రిషబ్ పంత్‌ను అవసరమైతే విమానంలో దిల్లీ తరలిస్తాం: దిల్లీ క్రికెట్ అసోసియేషన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషభ్ పంత్‌ను అవసరమైతే విమానంలో దిల్లీకి తరలిస్తామని దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ అన్నారు.
రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) బృందం డెహ్రడూన్ వెళ్తుందని శ్యామ్ శర్మ తెలిపారు.
అవసరమైతే రిషభ్ పంత్‌ను దిల్లీకి తరలిస్తామని, ప్లాస్లిక్ సర్జరీ కోసం విమానంలో దిల్లీకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని శర్మ అన్నారు.
చికిత్స పొందుతున్న రిషభ్ పంత్‌ను చూసేందుకు నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్‌లు మ్యాక్స్ ఆసుపత్రికి వచ్చారు. ‘‘రిషభ్ పంత్‌ను, అతని తల్లిని కలిశాం. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం’’ అని వారన్నారు.
తర్వాత రిషభ్ పంత్ వస్తువులను, నగదును దొంగలించినట్లు వస్తున్న వార్తాలు అవాస్తవమని హరిద్వార్ ఎస్‌పీ తెలిపారు. ఆయన ప్లాటినం చెయిన్, గోల్డ్ బ్రాస్‌లెట్, రూ.4000 నగదును వారి కుటుంబానికి అప్పజెప్పామని చెప్పారు.
రిషభ్ పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశిల్ కుమార్, కండక్టర్ పరమ్‌జీత్‌లను పానిపట్ బస్సు డిపార్ట్‌మెంట్ సత్కరించింది.
గురుకుల్ నార్సన్ సమీపంలోని డివైడర్‌ను ఢీకొంటూ ఒక కారు అదుపు తప్పింది. ప్రమాదానికి గురైన కారులో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు వారు కారు వద్దకు పరుగులు తీసినట్టు తెలిపారు.
‘రిషభ్ పంత్‌ను మేము బయటికి లాగిన 5 నుంచి 7 సెకన్లలోనే కారుకి మంటలంటుకున్నాయి. అతనికి వెనుకవైపు తీవ్రంగా గాయాలయ్యాయి. మేము అతని గురించి అడగగా..తానొక భారత క్రికెటర్‌నని చెప్పాడు’’ అని రిషభ్ పంత్‌ను కాపాడిన బస్సు కండక్టర్ పరమ్‌జీత్ తెలిపాడు.