ చేయడం వంటివన్నీ ఈ సడలింపులలో భాగమే.
తాజాగా పన్ను తొలగించడమనేది విదేశీ పర్యటకులను మరింతగా ఆకర్షించే దిశగా తీసుకున్న నిర్ణయమని చెప్తున్నారు.
దుబయిలో ఆల్కహాల్ పంపిణీలో ఉన్న రెండు ప్రధాన కంపెనీలు ఎంఐఎంఐ, ఆఫ్రికన్ అండ్ ఈస్టర్న్‌లు.. ఈ పన్నుల తగ్గింపు వల్ల వినియోగదారులకు ధరలు తగ్గిస్తామని ప్రకటించాయి.
అయితే, ఈ పన్ను తగ్గింపు తాత్కాలికమేనని.. ఒక ఏడాది మాత్రమే వర్తింపజేస్తారని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది.

ఫొటో సోర్స్, ANI
చండీగఢ్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం సమీపంలో ఒక లైవ్ బాంబ్ షెల్‌ను గుర్తించినట్లు చండీగఢ్ పోలీసులు తెలిపారు. బాంబు స్క్వాడ్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు చెప్పారు.
పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో ఆ బాంబ్ షెల్‌ను సురక్షితంగా ఉంచామని, ఆ పరిసరాలను ఖాళీ చేయించామని చండీగఢ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నోడల్ ఆఫీసర్ సంజీవ్ కోహ్లి వివరించారు.
అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చండీగఢ్‌లోని బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా తెలిపారు.
దర్యాప్తులో సాయం చేయటానికి సైనిక బృందం సాయం కూడా కోరినట్లు సంజీవ్ కోహ్లీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు మృతిచెందిన కేసులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీనివాస్ నిర్వహణలోని ‘ఉయ్యూరు ఫౌండేషన్’ గుంటూరులో ఆదివారం ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ల పంపిణీ తలపెట్టగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందడంతో పాటు మరికొందరు గాయపడ్డారు.

ఫొటో సోర్స్, TELEGRAM: HOREVICA / ZSU STRATCOM
యుక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత దోన్యస్క్ ప్రాంతంలో జరిపిన క్షిపణి దాడుల్లో దాదాపు 400 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ వెల్లడించింది.
మకివ్కా నగరంలో రష్యా దళాలు ఉన్న ఓ భవనాన్ని ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకుంది.
రష్యా అధికారులు ఘటనను ధ్రువీకరించారు. కానీ, ఎంతమంది చనిపోయారనేది చెప్పలేదు.
దోన్యస్క్‌లోని ఆక్రమిత ప్రాంతంలో రష్యాకు చెందిన సీనియర్ అధికారి డానిల్ బెజ్సోనోవ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం రోజున అర్ధరాత్రి 2 నిమిషాల తర్వాత క్షిపణి మకివ్కాపై దాడి చేసిందన్నారు.
‘అమెరికన్ ఎంఎల్‌ఆఎస్ (మల్టిఫుల్ లాంచ్ రాకెట్ సిస్టం) హిమార్స్ క్షిపణి వృత్తి విద్యా పాఠశాలను ధ్వంసం చేసింది’ అని చెప్పారు.
‘కొంతమంది చనిపోయారు, మరికొంతమంది గాయపడ్డారు. కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియదు’ అని బెజ్సోనోవ్ టెలిగ్రామ్ పోస్ట్‌లో తెలిపారు.
యుక్రెయిన్ మిలటరీ దాదాపు 400 మంది చనిపోయినట్లు, 300 మంది గాయపడ్డట్లు చెబుతోంది. నూతన సంవత్సరం రోజు రాత్రి దాదాపు 25 రాకెట్లు దాడులు చేశాయని రష్యా అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
కశ్మీర్‌లోని ఓ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు తీవ్రవాద దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆదివారం సాయంత్రం రాజౌరి జిల్లాలో మూడు ఇళ్లపై తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. సోమవారం అదే ఇళ్ల సమీపంలో పేలుడు సంభవించి ఓ చిన్నారి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.
పేలుడుకు గల కారణాలు వెంటనే తెలియరాలేదు. ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.
అయితే ఈ దాడుల కారణంగా రాజౌరిలో ప్రజలు నిరసనలు, సమ్మెలు చేపట్టారు. స్థానిక పాలనా యంత్రాంగం భద్రతా వైఫల్యాల వల్లే ఈ దాడులు జరిగాయని ఆరోపిస్తున్నారు.
"రాజౌరిలో జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని" ఖండిస్తున్నట్లు ఆ ప్రాంత పరిపాలనాధికారి మనోజ్ సిన్హా చెప్పారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.
"ఈ హేయమైన దాడి వెనుక ఉన్నవారిని శిక్షించకుండా ఉండబోనని ప్రజలకు హామీ ఇస్తున్నా" అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు.

భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ చేరనున్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో చంద్రశేఖర్‌తో పాటు ఇంకొంత మంది నాయకులు కూడా బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి భారీగా వాహనాల్లో బయలుదేరారు.
తోట చంద్రశేఖర రావుతో కీలక నేతలు రావెల కిషోర్ బాబు ఐఆర్ మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి ఇంకా పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో 1000, 500 రూపాయల నోట్లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 2016 నవంబర్ 8న పద్ధతి ప్రకారమే నోట్ల రద్దు నోటిఫికేషన్ జారీ అయిందని, అందులో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది.
అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
2016 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది.
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. నోట్ల రద్దు చట్టబద్ధమేనని, ఈ నిర్ణయాన్ని తప్పుగా చెప్పలేమని తీర్పులో పేర్కొంది.
అయితే, ఈ ధర్మాసనంలోని జస్టిస్ బీసీ నాగరత్న కేంద్రం వైఖరిని తప్పుబట్టారు.
నోట్ల రద్దు అంశం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టం రూపంలో వెలువరించాల్సిన నిర్ణయం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొన్న దాని ప్రకారం, నోట్ల రద్దుకు ముందు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐల మధ్య చర్చలు జరిగాయి.

ఫొటో సోర్స్, ANI
దిల్లీలో కారుతో యువతిని ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాట్లాడుతూ, ‘‘నేరస్థుల రాక్షస ప్రవర్తనతో దిగ్భ్రాంతి చెందాను’’ అని అన్నారు.
బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందేలా చూస్తామని వీకే సక్సేనా తెలిపారు. బాధ్యతాయుతమైన, సున్నిత సమాజం కోసం పాటుపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అవుటర్ దిల్లీ డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. యువతి శరీరం వెనుక భాగం, తల వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
సోషల్ మీడియాలో వస్తోన్న'రేప్ అండ్ మర్డర్' వాదనలను ఆయన తోసిపుచ్చారు. "ఇది కేవలం ప్రమాదం కేసు. బాధితురాలిపై లైంగిక వేధింపులు జరగలేదు" అని స్పష్టం చేశారు.
ఈ కేసులో అయిదుగురిని అరెస్టు చేశారని, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారని డీసీపీ సింగ్‌ను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
బీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌నుక్లిక్ చేయండి.