ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గుంటూరు సభలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది.
ఆదివారం సాయంత్రం చంద్రన్న సంక్రాంతి కానుక సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు చనిపోయినట్లు గుంటూరు జిల్లా ఎస్‌పీ ఆరిఫ్ హఫీజ్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగ కార్యక్రమంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ వస్త్రాల పంపిణీలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో వికాస్ నగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తోపులాట జరిగి ఒక మహిళ చనిపోయారు.
చంద్రబాబు సభ అనంతరం చంద్రన్న సంక్రాంతి కానుకల కోసం జనం తోసుకురావటంతో ఈ తొక్కిసలాట జరిగింది. సభ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు రోజుల కిందట.. డిసెంబర్ 28వ తేదీ రాత్రి నెల్లూరు జిల్లాలోని కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో తోపులాట జరిగి 8 మంది మురుగు కాల్వలో పడి చనిపోయారు.
భారతదేశంలో డిసెంబర్ నెలలో నిరుద్యోగిత 8.30 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) గణాంకాలు చెప్తున్నాయి.
ఇది 16 నెలల గరిష్ట రికార్డు స్థాయి అని సీఎంఐఈ పేర్కొంది. నవంబర్ నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉంది.
అలాగే నవంబర్ నెలలో పట్టణ నిరుద్యోగిత రేటు 8.96 శాతంగా ఉండగా.. డిసెంబర్ నెలలో అది 10.09 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగిత రేటులో కాస్త తగ్గుదల నమోదైంది.
నవంబర్ నెలలో గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.55 శాతంగా ఉండగా, డిసెంబర్ నెలలో అది 7.44 శాతానికి తగ్గింది.
అయితే ఈ నిరుద్యోగిత రేటు గణాంకాలు కనిపిస్తున్నంత తీవ్రంగా లేవని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ పేర్కొన్నారు. శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు డిసెంబర్ నెలలో 40.48 శాతానికి పెరిగిందని, 12 నెలల్లో ఇది గరిష్ట స్థాయి రికార్డు అని ఆయన చెప్పారు.
‘‘చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డిసెంబర్‌లో ఉద్యోగకల్పన రేటు 37.1 శాతానికి పెరిగింది. 2022 జనవరి నుంచి చూస్తే ఇది రికార్డు స్థాయి’’ అని ఆయన తెలిపారు.
సింగపూర్ సహా 5 దేశాలనుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌ను తప్పనిసరి చేసింది.
విమానశ్రయాల్లో చెకింగ్‌ను కట్టుదిట్టం చేసింది.
‘‘తప్పనిసరిగా ఎయిర్ సువిధా ఫామ్‌ను నింపాల్సి ఉంది. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు నెగిటివ్ రిపోర్టును సమర్పించాలి’’ అని అధికారులు తమను అడిగారని సింగపూర్ నుంచి దిల్లీ విమానశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడు తెలిపాడు.
వాణిజ్యపరంగా వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరిగింది. ఒక్కో సిలిండర్‌పై ధర రూ.25 పెంచారు.
పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది.
ఈ పెంపుతో దేశ రాజధాని దిల్లీలో ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,769కు చేరుకుంది.
గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలిండర్ ధర మాత్రం పెరగలేదు.
మహబూబాబాద్ జిల్లా కురవి సమీపంలో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో లారీ నుంచి భారీ గ్రానైట్ రాళ్లు పక్కగా వెళ్తున్న ప్రయాణికుల ఆటోపై పడ్డాయి.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
గాయపడ్డ వారిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాట్రపల్లి గ్రానైట్ క్వారీ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న గ్రానైట్ వాహనం కురవి పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.
దీంతో భారీ గ్రానైట్ రాళ్లు ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో ఇద్దరిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంలో మరణించిన ముగ్గురూ ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి మంగోలి గూడెం గ్రామం నుంచి కురవికి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
భారీ గ్రానైట్ రాళ్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో క్రేన్‌ల సహాయంతో వాటిని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నందున వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
గ్రేటర్ కైలాశ్ 2, బ్లాక్ ‘ఈ’లో ఉన్న సీనియర్ సిటిజన్ కేర్ హోమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు.
ఆరుగుర్ని ఈ మంటల బారి నుంచి రక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించారు.
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు దిల్లీ ఫైర్ సర్వీసు తెలిపింది.
ప్రమాదానికి గల కారణాలను కనుగొంటున్నట్టు పేర్కొంది.
చైనా, హాంకాంగ్, మకావుల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసింది కెనడా.
దీంతో ఈ పరీక్షలను తప్పనిసరి చేసిన దేశాల జాబితాల్లో కెనడా కూడా చేరింది.
కఠినతరమైన జీరో-కోవిడ్ పాలసీ నుంచి చైనా వెనక్కి తగ్గడంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో, చైనా, హాంకాంగ్, మకావుల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ పరీక్షలను తప్పనిసరి చేసినట్టు కెనడియన్ టీవీ నెట్‌వర్క్ సీటీవీ తెలిపింది.
ఈ కొత్త నిబంధనలు జనవరి 5 నుంచి అమల్లోకి రానున్నాయని కెనడా ప్రభుత్వం తెలిపింది.
రెండేళ్లు, లేదా అంతకంటే పెద్ద వయసు కలిగిన ప్రయాణికులందరూ కూడా కెనడాలో ఉండేందుకు వచ్చే సమయంలో నెగిటివ్ టెస్ట్ రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.
కొత్త సంవత్సరం తొలి రోజే దిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంపం వచ్చింది.
రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(ఎన్‌సీఎస్) తెలిపింది.
01-01-2023న అర్థరాత్రి 1.19 గంటలకు 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
భూ ఉపరితలానికి 5 కి.మీ లోపల ఈ భూకంపాన్ని గుర్తించినట్టు తెలిపింది.
హరియాణాలోని జజ్జర్ ప్రాంతంలో ఈ ప్రకంపనల కేంద్రం ఉన్నట్లు సెస్మాలజీ విభాగం వెల్లడించింది.