మునుగోడు: ‘ఖాతాల్లో డబ్బుల’ మీద కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

ఓటర్లను కొనుగోలు చేసేందుకు సుమారు రూ.5.22 కోట్ల మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు రాజ్‌గోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా బదిలీ చేసిందని టీఆర్‌ఎస్ ఆరోపించింది.

లైవ్ కవరేజీ

  1. రాహుల్ గాంధీ పాదయాత్రలో పిల్లలతో పరుగు పందెం...

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, UGC

    భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆదివారం ఉదయం కొందరు పిల్లల బృందంతో పరుగు పందెం చేశారు.

    పిల్లలతో కలిసి రాహుల్ పరుగు తీయటం, వారి వెనుకే కాంగ్రెస్ నాయకులు కూడా పరుగు పెట్టటం దృశ్యాల వీడియోలను కాంగ్రెస్ పార్టీ, నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    గొల్లపల్లి వద్ద యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తన వద్దకు వచ్చిన పిల్లలతో మాట్లాడారు. అంతలోనే ‘రేస్ లగావోగే’ అని వారితో మాట్లాడుతూ పరుగు అందుకోవటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

    ప్రస్తుతం 52 ఏళ్ల వయసున్న రాహుల్‌తో పాటు ఆ పిల్లలు కూడా పరుగు అందుకున్నారు. వారితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పరుగుతీశారు.

    రాహుల్ పరుగు పందెం వీడియో సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. జగన్‌పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది

  3. దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం, నోమ్సా మసేకో, నొబుహ్లే సిమిలేన్ – బీబీసీ న్యూస్, డర్బన్

    కింగ్ మిసుజులు కా జ్వెలితిని
    ఫొటో క్యాప్షన్, కింగ్ మిసుజులు కా జ్వెలితిని సంప్రదాయ వస్త్రధారణ అయిన చిరుత పులి చర్మం ధరించి ఈ పట్టాభిషేకంలో పాల్గొన్నారు
    దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం
    ఫొటో క్యాప్షన్, వేలాది మంది జులు ప్రజలు సంప్రదాయ దుస్తులు చిరుతపులి చర్మం ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

    దక్షిణాఫ్రికాలో కొత్త జులు రాజుకు పట్టాభిషేకం జరిగింది. తీర ప్రాంతమైన డర్బన్ నగరంలో జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.

    డర్బన్ నగరంలో జరిగిన ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో కింగ్ మిసుజులు కా జ్వెలితినిని లాంఛనంగా చక్రవర్తిగా గుర్తిస్తూ దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా ధృవపత్రం అందించారు.

    దక్షిణాఫ్రికా 1994లో స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తొలి జులు పట్టాభిషేక కార్యక్రమం ఇది.

    జులు గత రాజు కింగ్ గుడ్‌విల్ జ్వెలితిని గత ఏడాది చనిపోయారు. ఆయన వారసుడి ఎంపిక కోసం అప్పటి నుంచీ తీవ్ర సంఘర్షణ సాగింది.

    కింగ్ గుడ్‌విల్ జ్వెలితిని అత్యంత సుదీర్ఘకాలం పాటు జులు చక్రవర్తిగా ఉన్నారు. యాభై ఏళ్లకు పైగా సింహాసనంలో కొనసాగిన ఆయనకు ఆరుగురు భార్యలు, 26 మంది సంతానం ఉన్నారు.

    ఆయన మరణానంతరం ఆయన భార్యను (కింగ్ మిసుజులు తల్లిని) రాణిగా ప్రకటించారు. అయితే ఆమె కూడా నెల రోజుల్లోనే హఠాత్తుగా చనిపోయారు. దీంతో సింహాసనం కోసం పోరాటం ముదిరింది.

    దక్షిణాఫ్రికాలో కొత్త జులు చక్రవర్తికి పట్టాభిషేకం

    ఫొటో సోర్స్, Getty Images

    ఎట్టకేలకు కింగ్ మిసుజులు చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాజ్యాన్ని, ప్రజలను కింగ్ మిసుజులు సమైక్యం చేస్తారని తాను నమ్ముతున్నట్లు ఆయన సోదరుడు యువరాజు బాంబినడ్లోవు జులు బీబీసీతో పేర్కొన్నారు.

    ‘‘జులులు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్న ఈ సమయంలో చరిత్ర నన్ను ఎంచుకుందని నేను భావిస్తున్నా. పేదరికం, నిరుద్యోగం, ప్రభుత్వం మీద, సంప్రదాయ నాయకత్వం మీద విశ్వాస లోపం, వాతావరణ మార్పు, ఆహార అభద్రత అనేవి ఆ సవాళ్లు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావటానికి నేను వారధిగా పనిచేస్తానని ఆశిస్తున్నా’’ అని కింగ్ మిసుజులు తన తొలి ప్రసంగంలో చెప్పారు.

    అమాజులు జాతిని కలిపి ఉంచే ఆధారం కింగ్ మిసుజులు అని అధ్యక్షుడు రామఫోసా అభివర్ణించారు.

    జులు సంస్కృతికి ప్రత్యేకమైన చిరుతపులి చర్మాన్ని శరీరంపై ధరించి కింగ్ మిసుజులు పట్టాభిషిక్తులయ్యారు.

  4. దక్షిణ కొరియా: సియోల్ హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 151 మంది మృతి

    దక్షిణ కొరియా తొక్కిసలాట

    ఫొటో సోర్స్, AFP

    దక్షిణ కొరియా రాజధాని సోల్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 151 మంది మరణించారు. మరో 82 మంది గాయపడ్డారు.

    మృతుల్లో 19 మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    హాలోవీన్ వేడుకలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావడంతో రద్దీ ఏర్పడి తొక్కిసలాట జరిగింది.

    చాలామంది ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాగా మరికొందరు కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.

    కోవిడ్ అనంతరం మాస్కులు ధరించకుండా తొలిసారి నిర్వహిస్తున్న హాలోవీన్ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ఇటైవాన్ ప్రాంతానికి జనం వెల్లువెత్తారు.

    ఈ ప్రాంతం నైట్‌లైఫ్‌కి ప్రసిద్ధి. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ఒక ఇరుకు వీధిలోకి జనం పోటెత్తటంతో.. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని, జనం ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్తున్నారు.

  5. యుక్రెయిన్ ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామన్న రష్యా

    రష్యా, యుక్రెయిన్ యుద్ధం

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌ తన నల్ల సముద్రం ఓడరేవుల నుంచి ఆహార ధాన్యాలను ఎగుమతి చేయటానికి అంతర్జాతీయ జోక్యంతో జరిగిన ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది.

    క్రైమియా వద్ద నల్ల సముద్రంలో తమ నౌకల మీద యుక్రెయిన్ డ్రోన్ దాడి చేసిందని ఆరోపిస్తున్న రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

    అయితే ఈ దాడి తాము చేసిందేనని యుక్రెయిన్ అంగీకరించలేదు. రష్యా ఎత్తుగడ ముందుగా ఊహించినదేనని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

    శనివారం తమ నౌకాదళం మీద జరిగిన దాడిలో బ్రిటన్ బలగాల పాత్ర కూడా ఉందని రష్యా ఆధారాలు ఇవ్వకుండా ఆరోపించింది.

    గత నెలలో గ్యాస్ పైప్‌లైన్లను బ్రిటన్ పేల్చివేసిందని కూడా రష్యా ఆరోపించింది.

    రష్యా భారీ స్థాయిలో తప్పుడు వాదనలను ప్రచారం చేస్తోందంటూ బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది.

    ఆహార ధాన్యాల ఒప్పందంలో పాలుపంచుకుంటున్న తమ నౌకలు లక్ష్యంగా శనివారం నాడు డ్రోన్ దాడి జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్తోంది. ఆ దాడిలో ఒక నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది.

    కొన్ని గంటల తర్వాత రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ మాస్కోలో ఒక ప్రకటన విడుదల చేసింది.

    ‘‘నల్ల సముద్రం ఒప్పందంలో పాలుపంచుకునే పౌర సరకు నౌకల భద్రతకు రష్యా హామీ ఇవ్వలేదు. ఆ ఒప్పందం అమలును నేటి నుంచి నిరవధికంగా నిలిపివేస్తున్నాం’’ అని చెప్పింది.

    ‘‘బ్రిటన్ నిపుణుల సారథ్యంలో యుక్రెయిన్ సాయుధ బలగాల చర్యలకు’’ ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ‘‘ఆహార ధాన్యాల సరఫరా కోసం మానవతా కారిడార్‌ కొనసాగేలా చూస్తున్న రష్యా నౌకలు లక్ష్యంగా’’ ఆ చర్యలు ఉన్నట్లు ఆరోపించింది.

    ఆ దాడికి పాల్పడ్డ 16 వాయు, సముద్ర డ్రోన్లను ధ్వంసం చేశామని.. ఒక మైన్‌స్వీపర్ నౌక మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నదని రష్యా చెప్పింది.

    ఇది వాస్తవమేనా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

  6. గుడ్ మోర్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.