ములాయం సింగ్ యాదవ్ అస్తమయం
సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు.
ఆయన వయసు 82 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ములాయంను అక్టోబర్ 2వ తేదీన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడ చికిత్స పొందుతున్న ములాయం సోమవారం ఉదయం 8:16 గంటలకు తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయాన్ని ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ ధృవీకరించారు.
ములాయం సింగ్ యాదవ్ గత కొన్ని రోజులుగా మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.
ఈ ఏడాది జులైలో ములాయం భార్య సాధనా గుప్తా మరణించారు.
ప్రజాస్వామ్యం కోసం పోరాడిన సైనికుడు: ప్రధాని మోదీ సంతాపం
ములాయం సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల్లో ఆయన విశిష్టమైన నేత అని మోదీ కొనియాడారు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన కీలకమైన సైనికుడని, రక్షణ మంత్రిగా బలమైన భారతదేశం కోసం కృషి చేశారని ములాయంను కీర్తించారు. ఆయన మృతి తనకు బాధ కలిగిస్తోందని చెప్పారు.
ములాయంకు, తనకు మధ్య తాము ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుంచీ ఉన్న సంబంధాలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశారు.
ములాయం మృతికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు సంతాపం తెలిపారు.