గుజరాత్‌లోని మోర్బీలో జరిగిన వంతెన ప్రమాదంపై భారత అత్యున్నత న్యాయస్థానం నవంబర్ 14 ఆదివారం విచారణ చేపట్టనుంది.
ఈ వంతెన ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 135 మంది చనిపోయినట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేసింది.
దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ ఘటనపై విచారణ జరపాలని కోరుతూ సోమవారం లాయర్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) దాఖలు చేశారు.
తివారీ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నవంబర్ 14న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఈ కేసుపై ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణ జరపాలని, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాత నిర్మాణాల భద్రతా తనిఖీలు జరపాలని లాయర్ తివారీ తన పిటిషన్‌లో కోరారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి విపత్తు దర్యాప్తు బృందాలు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ పిల్‌ను బీబీసీ చూసింది. పర్యావరణ భద్రత కోసం పాత స్మారక చిహ్నాలు, వంతెనలను సర్వే చేసి, కూలిపోయే ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకను దిశానిర్దేశం చేయాలని తివారీ సుప్రీంకోర్టును కోరారు.
రాష్ట్రాలలో నిర్మాణ సంఘటనల దర్యాప్తు విభాగాలను (కన్స్ట్రక్షన్ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) ఏర్పాటు చేయాలని, వాటి ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సత్వర చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని పిల్‌లో పేర్కొన్నారు. అలాగే, ప్రభుత్వ నిర్మాణాల భద్రత, పర్యవేక్షణ కూడా ఈ విభాగం విధుల్లో భాగం కావాలని కోరారు.
మోర్బీ బ్రిడ్జి కూలిపోవడంపై తివారీ మాట్లాడుతూ, "ఇటువంటి సంఘటనలు ప్రభుత్వ అధికారుల బాధ్యతా లోపం, తీవ్ర నిర్లక్ష్యం, పరిపాలన వైఫల్యాని తెలియజేస్తాయి" అన్నారు. అందుకే, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమషంలో పూర్తి విచారణ జరగాలని కోరుతున్నట్టు బీబీసీతో చెప్పారు.
వంతెన నిర్వహణ, మరమ్మత్తులను ఒక ప్రైవేట్ ఆపరేటర్‌కు అప్పగించారని, వారు ఈ పనిలో పూర్తిగా విఫలమయ్యారని తివారీ పిల్‌లో పేర్కొన్నారు.
"ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని, సుప్రీంకోర్టు ఈ విషయంపై ఒత్తిడి తేవాలని" తివారీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.