You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

న్యూ ఇయర్ 2023: వెలుగు జిలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం... ప్రపంచవ్యాప్తంగా వేడుకలు

భూగోళం మీద మొట్టమొదటిగా పసిఫిక్ దీవి దేశమైన కిరిబాటికి 2023 కొత్త సంవత్సరం వచ్చింది. ఆ తర్వాత గంట సేపటికి న్యూజీలాండ్‌లోకి కొత్త ఏడాది ప్రవేశించింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్‌లాండ్‌ నగరంలోని స్కై టవర్ మీది నుంచి బాణసంచా పేల్చారు. వివిధ దేశాల్లో న్యూఇయర్ సందడి ఎలా ఉందో చూడండి.

లైవ్ కవరేజీ

  1. భీమా కోరేగావ్: గౌతమ్ నవ్‌లఖాకు సుప్రీం కోర్టు బెయిల్, ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన హాంగ్ కాంగ్, చైనా, తైవాన్‌

    హాంగ్ కాంగ్, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు కొత్త సంవత్సరం వచ్చేసింది.

    చైనా, తైవాన్, సింగపూర్‌లు కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయి.

  4. అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ అరెస్ట్

  5. దక్షిణ కొరియా, జపాన్‌లకు కొత్త సంవత్సరం...

    కొత్త సంవత్సరం దక్షిణ కొరియా, జపాన్‌లను చేరుకుంది.

    దక్షిణ కొరియా రాజధాని సోల్ నగరంలో ప్రజలు సంబరాలు చేసుకుంటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు.

    జపాన్ కూడా 2022 సంవత్సరానికి వీడ్కోలు చెప్పి 2023 సంవత్సరానికి స్వాగతం పలికింది.

  6. కొత్త సంవత్సరం నేపథ్యంలో.. యుక్రెయిన్ మీద రష్యా భారీ క్షిపణి దాడులు

    యుక్రెయిన్‌లోని పలు ప్రాంతాల మీద రష్యా శనివారం నాడు క్షిపణులతో దాడి చేసిందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

    రాజధాని కీయెవ్ నగరంలో పలు పేలుళ్లు సంభవించాయని, ఒకరు చనిపోయారని మేయర్ విటాలీ క్లిష్చెకో చెప్పారు. ఒక హోటల్ కూడా దెబ్బతిన్నది.

    యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రెండు రోజుల కిందట భారీ స్థాయి గగనతల దాడులు చేసింది.

    యుక్రెయిన్ ప్రజలు ‘‘కొత్త సంవత్సర వేడుకలను చీకట్లో జరుపుకునేలా’’ చేయటానికి రష్యా మరిన్ని దాడులు చేయవచ్చునని అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ ముందే హెచ్చరించారు.

    రష్యా గత కొద్ద నెలలుగా యుక్రెయిన్ ఇంధన రంగం లక్ష్యంగా దాడులు చేస్తోంది. విద్యుత్ స్టేషన్లను ధ్వంసం చేస్తుండటంతో ఈ చలికాలంలో లక్షలాది మంది ప్రజలు చీకట్లో కూరుకుపోయారు.

    యుక్రెయిన్ ప్రజల కొత్త సంవత్సర వేడుకలను దాడులతో పాడు చేయాలనుకున్న రష్యా లక్ష్యం నెరవేరదని యుక్రెయిన్ సీనియర్ అధికారులు కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

  7. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు ఇలా...

    న్యూజీలాండ్‌ తర్వాత ఆస్ట్రేలియాకు కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సందర్భంగా సిడ్నీ నగరంలో భారీ ఎత్తున బాణసంచా వెలుగులు విరజిమ్మాయి.

  8. న్యూజీలాండ్‌లో కొత్త సంవత్సరం వేడుకలు ఇలా జరిగాయి

    న్యూజీలాండ్‌కు కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్‌లాండ్‌ నగరంలో గల స్కై టవర్ మీది నుంచి బాణసంచా పేల్చారు.

  9. న్యూ ఇయర్ 2023: న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలకు కొత్త సంవత్సరం వచ్చేసింది...

    న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాలకు కొత్త సంవత్సరం 2023 వచ్చేసింది.

    భూగోళం మీద మొట్టమొదటిగా పసిఫిక్ దీవి దేశమైన కిరిబాటికి 2023 కొత్త సంవత్సరం వచ్చింది.

    ఆ తర్వాత గంట సేపటికి న్యూజీలాండ్‌కు కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్‌లాండ్‌ నగరంలో గల స్కై టవర్ మీది నుంచి బాణసంచా పేల్చారు.

    ఆ తర్వాత ఆస్ట్రేలియాకు కొత్త సంవత్సరం వచ్చింది. ఈ సందర్భంగా సిడ్నీ నగరంలో భారీ ఎత్తున బాణసంచా వెలుగులు విరజిమ్మాయి.

  10. 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేస్తారు, మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి?

  11. 2022లో లక్షల వ్యూస్ కొల్లగొట్టిన 6 వైరల్ వీడియోలు ఇవే...

  12. కనీస వేతనాలతో జీవిస్తున్న మహిళలు 2022లో ఏమేం వదులుకున్నారు?

  13. మాజీ పోప్ బెనెడిక్ట్ XVI కన్నుమూత, పాల్ కిర్బి, ఎమిలి మెక్‌గార్వీ, బీబీసీ న్యూస్ లండన్

    మాజీ పోప్ 16వ బెనెడిక్ట్ శనివారం నాడు వాటికన్‌లో తన నివాసంలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.

    ఆయన వయసు 95 సంవత్సరాలు.

    జర్మనీలో జన్మించిన జోసెఫ్ రాట్జింగర్.. 78 ఏళ్ల వయసులో 2005లో పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయన 16వ బెనెడిక్ట్‌ను తన పేరుగా ఎంచుకున్నారు. పోప్‌గా ఎన్నికైన అత్యధిక వయసున్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.

    అయితే పోప్‌గా 8 ఏళ్లు కూడా పూర్తవకుండానే 2013లో ఆ పదవి నుంచి అనారోగ్య కారణంగా తప్పుకున్నారు. అలా పోప్ పదవి నుంచి దిగిపోయిన దాదాపు దశాబ్దం తర్వాత శనివారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు.

    పోప్ బెనెడిక్ట్ పదవిలో ఉన్న కాలంలో క్యాథలిక్ చర్చి పలు ఆరోపణలను, న్యాయ వివాదాలను ఎదుర్కొంది. మతాధికారులు దశాబ్దాల పాటు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారన్న అంశంపై అధికారిక నివేదికలు వెలుగుచూశాయి.

    తాను మ్యూనిచ్‌లో 1977 నుంచి 1982 వరకూ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న కాలంలో.. అటువంటి అకృత్యాల కేసుల పరిష్కారం విషయంలో పొరపాట్లు జరిగాయని పోప్ బెనెడిక్ట్ ఈ ఏడాది ఆరంభంలో అంగీకరించారు.

    బెనెడిక్ట్ తన చివరి సంవత్సరాలను వాటికన్ పరిధిలోని మేటర్ ఎక్స్‌లెసీయా మొనాస్ట్రీలో గడిపారు.

    ఆయన తర్వాత పోప్ అయిన ఫ్రాన్సిస్.. ఆ మొనాస్ట్రీలో బెనడిక్ట్‌ను తాను తరచుగా సందర్శించేవాడినని చెప్పారు.

    ‘‘పోప్ ఎమిరైటస్ బెనడిక్ట్ ది సిక్స్‌టీన్త్.. వాటికన్‌లోని మేటర్ ఎక్స్‌లెసీయా మొనాస్ట్రీలో ఈ రోజు ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని నేను విషాదంతో తెలియజేస్తున్నా’’ అని వాటికన్ ఒక ప్రకటనలో చెప్పింది.

    మాజీ పోప్ భౌతికకాయాన్ని జనవరి 2వ తేదీ నుంచి సెయింట్ పీటర్స్ బసిలికాలో ‘‘విశ్వాసుల’’ సందర్శన కోసం ఉంచుతామని తెలిపింది. ఆయన అంత్యక్రియల ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

  14. అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ అరెస్టు

    తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో అయ్యప్ప స్వామి పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    వరంగల్ దగ్గర్లో అతణ్ణి అరెస్ట్ చేసినట్టు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు తెలిపారు.

    అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతంపై నరేశ్ మాట్లాడిన వీడియో వైరల్ అయింది.

    దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు, ఇతర హిందూ సంఘాల వారూ తీవ్రంగా స్పందించారు.

    తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యల ఫిర్యాదులు దాఖలు చేశారు అయ్యప్ప భక్తులు. కనీసం వందకు తగ్గకుండా ఫిర్యాదులు నరేశ్‌పై అందినట్టు తెలుస్తోంది.

    రాజా సింగ్‌పై పెట్టినట్టుగా నరేశ్‌పై కూడా పీడీ యాక్ట్ పెట్టాలని వారు డిమాండ్ చేశారు. నరేశ్ మాట్లాడిన సభా వేదికపై బీఎస్పీ నాయకులు కూడా ఉన్నారు.

    అయితే, నరేశ్‌కి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బీఎస్పీ తెలంగాణ విభాగం ప్రకటించింది.

    మత విద్వేషాలను రెచ్చగొట్టిన నేరం కింద అతనిపై కేసు నమోదు చేశారు.

  15. బీజేపీనే నా గురువు.. రాహుల్ గాంధీ

    బీజేపీని తన గురువుగా భావిస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

    వారే తనకు ఒక మార్గాన్ని చూపించారని, ఇప్పటి వరకు ఏం చేయకూడదో తనకు ఎప్పటికప్పుడు చెబుతుంటారని అన్నారు.

    బీజేపీ తనపై మరిన్ని తీవ్ర ఆరోపణలు చేయాలని తాను కోరుకుంటున్నానని, ఇది వారి భావాజాలం ఏంటో అర్ధం చేసుకునేందుకు సాయపడుతుందని అన్నారు.

    ‘‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర ప్రారంభించినప్పుడు నేను దీనినొక సాధారణ యాత్రగానే తీసుకున్నాను. కానీ, ఈ యాత్రకి కూడా ఎన్నో స్వరాలు, అనుభవాలు ఉన్నాయని మెల్లగా మేము అర్థం చేసుకున్నాం. నేను బీజేపీకి, ఆర్‌ఎస్‌ఎస్‌కి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే వారు ఎంత ఎక్కువగా మమ్మల్ని టార్గెట్ చేశారో, అంతే స్థాయిలో లేదా మరో రకంగా ఇది మాకు మేలు చేసింది’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

    భారత్ జోడ్ యాత్రలో చేరేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉందని, తమలో కలిసేందుకు తాము ఎవర్ని కూడా అడ్డుకోమని స్పష్టం చేశారు.

    అఖిలేష్, మాయావతి, ఇతరులు ప్రేమపూర్వకమైన హిందూస్తాన్ కావాలనుకుంటున్నారని, భావాజాలం విషయంలో తమ మధ్య సాన్నిహిత్యం ఉందని రాహుల్ గాంధీ అన్నారు.

  16. 2022లో చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారిణులు వీరే

  17. నూతన సంవత్సర వేడుకలకు పోటెత్తిన పర్యాటకులు.. మనాలి రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్

    కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, మనాలిలో భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.

    న్యూ ఇయర్ 2023 వేడుకలను చాలా మంది మనాలి కొండ ప్రాంతాల్లో జరుపుకునేందుకు పయనమయ్యారు.

    దీంతో మనాలికి వెళ్లే మార్గాలన్ని వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.

    పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

    మనాలితో పాటు షిమ్లా కూడా పర్యాటకులతో కళకళలాడుతోంది. న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నారు.

    నూతన సంవత్సర వేడుకలకు ముందు జమ్ములో ఉన్న మాత వైష్ణో దేవి ఆలయంలో కూడా భక్తుల రద్దీ నెలకొంది.

  18. మనిషి మెదళ్లను తినే ప్రాణాంతకమైన అమీబా ఇది, ఎలా సోకుతుంది?

  19. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మృతి పట్ల ప్రపంచ దేశాల నేతలు సంతాపాలు

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ప్రపంచ దేశ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

    ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లిని కోల్పోయిన సందర్భంగా నేను, జిల్ కలిసి మా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో ప్రధాన మంత్రి, ఆయన కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.’’ అని బిడెన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

    బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల తన సంతాపం తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

  20. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ

    2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని కాంగ్రెస్ నేత, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు.

    దేశవ్యాప్తంగా సాగుతున్న భారత్ జోడో యాత్రకు సారథ్యం వహించడంపై రాహుల్ గాంధీని కొనియాడారు. ఆయన అధికారం కోసం రాజకీయం చేయడం లేదని, దేశ ప్రజల కోసమే చేస్తున్నారని పీటీఐకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

    2024 లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీ కేవలం విపక్షాల అభ్యర్థి మాత్రమే కాదని, విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా కూడా ఈయనే బరిలోకి దిగుతారని కమల్ నాథ్ చెప్పారు.

    గాంధీ కుటుంబం కాకుండా.. దేశం కోసం మరెవరూ ఇన్ని త్యాగాలు చేయలేదని, బీజేపీ మొత్తం విపక్షాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.